Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 05 Apr 2022 01:59:48 IST

వరి.. వరమయ్యేదిలా

twitter-iconwatsapp-iconfb-icon
వరి.. వరమయ్యేదిలా

  • యాసంగి సమస్యకు పరిష్కారాలెన్నో!
  • 45 రోజుల ముందస్తు సాగుతో ముప్పుకు చెక్‌
  • సన్న రకాల సాగుతో నూకల ఇబ్బంది మాయం
  • సర్కారు ఇన్సెంటివ్‌ ఇస్తే ఎగుమతులకు ప్రోత్సాహం
  • 1500 కోట్ల ఖర్చుతో నూకల సమస్య మటుమాయం
  • నూకలతో ఇథనాల్‌ ఉత్పత్తికి చాన్స్‌.. దీనికెంతో గిరాకీ
  • పైగా కేంద్రం నుంచి ప్రోత్సాహం.. వడ్డీ లేని రుణం


రాజకీయ ఘర్షణకు ప్రాధాన్యమిస్తే రైతులకు ఇబ్బందులే

ధాన్యం కొనుగోళ్లు..! రాష్ట్రంలో ఇప్పుడు అతి పెద్ద వివాదం ఇదే! బీజేపీని బూచిగా చూపించాలని టీఆర్‌ఎస్‌.. టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టాలని బీజేపీ ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి కూడా! తెలంగాణలో స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా యాసంగి సీజన్లో నూకలు ఎక్కువగా వస్తాయని, ఉప్పుడు బియ్యాన్ని నిరాకరిస్తున్నందున కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేస్తున్నామని, తెలంగాణకు ప్రత్యేక విధానం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెబుతోంది! ఈ నేపథ్యంలో.. ఇటు ఆంధ్రప్రదేశ్‌, అటు ఛత్తీస్‌గఢ్‌, మరోవైపు మహారాష్ట్రల్లో ఎక్కడా లేని వివాదం తెలంగాణలోనే ఎందుకు వస్తోంది!? ఇందుకు పరిష్కార మార్గం ఏమిటి!? ఇందుకు నిపుణులు ఏం చెబుతున్నారు!? ఈ అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనమిది!!


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పుడు యాసంగి మార్కెటింగ్‌ సీజన్‌ ప్రారంభమైంది. ముందస్తుగా వరి నాట్లు వేసిన నిజామాబాద్‌, సూర్యాపేట జిల్లాల్లో వరి కోతలు సాగుతున్నాయి. కొన్నిచోట్ల మిల్లర్లకు రైతులు ధాన్యం అమ్ముతున్నారు కూడా! ఈ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసినా పెద్దగా నూకలు రావు. ఇందుకు కారణం.. ఎండలు ముదరకుండానే కోతలు పూర్తి కావడం ఒకటైతే.. రెండోది.. కొన్నిచోట్ల సన్న రకాలను వేయడం! ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే సమస్య చాలా వరకూ పరిష్కారమవుతుందని చెబుతున్నారు. నిజానికి, రాష్ట్రంలో జూన్‌, జూలైల్లో వానాకాలం వరి సాగు ప్రారంభమవుతుంది. నవంబరు నెలాఖరుకు 90 శాతానికిపైగా కోతలు పూర్తవుతున్నాయి. ఆ తర్వాత దాదాపు రెండు నెలలు భూములను పడావుగా వదిలేస్తున్నారు. సంక్రాంతి తర్వాత యాసంగి నాట్లకు శ్రీకారం చుడుతున్నారు. మార్చి రెండో వారం వరకూ కూడా నాట్లు వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దాంతో, ఏప్రిల్‌ నెలాఖరు, మే నెలలో పంట చేతికి వస్తోంది. అప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు అటూఇటుగా ఉంటున్నాయి. మండుటెండల్లో వరి కోతలు కోయడంతో మిల్లింగ్‌ చేస్తే నూకలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకు అనివార్యంగా బాయిల్డ్‌ చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకూ బాయిల్డ్‌ నడిచినా..  ఇక నుంచి ఉప్పుడు బియ్యం అనేది చరిత్రలో కలవనుంది. 


