అట్టడుగువర్గాల ఆత్మబంధువు

ABN , First Publish Date - 2021-10-08T07:25:47+05:30 IST

దేశంలో అట్టడుగువర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, పెద్ద దిక్కుగా వ్యవహరించిన దివంగత నేత రాం విలాస్ పాశ్వాన్. ఆయన ఏ ప్రభుత్వంతో కలిసి పనిచేసినా...

అట్టడుగువర్గాల ఆత్మబంధువు

దేశంలో అట్టడుగువర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, పెద్ద దిక్కుగా వ్యవహరించిన దివంగత నేత రాం విలాస్ పాశ్వాన్. ఆయన ఏ ప్రభుత్వంతో కలిసి పనిచేసినా అంతిమంగా అట్టడుగు వర్గాల జాతి ప్రయోజనాలకే పాశ్వాన్ తొలి ప్రాధాన్యతనిచ్చారు. అట్టడుగు స్థాయి నుంచి నాయకులను బలోపేతం చేయడం ద్వారానే పార్టీ శక్తివంతంగా ఉంటుందని, పార్టీ శక్తివంతంగా ఉంటేనే నిమ్నవర్గాలకు అభివృద్ధితో పాటు అధికారం దక్కుతుందని ఆయన ప్రగాఢ విశ్వాసం. 1946 జూలై 5న బిహార్‌లోని షహర్బన్ని జిల్లా ఖంగారియాలో సియాదేవి, జమున్ పాశ్వాన్‌లకు జన్మించిన రాంవిలాస్ పాశ్వాన్, 1969లో అలౌలి (ఖంగారియా) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఎనిమిదిసార్లు లోక్‌సభ సభ్యునిగా, ఒకసారి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1974లో కొత్తగా ఏర్పడిన లోక్‌దళ్ పార్టీలో ప్రవేశించి ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించి అరెస్టయ్యారు. 1977లో రాం విలాస్ పాశ్వాన్ జనతాపార్టీ నుంచి మొదటిసారిగా హాజీపూర్ నియోజకవర్గం ఎంపీగా లోక్‌‎సభలో ప్రవేశించారు. వీపీ సింగ్ మొదలుకుని నరేంద్ర మోదీ వరకు ఆరుగురు ప్రధానమంత్రుల క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఘనత రాం విలాస్ పాశ్వాన్‌ది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన 2020 అక్టోబర్‌ 8న చివరిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన మంత్రి పదవిలోనే కొనసాగుతున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారతప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు ఘటనలతో చలించిన రాం విలాస్ పాశ్వాన్ అప్పటికే రాజ్యాంగంలో పొందుపరచిన పౌరహక్కుల రక్షణ చట్టం ఒక్కటే ఎస్సీ, ఎస్టీలకు సరిపోదని, అటువంటి ఘటనలకు అడ్డుకట్టవేసేందుకు ప్రత్యేక చట్టం తేవాలనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు. ఆ చట్టం విషయంలో సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పులపై లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) తరపున రివ్యూ పిటిషన్‌ను వేయించారు. అంతేకాక దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఎంపీల బృందంతో ప్రధానిని కలిసి ఆ చట్టం పకడ్బందీగా అమలయ్యేలా పార్లమెంటులో తగిన సవరణలు చేయించగలిగారు. దేశంలో వెనుకబడిన కులాల అభివృద్ధి సంక్షేమం కోసం, బీపీ మండల్ కమిషన్ అమలు కోసం విశేష కృషి చేసి బీసీలకు అండగా నిలిచారు. కెఆర్‌ నారాయణన్, అబ్దుల్ కలాం వంటి వారు రాష్ట్రపతి కావడంలో పాశ్వాన్ పాత్ర ఎనలేనిది. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ‎లను ఏకం చేసి వారికి అండగా ఉండాలనే రాం విలాస్ పాశ్వాన్ ఆశయాల సాధన కోసం ఎన్ని అవాంతరాలనైనా ఎదుర్కొని, ఉన్న అంతరాలను తొలగించుకుని ముందుకు సాగడమే ఆయనకు నిజమైన నివాళి.

(నేడు రాం విలాస్ పాశ్వాన్ ప్రథమ వర్ధంతి)

ఇనుగాల భీమారావు


Updated Date - 2021-10-08T07:25:47+05:30 IST