సచివాలయంలో ‘పదోన్నతుల’ కలకలం
ABN , First Publish Date - 2021-08-28T08:10:10+05:30 IST
‘ఆర్థిక శాఖలో అక్రమ పదోన్నతులు’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం సచివాలయంలో సంచలనం సృష్టించింది.
- సంచలనం సృష్టించిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం
- ఎక్కడా నిబంధనల ఉల్లంఘనలు జరగలేదు
- అన్ని అనుమతుల తర్వాతే పదోన్నతి ఇచ్చాం
- సీఎం కేసీఆర్ అనుమతి సైతం తీసుకున్నాం
- ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వివరణ
హైదరాబాద్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ‘ఆర్థిక శాఖలో అక్రమ పదోన్నతులు’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం సచివాలయంలో సంచలనం సృష్టించింది. ఏఎస్‌వోల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకూ దీనిపైనే చర్చించుకున్నారు. సచివాలయంలోని వివిధ శాఖల్లో ఉన్న ఏఎ్‌సవోలు, ఎస్వోలు, ఏఎస్‌లు, డీఎస్‌లు, జేఎస్‌లు, అదనపు సెక్రటరీలకు రెండేళ్లుగా పదోన్నతులు కల్పించలేదు. ఈ విషయమై నెల రోజులుగా తర్జనభర్జన సాగుతోంది. పదోన్నతులు కల్పించాలంటూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఎదుట ఏఎ్‌సవోలు, ఎస్వోలు ధర్నా చేశారు. ఇలా.. ఒక వైపు పదోన్నతుల గొడవ నడుస్తుంటే... మరోవైపు ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీల రోస్టర్ జాబితాలో 20వ స్థానంలో ఉన్న అధికారిణికి డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి ఇవ్వబోతున్నారన్న విషయం వెలుగులోకి రావడం ప్రకంపనలు సృష్టించింది. అయితే, ఈ అంశంపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్పందించారు. పదోన్నతుల కమిటీ సిఫారసుల అనంతరం, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పదోన్నతి కల్పించామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, పరిపాలనా సౌలభ్యం కోసం అర్హులైనవారికి పదోన్నతులు ఇవ్వడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. రోస్టర్, సీనియారిటీ నిబంధనలు సైతం పాటించామని వెల్లడించారు. ఆర్థిక శాఖలో అవసరానికి మించి సిబ్బంది లేరని వివరించారు. వేతన సవరణ కమిషన్, రవాణా, ప్రొటోకాల్, హెచ్ఎండీఏ విభాగాల్లో 11 మంది పని చేస్తున్నారని తెలిపారు. అదనపు కార్యదర్శి పదోన్నతి విషయంలో బిజినెస్ రూల్స్/ సర్వీస్ రూల్స్‌ను పాటించామని, సీఎం అనుమతి తీసుకున్నామని వివరించారు.
5 సూపర్ న్యూమరరీ పోస్టులు
సాధారణ పరిపాలన శాఖలో ఐదు సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు (జీవో 94)జారీ చేశారు. అడిషనల్ సెక్రటరీ పోస్టులు 3, డిప్యూటీ సెక్రటరీ పోస్టు ఒకటి, అసిస్టెంట్ సెక్రటరీ పోస్టు ఒకటి కలిపి 5 పోస్టులు కొత్తగా సృష్టించారు. రెగ్యులర్ వేకెన్సీ ఏర్పడినా, ప్రభుత్వం రద్దు చేసినా.. ఈ పోస్టులు రద్దవుతాయని పేర్కొన్నారు.