స్కెచ్‌ వేసిసాగనంపారు!

ABN , First Publish Date - 2022-07-20T09:28:40+05:30 IST

స్కెచ్‌ వేసిసాగనంపారు!

స్కెచ్‌ వేసిసాగనంపారు!

ఒత్తిళ్లతోనే హెల్త్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ రాజీనామా

తెర వెనుక ప్రయివేటు మెడికల్‌ కాలేజీ జోక్యం 

సీ-కేటగిరీ సీట్ల అడ్మిషన్‌కు నో చెప్పడంతో ఇంటికి 

ప్రభుత్వ పెద్దల మాట విననందుకే వేటు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలో ఉన్నతాధికారుల పరిస్థితి కత్తి మీద సాములా మారింది. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటేనే ఎవరైనా ప్రాధాన్య పోస్టుల్లో కొనసాగుతారు. ఏమాత్రం ఎదురు చెప్పినా బదిలీ వేటు లేదా సరెండర్‌ అదీకాకుంటే వారంతట వారే రాజీనామా చేసి వెళ్లిపోయేలా ఒత్తిళ్లు చేస్తున్నారు. తమ మాట విననందుకే ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ను సైతం స్కెచ్‌ వేసి సాగనంపారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


ఎంత చేసినా అంతే 

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ నుంచి రూ.వందల కోట్లు తీసుకున్నారు. వారికి అనుకూలంగా మెడికల్‌ కౌన్సెలింగ్‌ చేయించుకున్నారు. వర్సిటీ అధికారులు కూడా ముందు వెనుక ఆలోచించకుండా ప్రభుత్వ పెద్దలు చెప్పిన దానికి తలూపి, ఎక్కడపడితే అక్కడ సంతకాలు చేశారు. చివరికి చిన్నచిన్న పనులు చేయలేదన్న కారణంతో రిజిస్ట్రార్‌కు అనధికారికంగా ఉద్వాసన పలికారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారులు మాత్రం రాజకీయాలకు అతీతంగా పని చేసుకునేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్త్‌ వర్సిటీకి కూడా రాజకీయ రంగు పులిమింది. రిజిస్ట్రార్‌ నియామకం నుంచి అన్ని విభాగాల్లో ఆ పార్టీ నేతలదే పెత్తనంగా మారింది. ఇప్పుడు వర్సిటీలో ఏ పని జరగాలన్నా, ఏ పోస్టింగ్‌ ఇవ్వాలన్నా అంతా రాజకీయమే. వీసీ, రిజిస్ట్రార్‌ పరిధిలో లేని పనులు కూడా చేయాలన్న ఒత్తిళ్లు పెరిగాయి. సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ పెద్దలు చెప్పినవన్నీ చేసిన అధికారులపై ఏమాత్రం కనికరం లేకుండా తొలగించే పరిస్థితి వచ్చింది. 


ఇదీ జరిగింది... 

గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్యలో ఉన్న ఒక ప్రయివేటు మెడికల్‌ కాలేజీ ఒత్తిడి కారణంగానే హెల్త్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ రాజీనామా చేయాల్సి వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఆయన మరో మూడు నెలల పాటు పదవిలో కొనసాగాల్సి ఉంది. కానీ మెడికల్‌ కాలేజీకి చెందిన సీ- కేటగిరీ సీట్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడమే ఆయన రాజీనామాకు ప్రధాన కారణమైంది. ఆ కాలేజీలో బీ-కేటగిరీకి చెందిన ఎంబీబీఎస్‌ సీట్లు దాదాపు 9 వరకూ మిగిలిపోయాయి. వాటిని సీ-కేటగిరీ కింద మార్పు చేసుకుని అధిక ఫీజుకు అడ్మిషన్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఇచ్చిన గడువులోపే అడ్మిషన్లు పూర్తి చేయాలి. సదరు కాలేజీ మాత్రం మిగిలిపోయిన సీట్లను ఎన్‌ఎంసీ గడువు పూర్తి అయిన తర్వాత విద్యార్థులను అడ్మిషన్‌ చేసుకుంది. ఈ అడ్మిషన్లు ఆమోదించాలని వర్సిటీ ఉన్నతాధికారులను కోరింది. సదరు కాలేజీ వ్యవహారాలు మొత్తం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్నాయి. దీంతో వర్సిటీ అధికారులు అడ్మిషన్లను ఆమోదించేందుకు సిద్ధమయ్యారు. కానీ దీనికి ఎన్‌ఎంసీ అంగీకరించలేదు. ఇదే విషయాన్ని వర్సిటీ అధికారులు సదరు కాలేజీ యాజమాన్యానికి వివరించారు. లిఖితపూర్వకంగా కూడా సమాచారం ఇచ్చారు. అయినా కాలేజీ యాజమాన్యం ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకువచ్చింది. ఎన్‌ఎంసీలో చేయించుకోవాల్సిన పని గురించి వర్సిటీపై ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు తమవల్ల కాదని చేతులెత్తేశారు. అంతే... అప్పటి వరకూ చేసినదంతా మర్చిపోయి సాధ్యం కాని పని చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో వర్సిటీ ఉన్నతాధికారిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు ఇటీవల ఒక ఉద్యోగి పోస్టింగ్‌ విషయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు వర్సిటీ అధికారులకు మధ్య కొంత వార్‌ నడిచింది. రిజిస్ట్రార్‌ రాజీనామాకు ఇదీ ఒక కారణంగా ఉద్యోగులు చెబుతున్నారు. కాగా, వర్సిటీ రిజిస్ట్రార్‌ తొలగింపుకు 10 రోజుల క్రితమే స్కెచ్‌ వేశారు. ఆ పోస్టులో మరొకరిని నియమించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించింది. పది రోజుల క్రితమే రాజీనామా చేయాల్సిందిగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు శంకర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, వర్సిటీ స్నాతకోత్సవం వరకూ కొనసాగుతానని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారికి రిజిస్ట్రార్‌ విన్నవించుకున్నారు. ఆయన అంగీకరించడంతో స్నాతకోత్సవం పూర్తి అయిన మూడోరోజు సాయంత్రమేరాజీనామా చేసి పోస్టు నుంచి తప్పుకున్నారు.

Updated Date - 2022-07-20T09:28:40+05:30 IST