వైరస్‌ వ్యాప్తిని ఊహించలేం

ABN , First Publish Date - 2020-03-27T10:40:03+05:30 IST

డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వైద్య నిపుణుడు. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత. ఎయిమ్స్‌లో కార్డియాలజీ విభాగం అధినేతగా పని చేశారు. హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌

వైరస్‌ వ్యాప్తిని ఊహించలేం

వానాకాలంలోగా నియంత్రించాలి

జూన్‌ నెల వరకూ పటిష్ఠ చర్యలు తప్పనిసరి

రాబోయే రెండు, మూడు వారాలు అత్యంత కీలకం

వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ తప్పనిసరి

దానితో 80 శాతం వ్యాప్తిని అడ్డుకోవచ్చు

విదేశాల నుంచి వచ్చిన వారి ఐసొలేషన్‌ ముఖ్యం

ప్రజారోగ్యం సంక్షోభంలో పడితే ఎవరూ మిగలరు

ఆరోగ్యంగా ఉంటే తర్వాత ఆర్థికంగా కోలుకోవచ్చు

‘ఆంధ్రజ్యోతి’తో పద్మభూషణ్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి


డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వైద్య నిపుణుడు. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత. ఎయిమ్స్‌లో కార్డియాలజీ విభాగం అధినేతగా పని చేశారు. హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా, సాంక్రామిత వ్యాఽధుల విజ్ఞాన విభాగం ప్రొఫెసర్‌గా ఉన్నారు. శ్రీనాథ్‌ రెడ్డి గతంలో ఇద్దరు ప్రధాన మంత్రులకు వ్యక్తిగత డాక్టర్‌గా ఉన్నారు. కేబినెట్‌ మంత్రి హోదాలో ఒడిసా ప్రభుత్వానికి సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి ఎ.కృష్ణారావు


కరోనా వైరస్‌ను అదుపు చేయడం ఎలా!?

కరోనా మన దేశంలోనే కాదు.. ప్రతి దేశంలోనూ పెరుగుతూనే ఉంది. అన్ని దేశాలూ దాని వ్యాప్తి వేగాన్ని అదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వైరస్‌ పాకకుండా చూడడమే ఇప్పుడు మనం చేయాల్సిన పని.


ఈ లాక్‌డౌన్‌ అవసరమంటారా?

ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్‌ డౌన్‌ మన దేశానికి అవసరమే. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి చెందకుండా కనీసం 80 శాతం మేరకు అరికట్టవచ్చు. ఈ మధ్య కాలంలో కేసులను వెనువెంటనే గుర్తించి, టెస్టింగ్‌ చేసి, చికిత్స చేసేందుకు ఆస్కారం ఉంది. 21 రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి, తదుపరి ఏయే చర్యలు అవసరమవుతాయో గుర్తించేందుకు వెసులుబాటు లభిస్తుంది. నిజానికి, ఇది మానవ చరిత్రలోనే అతి పెద్ద షట్‌ డౌన్‌. ప్రపంచంలో సరిహద్దులకు అతీతంగా వైరస్‌ వ్యాప్తి చెందిన అనుభవం మనకు గతంలో లేదు. లాక్‌ డౌన్‌, ఐసొలేషన్‌ చర్యలు విఫలమైతే భారత దేశంలో పేషెంట్లు విపరీతంగా పెరిగిపోతారు. అవి విఫలం కాకుండా చూసుకోవడం మన సామాజిక బాధ్యత. లాక్‌డౌన్‌ల వల్ల ఆర్థిక నష్టాలు ఉండవచ్చు. కానీ, ప్రజల ఆరోగ్యమే సంక్షోభంలో పడితే ఎవరూ మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే తర్వాత ఆర్థికంగా కోలుకోవచ్చు.


వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఏం చేయాలి?

కనీసం రెండు మీటర్ల సామాజిక దూరం పాటిస్తే వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఇంటికే పరిమితం కావాలి. ఇళ్లను కారాగారాలు అనుకోకుండా.. ఇది మన అవసరమని భావించాలి. 


ప్రభుత్వ చర్యలు ఇప్పటికే ఆలస్యమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి..?

అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యం చేశారు. బ్రిటన్‌లో కూడా అలసత్వం ప్రదర్శించారు. మన దేశంలో కూడా ఆలస్యమైందా అన్నది చెప్పలేం. జరిగిన ఆలస్యం గురించి మీమాంస చేయకుండా జరగబోయే దాన్ని గురించి ఆలోచించడం అవసరం. కరోనా వ్యాప్తి చెందిన తీరు, గణాంక వివరాల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒడిసా, తెలంగాణల్లో కట్టుదిట్టమైన చర్యలే తీసుకుంటున్నారు.


పరిస్థితులు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామా?

లేము. అదే కదా కొన్నేళ్ల నుంచి నేను చెబుతున్నది. మన దేశంలో ప్రభుత్వాలు ప్రజారోగ్య సేవలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. 38 వేల మందికి ఒక డాక్టర్‌; 64,800 మందికి ఒక పీహెచ్‌సీ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వేగంగా, సమర్థంగా స్పందించే వ్యవస్థ లేదు. ఆరోగ్య రంగంలో వృత్తి నిపుణుల కొరత ఎంతో ఉంది. 


ఇప్పుడైనా ఏం చేయగలం!?