ఈ నేపథ్యంలో, స్వల్ప మార్పులు చేసుకుంటే నూకలు, ఉప్పుడు బియ్యం సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు డిసెంబరులోనే వరి నార్లు పోసి, యాసంగి సాగు ప్రారంభించాలని సూచిస్తున్నారు. దీనికితోడు, దొడ్డు రకాలకు స్వస్తి చెప్పి సన్న రకాలను సాగు చేయాలని చెబుతున్నారు. దొడ్డు రకాల సాగుకు 150 నుంచి 160 రోజులు పడుతుంది. అదే సన్న రకాలైతే 120 నుంచి 125 రోజుల్లోనే పంట వచ్చేస్తుంది. తద్వారా, డిసెంబరులో నార్లు పోస్తే ఉగాది పండుగకల్లా పంట చేతికి వచ్చేస్తుంది. గతంలో నీటి లభ్యత ఉండేది కాదు. కనక, ఆలస్యంగా నార్లు పోసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో చెరువుల్లోనూ పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబరులోనే యాసంగి సాగు ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్‌ మొదటి పక్షానికే కోతలు పూర్తవుతున్నాయి. అలాగే, స్వల్ప కాలిక రకాలైన ఆర్‌ఎన్‌ఆర్‌- 15048, జేజీఎల్‌- 1798, కేఎన్‌ఎం- 733, కేఎస్‌ఎం- 1638, జేజీఎల్‌- 3844, అంజన (జే18), ప్రద్యుమ్న (జేజీఎల్‌- 17004), వరంగల్‌- 962, హెచ్‌ఎంటీ సోనా రకాలను సాగు చేస్తే ఏప్రిల్‌ ఒకటో వారంలోపు పంట కోతకు వస్తుందని ఆచార్య జయశంకర్‌ యూనివర్సిటీ పరిశోధన డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.జగదీశ్వర్‌ తెలిపారు. యాసంగి సాగును కనీసం 45 రోజులపాటు ముందుకు జరపడం, కాలానికి అనుగుణంగా సన్న రకాలను సాగు చేయడమే పరిష్కారమని సూచించారు.


ఎగుమతులను ప్రోత్సహిస్తే ఉపశమనం

ఒకవేళ ఆలస్యంగా పంట వేసినా.. దొడ్డు రకాలను సాగు చేసినా అందుకు కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఒకటి ఎగుమతులు అయితే మిగిలినవి ఫోర్టిఫైడ్‌ చేయడం; ఇథనాల్‌ ఉత్పత్తి, బియ్యప్పిండి, ఇడ్లీ రవ్వ వంటి ప్రాసెసింగ్‌! రాష్ట్రంలో ఉప్పుడు బియ్యం తినరు. కానీ, తెలంగాణ బియ్యానికి విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. యాసంగిలో రైతులు విరివిగా పండిస్తున్న దొడ్డు బియ్యం (ఎంటీయూ- 1010)కు దక్షిణాసియా దేశాల్లో; సన్న రకాలకు మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో డిమాండ్‌ ఉంది. ఇప్పటికే యాసంగిలో ఉత్పత్తి అయ్యే బాయిల్డ్‌ రైస్‌ తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకతోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఇండోనేషియా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు దక్షిణాసియా, మిడిల్‌ ఈస్ట్‌లోని పలు దేశాలకు ఎగుమతులు పెరిగాయి. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా 2.55 కోట్ల టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతాయనే అంచనాలున్నాయి. అందుకే, కేవలం ఎఫ్‌సీఐపై ఆధారపడకుండా ఎగుమతులపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఇక్కడ ఒక సమస్య ఉంది. ఎమ్మెస్పీకి ధాన్యం కొనుగోలు చేస్తే ఎగుమతికి గిట్టుబాటు కాదని మిల్లర్లు చెబుతున్నారు. 


