Abn logo
Sep 18 2020 @ 01:36AM

వాస్తవిక వాది ఉమర్‌ ఖాలిద్‌

Kaakateeya

ఉమర్ ఖాలిద్ అరెస్ట్ ఆయనకు ఒక ఆపదగా పరిణమించకపోవచ్చు. అలాగే ఆయన లక్ష్యానికీ ప్రమాదం కాకపోవచ్చు. బహుశా, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అన్నట్టు ఖాలిద్ స్వేచ్ఛాజీవిగా కంటే ఖైదీగా ఉండడం వల్లే ఆయన లక్ష్య సాధనకు ఎక్కువ దోహదం జరగవచ్చు. జాతీయస్థాయిలో ఒక ప్రముఖుడిగా ఖాలిద్ ఆవిర్భవించవచ్చు. ఆ ప్రఖ్యాతికి ఆయన అర్హుడే. దురదృష్టమేమిటంటే ఆయన అరెస్ట్ ఒక తరం భారతీయ ముస్లింలకు ఒక గౌరవపూర్వక, ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాన్ని మూసివేస్తుంది. ఇదే, భారత్ భావనకు నిజంగా ఒక ముప్పు.


నాస్నేహితుడు, సహచర కాలమిస్ట్ హిలాల్ అహ్మద్ చదువుకునే టేబుల్‌పై పవిత్ర కాబా మందిర్, చే గువేరా, మహాత్మాగాంధీ ప్రతిమలు ఉంటాయి. రోజూ ఐదుసార్లు నమాజ్ చేయడం మొదలైన ఇస్లామిక్ ఆచారాలను భక్తిప్రపత్తులతో ఆచరించే ముస్లిం అనే విషయాన్ని పవిత్ర కాబా మందిర్ ప్రతిమ స్పష్టం చేస్తుంది. చే గువేరా బొమ్మ మార్క్సిస్టు మేధో సంప్రదాయంలో ఆయన మూలాలను ధ్రువీకరిస్తుంది. మహాత్ముని చిత్రం ఆయన రాజకీయ దార్శనికత, కార్యాచరణ హిలాల్‌కు ఆమోదయోగ్యమనే విషయాన్ని తెలుపుతుంది. పలు సంవత్సరాలుగా హిలాల్ గృహంలో ఈ ప్రతిమలు నాకు ఒక సుపరిచిత దృశ్యం. అయితే ఇటీవలి కాలంలో నాకు ఆ దృశ్యంలో ఒక కొత్తదనం దర్శనమిస్తోంది. ఒక బెంగాలీ హిందూ కుటుంబంలో వలే హిలాల్ స్టడీటేబుల్‌పై రామకృష్ణ పరమహంస, లెనిన్ ఫోటోలూ పక్కపక్కనే కన్పిస్తున్నాయి. ఒక ముస్లింకు లభించే గుర్తింపు అవకాశాలు మరే ఇతర వ్యక్తికంటే పరిమితమైనవి కనుకనే నాకు ఆ కొత్తదనం గోచరమయింది. 


గత ఆదివారం నాడు ఢిల్లీ పోలీసులు ఉమర్ ఖాలిద్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఈ ‘గుర్తింపు’ ప్రశ్న మళ్ళీ నా ఆలోచనల్లోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సంభవించిన మతతత్వ హింసాకాండకు సంబంధించి ఖాలిద్‌ను అరెస్ట్ చేశారు. మీరు యువకులు. తిరుగుబాటు ధోరణి మీ ఊపిరి. మీరు భారతీయ పౌరులు. అంతేకాదు, మీరు ఒక ముస్లిం కూడా. మీరు, మీ మనస్సాక్షితో ఘర్షణ పడకుండా లేదా చెరసాల పాలవ్వకుండా ఏకకాలంలో పొందికగా ఇవన్నీ కాగలరా? ఇది కేవలం ఉమర్ ఖాలిద్ సందిగ్ధావస్థ మాత్రమే కాదు. లక్షలాది యువ భారతీయ ముస్లిం విద్యావంతులను ఈ ఉభయ సంకటం వేధిస్తూ ఉంటుందనడంలో సందేహం లేదు. 


నేను విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక మంది యువ ముస్లింలు ఒక ముస్లింగానూ, ఒక భారతీయ పౌరుడుగానూ ఉండడంలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన క్రూర పరిస్థితితో సతమతమవ్వడం చూశాను. తమకు ప్రమేయం లేని చరిత్ర భారాన్ని వాళ్లు మోయవలసివచ్చింది. ‘మీ సొంత దేశానికి మీరు విధేయంగా ఉంటున్నారా?’ అన్న ప్రశ్న వారికి అడుగడుగునా ఎదురయింది. విధేయంగా ఉంటే అందుకు రుజువులు చూపాలని డిమాండ్! యువ ముస్లింకు రెండే రెండు రాజీ మార్గాలు ఉన్నాయి. అవి: ఒకటి, -ముస్లిం-తనం లేదా ముస్లిం అస్తిత్వాన్ని మరచిపోవడం. రెండు-, తిరుగుబాటు మనస్తత్వాన్ని అణచివేసుకోవడం. నాకు తెలిసిన చాలామంది వామపక్షవాదులు మొదటి మార్గాన్నే ఎంచుకున్నారు. వారు నాస్తికులు అయ్యారు. కుటుంబంతో, సొంత మతసమూహంతో సంబంధాలు తెంచుకున్నారు. లౌకిక, విశ్వజనీన సమాజంలో తమ జీవిత ప్రస్థానాన్ని సాగించేందుకు ప్రయత్నించారు. కొంతమంది తమ జీవిత చరమదశలో ఒంటరివాళ్ళుగా, ముస్లింగా మిగిలిపోయామని తమను తాము కనుగొన్నారు. కాకపోతే తమ అంతర్గత తిరుగుబాటు ధోరణిని అణచివేసుకుని ‘మంచి’ ముస్లింగా స్థిరపడ్డారు. వృత్తిజీవితాలను నిర్మించుకున్నారు. అద్దంలో తమను తాము చూసుకోవడం కష్టమనే సత్యాన్ని వారు తెలుసుకున్నారు.