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకుని, వైద్య వ్యవస్థను సమూలంగా పునర్వ్యవస్థీకరించాలి. ఆరోగ్య సంరక్షణ విషయంలో సింగపూర్‌, దక్షిణ కొరియాల్లో ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది. నగరాల్లో పెద్ద పెద్ద ఆస్పత్రులను చూసి మురిసిపోవడం కాదు. ముందుగా పీహెచ్‌సీలను బలోపేతం చేయాలి. ప్రాథమిక స్థాయిలో చర్యలు తీసుకుంటే ఏ అంటువ్యాధి అయినా వ్యాప్తి కాలేదు. సరైన నిఘా కింది స్థాయి నుంచే అవసరం. పెద్ద ఎత్తున మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఆస్పత్రులను అభివృద్ధి చేయాలి. ప్రాథమిక స్థాయిలో డాక్టర్లు, నర్సులు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను పెంచాలి. 


వైరస్‌ సోకిన దేశాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి?

సింగపూర్‌, దక్షిణ కొరియాల్లో కరోనా లక్షణాలు లేని వాళ్లను కూడా పరీక్షిస్తున్నారు. సామాజిక దూరం పాటించడం, తొలి దశలోనే రోగులను గుర్తించడం, ఎవరు ఎవర్ని కలిశారో కనిపెట్టడం, కచ్చితంగా ఇళ్లలో క్వారంటైన్‌ పాటించడం, ఐసొలేషన్‌ వంటి చర్యలను అక్కడ పకడ్బందీగా తీసుకుంటున్నారు. దీనివల్ల అంటు వ్యాధిని అరికట్టవచ్చు. లేకపోతే, వైరస్‌ కేసులు పెరిగి మరణాలు పెరుగుతాయి. ఇటలీ, ఇరాన్‌లలో జరుగుతున్నది ఇదే.


ఉష్ణోగ్రత పెరిగితే వైరస్‌ వ్యాప్తి చెందదా?

భారత దేశంలో ఏప్రిల్‌, జూన్‌ మధ్య ఉష్ణోగ్రత 38 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. ఈ సమయంలో అంటువ్యాధుల వ్యాప్తి అంత వేగంగా ఉండకపోవచ్చు. అయితే, మనిషికీ మనిషికీ మధ్య వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు వేసవిలో కూడా అవసరమే. వైరస్‌ వ్యాప్తిని అరికట్టినా.. జూన్‌ వరకు దానిని ఎదుర్కొనే చర్యలు తీసుకుంటూనే ఉండాలి. ఉష్ణోగ్రత మనకు అనుకూలమైన విషయమే కానీ, ఈ వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందో.. ఏ మలుపు తీసుకుంటుందో మనం ఊహించలేం.


గ్రామాలకు భారీగా జనం వెళ్లడం ప్రమాదం కాదా?

గ్రామాలకు ప్రజలు పెద్ద ఎత్తున వలస వెళ్లడం అంత ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ, విదేశాల నుంచి వచ్చిన వారు స్థానికులను కలవడం ద్వారానే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. వారు గ్రామాలకు వెళితే ప్రమాదకరమే. మన దేశంలో గ్రామీణ జనాభా ఎక్కువ. అందుకే, విదేశాల నుంచి వచ్చిన వారిని వచ్చినట్లు, వారు కలిసిన వారిని కూడా ఐసొలేషన్‌ చేయడం అవసరం.


ఎంత కాలం వరకు మనం చర్యలు తీసుకోవాలి?

వచ్చే రెండు, మూడు వారాలు కీలకం. ఏప్రిల్‌ 15 నాటికి ఒక అంచనా ఏర్పడుతుంది. అప్పటికి నియంత్రించగలిగితే జూన్‌ వరకు గట్టి చర్యలు తీసుకుంటూనే ఉండాలి. వర్షాకాలం వచ్చేలోపు దాన్ని నియంత్రించాలి.


దేశంలో యువత ఎక్కువ ఉంది కనక వైరస్‌ వ్యాప్తి ని తట్టుకోగలమంటున్నారు కదా?

యువత ఎక్కువ ఉంది కనక ప్రమాదం లేదని చెప్పలేం. ఇక్కడ పోషకాహార లోపం, హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌ వంటివి అత్యధికంగా ఉన్నాయి. యువతకు వైర్‌సను తట్టుకోగలిగిన శక్తి, పరిస్థితులు ఉండవచ్చు. కానీ, ఈ కొత్త వైరస్‌ విషయంలో అలాంటి అంచనాలను వేయలేం. ఎందుకంటే, యువత అనేక ప్రాంతాలకు తిరుగుతారు. కనక, వారికి ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంది. ఓబేసిటీ, స్మోకింగ్‌, మాదక ద్రవ్యాలు, పళ్లు, కూరగాయలు ఎక్కువ తినకపోవడం కూడా యువతను ప్రమాదంలో పడేసే అవకాశాలున్నాయి.


రకరకాల మందులు అంటున్నారు. అవి ఎంతవరకు పని చేస్తాయి?

కరోనా నియంత్రణకు యాంటీ వైరల్‌, యాంటీ మలేరియా, అజిత్రోమైసిన్‌, ఆక్టెమ్రా మందులు ఉపయోగపడుతున్నాయని అంటున్నారు. ఇవి ఆశాజనకంగా ఉన్నాయి. మొత్తం ప్రపంచం రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఇతర దేశాల్లో జరుగుతున్న అధ్యయనాల నుంచి ప్రయోజనం పొందుతూనే మనం కూడా పరిశోధనలను ప్రోత్సహించాలి. వివిధ దేశాలతో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ఔషధ పరీక్షల్లో భారత్‌ కూడా చేరాలి.

Updated Date - 2020-03-27T10:40:03+05:30 IST