ఎమ్మెస్పీకి కొని కాకినాడ, కృష్ణపట్నం, వైజాగ్‌, ముంబై పోర్డుల్లో రైస్‌ డెలివరీ ఇవ్వాలంటే అదనంగా రూ.400 ఆర్థిక భారం పడుతోందని, క్వింటా ధాన్యాన్ని రూ.1,600 చొప్పున కొనుగోలు చేస్తే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. రవాణా ఖర్చులను పూడ్చటానికి ‘ప్రత్యేక ఇన్సెంటివ్‌’ ఇవ్వాలని ‘బియ్యం ఎగుమతిదారుల అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో నిరుడు జనవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారు. కానీ, ప్రభుత్వం స్పందించలేదు. ధాన్యం ఎమ్మెస్పీకి కొనుగోలు చేయకపోతే రైతులకు నష్టం కలుగుతుంది. ఎమ్మెస్పీకి కొనుగోలు చేస్తే మిల్లర్లకు నష్టం. మధ్యేమార్గంగా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వమే ఎమ్మెస్పీకి ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు సబ్సిడీపై (మక్కలు ఇచ్చినట్లుగా) ధాన్యం అప్పగించడమా? టెండర్లు నిర్వహించడమా? లేకపోతే ఇన్సెంటివ్‌ ఇచ్చి ఎగుమతులను ప్రోత్సహించడమో చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.


రూ.1500 కోట్లతో నూకల నష్టం భర్తీ

నూకల నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వమే రూ.1500 కోట్లను వెచ్చించడం మరో ప్రత్యామ్నాయంగా నిపుణులు సూచిస్తున్నారు. ఎఫ్‌సీఐకి ముడి బియ్యం ఇవ్వాల్సి వస్తే.. క్వింటాలు ధాన్యానికి 67 కిలోల బియ్యం ఇవ్వాలి. ఇందులో 25 శాతం నూకలకు అనుమతి ఉంది. అంటే, రైస్‌ మిల్లర్లు 51 కిలోల హెడ్‌ రైస్‌, 16 కిలోల నూకలతో కలిపి 67 కిలోలు ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ కింద డెలివరీ ఇస్తారు. ఒకవేళ, యాసంగిలో బాయిల్డ్‌ చేయకుండా నేరుగా ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే 16 కిలోలకు బదులుగా 34 కిలోల నూకలు వస్తాయి. అంటే, 18 కిలోలు ఎక్కువగా నూకలు వస్తాయి. వివాదం అంతా వీటితోనే. అయితే, బియ్యంతో పోలిస్తే నూకలకు సగం ధర ఉంటుంది. అంటే, 18 కిలోల నూకలు 9 కిలోల బియ్యంతో సమానం. అప్పుడు ఎఫ్‌సీఐకి 67 కిలోల బియ్యం ఇచ్చేందుకు బదులుగా 9 కిలోలు తగ్గించి 58 కిలోలకు అనుమతిస్తే సమస్య పరిష్కారమవుతుంది. అప్పుడు ఆ 9 కిలోల నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 


ఎఫ్‌సీఐ బియ్యం లెక్క క్వింటాలుకు సగటున రూ.3,200గా ఉంది. కిలోకు రూ.32 చొప్పున 9 కిలోలకు రూ.288 అవుతుంది. ఉదాహరణకు, యాసంగి సీజన్‌లో 50 లక్షల టన్నుల ముడి బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి వస్తే.. క్వింటాలుకు 9 కిలోలు, టన్నుకు 90 కిలోల చొప్పున కేవలం 45 లక్షల క్వింటాళ్లు (అంటే 4.50 లక్షల టన్నులు) బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. టన్నుకు రూ.32 వేల చొప్పున 4.50 లక్షల టన్నులకు రూ.1,440 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్క పంట సీజన్‌లో రైతుల కోసం రూ.1,440 కోట్లు వెచ్చించడమనేది రాష్ట్ర ప్రభుత్వానికి మోయలేనంత ఆర్థిక భారం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంతో లొల్లి లేకుండా, రైస్‌ మిల్లర్లతో సమస్య లేకుండా, రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని భరించవచ్చని సూచిస్తున్నారు.


ఫోర్టిఫైడ్‌ రైస్‌ తీసుకోవడానికి కేంద్రం రెడీ

పేదలు, విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల చిన్నారుల్లో రక్త హీనత, సూక్ష్మ పోషకాల లోపం ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. ఈ సమస్య పరిష్కారానికి ‘పోషన్‌ అభియాన్‌’ కింద పీడీఎస్‌, మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్‌ ద్వారా పోషకాలతో కూడిన బలవర్ధక బియ్యం సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైంది. ఈ ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో ఫోర్టిఫైడ్‌ రైస్‌ సరఫరా చేయాలని టార్గెట్‌ పెట్టుకుంది. ఇందుకు ఏటా 4 కోట్ల టన్నుల వరకూ బియ్యం అవసరం. రాబోయే రోజుల్లోనూ ఫోర్టిఫైడ్‌ రైస్‌కు డిమాండ్‌ ఉంటుంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 3,440 రైస్‌ మిల్లులు ఉండగా.. ఇప్పటి వరకు 450 మిల్లుల్లో మాత్రమే ఫోర్టిఫైడ్‌ రైస్‌ మిక్సింగ్‌ చేసే బ్లెండింగ్‌ మిషన్లు ఏర్పాటు చేశారు. కేవలం రూ.5 లక్షలు ఖర్చు చేస్తే బ్లెండింగ్‌ మిషనరీ వస్తుంది. రైస్‌ మిల్‌ నిర్వాహకులకు ఇది పెద్ద ఆర్థిక భారం కాదు. కానీ, మిల్లర్లు ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వమూ ఒత్తిడి చేయడం లేదు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం 3.50 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్‌ రైస్‌ టార్గెట్‌ పెడితేనే రాష్ట్ర మిల్లర్లు పూర్తి చేయలేదు. ఇటీవల 5.25 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ను ఫోర్టిఫైడ్‌ ఇస్తే తీసుకుంటామని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఫోర్టిఫైడ్‌ రైస్‌ను సరఫరా చేస్తే తీసుకోవడానికి చాలా రాష్ట్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

వరి.. వరమయ్యేదిలా

బియ్యప్పిండి, ఇడ్లీ రవ్వకూ డిమాండ్‌

వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో సుముఖత వ్యక్తం చేస్తూ ఉంది. వాటిని ఏర్పాటు చేయాలని కోరుతోంది. ఇప్పుడు, యాసంగిలో వచ్చిన నూకలు, బియ్యాన్ని ప్రాసెస్‌ చేయడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బియ్యప్పిండి, ఇడ్లీ రవ్వ హోల్‌సేల్‌ ధర కిలోకు రూ.35 ఉంది. సూపర్‌ మార్కెట్లలో రూ.45-50 చొప్పున అమ్ముతున్నారు. దోశ పిండి, ఇడ్లీ రవ్వను బాయిల్డ్‌ రైస్‌ నుంచే ప్రాసెసింగ్‌ చేస్తారు. కానీ, పిండి, రవ్వ మిల్లుల ఏర్పాటుపై ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు. ఎఫ్‌సీఐ స్థాపిత లక్ష్యాల్లో పిండి మిల్లుల ఏర్పాటు ఒకటి. కానీ, ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. రూ.40 లక్షల పెట్టుబడితో చిన్న మిల్లులు, రూ.1 కోటి పెట్టుబడితో పెద్ద మిల్లులు ఏర్పాటు చేయొచ్చని మిల్లర్లు చెబుతున్నారు. ‘‘రోజుకు 25 టన్నుల ఇడ్లీ రవ్వ ఉత్పత్తి చేసే మిల్లును నిజామాబాద్‌లో నెలకొల్పాను. మహారాష్ట్రలోని పుణె, జాల్నా, బెల్గావ్‌, నాందేడ్‌ ప్రాంతాలకు రోజుకు 12 టన్నుల రవ్వ ఎగుమతి చేస్తున్నాను. ఫోర్టిఫైడ్‌ రైస్‌ కోసం బ్లెండర్లు కూడా వేశాను. బాయిల్డ్‌ రైస్‌తో నాకు ఎలాంటి సమస్య లేదు’’ అని రైస్‌ మిల్‌ వ్యాపారి ధన్‌పాల్‌ దత్తాత్రి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. .


ముక్తాయింపు: ఎఫ్‌సీఐ 1965లో ఏర్పడింది. 1985 వరకూ బియ్యం దిగుమతి చేసుకునే పరిస్థితులే ఉండేవి. పీవీ హయాంలో సంస్కరణల తర్వాత 1991 నుంచి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఎఫ్‌సీఐ రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనేది. మిల్లింగ్‌ చేసుకుని బియ్యాన్ని పీడీఎ్‌సకు తీసుకునేది. ఆ తర్వాత లెవీ వ్యవస్థ వచ్చింది. మిల్లర్ల అవకతవకల కారణంగా ఇందులో మార్పులు వచ్చాయి. 2012-14లో లెవీ వ్యవస్థను ఎత్తేసి డీ సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ (డీపీసీ) వ్యవస్థను తెచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని బలోపేతం చేశారు. 23 రాష్ట్రాలు డీపీసీలో చేరి ఎఫ్‌సీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2012లో ఉమ్మడి ఏపీ చేసుకున్న ఎంవోయూను 2014-15లో తెలంగాణ తనకు కూడా అనువర్తించుకుని డీపీసీలో భాగమైంది. బీజేపీతో లొల్లి నేపథ్యంలో ఉప్పుడు బియ్యం, ముడి బియ్యంతో తమకు సంబంధం లేదని, ఎఫ్‌సీఐనే ధాన్యం కొనాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. కాలానుగుణంగా మార్పులు చేసిన కేంద్రం ఇందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఈనేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అందిపుచ్చుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. 

వరి.. వరమయ్యేదిలా

మరో ప్రత్యామ్నాయం.. ఇథనాల్‌ ఉత్పత్తి

యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే నూకలు ఎక్కువగా రావడమనేది రాష్ట్రంలో ప్రధాన సమస్య. కానీ, ఆ నూకల నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పెట్రోలులో 20 శాతం ఇథనాల్‌ కలపాలి. కానీ, దీని లభ్యత దేశంలో 8.5 శాతమే. కేంద్ర ప్రభుత్వమే లీటరు ఇథనాల్‌ను రూ.62.65 చొప్పున కొంటోంది. ఇక, తెలంగాణలో 12 చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో డిస్టిలరీ, టర్బయిన్లు, బాయిలర్లు, మిషినరీకి తోడుగా ఇథనాల్‌ ఉత్పత్తి మిషినరీ జోడిస్తే సరిపోతుంది. తక్కువ ఖర్చుతో ఇథనాల్‌ ఫ్యాక్టరీలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే కామారెడ్డిలో 45 వేల లీటర్లు, మహబూబ్‌నగర్‌లో 50 వేల లీటర్లు, ఖమ్మంలో 60 వేల లీటర్ల కెపాసిటీతో షుగర్‌ ఫ్యాక్టరీలు ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఇథనాల్‌ ఉత్పత్తి పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కాస్త చేయూతనిస్తే చక్కెర ఫ్యాక్టరీలన్నీ ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తాయి. 


సారంగాపూర్‌ ఫ్యాక్టరీలో రోజుకు లక్ష లీటర్లు, బోధన్‌ శక్కర్‌ నగర్‌లో 5 లక్షల లీటర్లు, సంగారెడ్డిలో 5 లక్షల లీటర్లు, మెట్‌పల్లిలో 4 లక్షల లీటర్లు కలిపి... 15 లక్షల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తికి అవకాశం ఉంది. నిజానికి, చెరుకు కంటే కూడా బియ్యం, నూకల నుంచే ఎక్కువ ఇథనాల్‌ ఉత్పత్తి అవుతుంది కూడా. ఇథనాల్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి బియ్యాన్ని కేంద్రం సబ్సిడీపై ఇస్తోంది. టన్ను బియ్యం ధర రూ.32,750 ఉండగా ఇథనాల్‌ ఉత్పత్తికి రూ.20 వేలకే ఇస్తోంది. పూర్తిస్థాయి ఇథనాల్‌ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఆరేళ్లు ‘వడ్డీ లేని రుణం’ ఇస్తామని కూడా ప్రకటించింది. యూనిట్‌ విలువలో 15 శాతం పెట్టుబడి పెడితే, 85 శాతం కేంద్ర ప్రభుత్వం రుణం ఇస్తుంది. దేశవ్యాప్తంగా 305 చక్కెర ఫ్యాక్టరీలకు ఇప్పటికే రూ.13,500 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చింది కూడా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల 4 ఇథనాల్‌ పరిశ్రమలకు అనుమతులిచ్చింది. రూ.4,018 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పే బీపీసీఎల్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, ధాత్రి సంస్థలకు నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లో 250 ఎకరాల భూ కేటాయింపులు చేసింది. మూలనపడిన చక్కెర ఫ్యాక్టరీల్లో ఇథనాల్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.