ముస్లింలను కఠోర యాతనకు గురి చేస్తున్న ఆ క్రూర సందిగ్ధావస్థకు ఉమర్ ఖాలిద్ కూడా ఒక బాధితుడే. నాకు తెలిసేనాటికే ఖాలిద్ ఒక సెలెబ్రిటీ. 2016 జెఎన్‌యూ దేశద్రోహం కేసు ఆయనకు ఆ హోదాను సమకూర్చింది. ఆయనపై ఉన్న కేసు పసలేనిదని నాకు బాగా తెలుసు. ఖాలిద్, కన్నయ్యకుమార్ జెఎన్‌యూలో ‘భారత్- వ్యతిరేక’ నినాదాలు చేశారనే ఆరోపణకు ఎటువంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ వామపక్షవాదులలో వామపక్షవాది అయిన ఈ తీవ్రభావాల యువకుడి విషయంలో నేను కొద్దిగా జాగ్రత్త పడ్డాను. ఇటువంటి యువకులను నేను నా జీవితంలో చాలా మందిని చూశాను. వారి ఆదర్శవాదం, త్యాగనిరతి నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. అయితే వారి భావజాలం నన్ను ఒక ఉదాసీనుడిగా మిగిల్చాయి. ఈ యువకులు ఏ ప్రపంచంలో నివసిస్తున్నారా అని నేను తరచు విస్మయపడేవాణ్ణి. మరి ఉమర్ ఖాలిద్‌తో పరిచయం నాకు ఎంత ఉల్లాసాన్ని కలిగించిందో అంత ఆశ్చర్యాన్నీ కలిగించింది. అతడినిండా మూర్తీభవించిన భావావేశం, ఉద్రేకపరుడు కాదు; విఖ్యాతుడు, అయితే వినయసంపన్నుడు; విస్తృత అధ్యయనశీలి అయిన జిజ్ఞాసి, అయితే వాస్తవ ప్రపంచంతో సంబంధమున్న వాడు; దార్శనికుడేకాదు నికార్సైన ఆచరణవాది. భారత రాజ్యవ్యవస్థను హింసాత్మక తిరుగుబాటుతో కూల్చివేయాలనే విప్లవాత్మక భ్రమలకు ఆవలి వైపును స్పష్టంగా చూసే వాస్తవిక వాది. ప్రజాస్వామిక రాజకీయాల గజిబిజి తీరుతెన్నులతో తలపడగల సమర్థుడు ఉమర్ ఖాలిద్. కులం, జెండర్ సమస్యల గురించి ప్రశ్నించండి. తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెబుతాడు. భవిష్యత్తులో నేను చూడదలుచుకున్న ఆదర్శ వామపక్ష నాయకుడు లాంటి వ్యక్తి ఖాలిద్. 


ఉమర్ ఖాలిద్‌లో నన్ను నిజంగా ఆకట్టుకున్న ప్రత్యేకత ఒకటి ఉన్నది. అది, ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక ముస్లింగా లేచి నిలబడేందుకు ఆయన సమ్మతి, సంసిద్ధత; అదే సమయంలో కేవలం ఒక ముస్లింగా మాత్రమే ఉండేందుకు ఆయన తిరస్కృతి. తండ్రి జమాత్ -ఎ- ఇస్లామికి చెందినవారయినప్పటికీ ఖాలిద్ ఒక ముస్లిం మత ఛాందసవాది కాకపోవడమూ, అలా అని ఒక ముస్లింగా గుర్తింపును పూర్తిగా కాదనుకోకపోవడమూ ప్రశంసనీయం. ఆయన ముస్లిం మత విశ్వాసీ కాదు, అనుష్ఠాన ముస్లిమూ కాదు. నా స్నేహితుడు హిలాల్ వలే ఖాలిద్ నమాజ్ చేయడు. ఆయన సహచరి ఒక బెంగాలీ హిందువు. ఆయన మేధో వ్యాపకాలలోనూ, రాజకీయ కార్యకలాపాలలోనూ ఆమె భాగస్వామి. గమనార్హమైన విషయమేమిటంటే ఖాలిద్ లాంటి ముస్లింలను ముస్లిం సమాజం సమాదరించడం చాలా తక్కువ. పసమండ (వెనుకబడిన కులం) ముస్లింల దురవస్థల గురించి ఆయన పట్టించుకుంటారు. ఇది ముస్లిం కులీనులకు తప్పకుండా చికాకు కలిగిస్తుంది. 


ఒక ముస్లింగా ఉండడంలో తన అనుభవాల గురించి ఉమర్ ఖాలిద్ నిర్మొహమాటంగా మాట్లాడతారు. సచార్ కమిటీ నివేదిక వెల్లడించిన ముస్లింల దైన్యస్థితి వాస్తవాల గురించి ఆయన నిశితంగా మాట్లాడతారు. ముస్లింల దురవ్థలకు ఇతర అణగారిన వర్గాల- దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, మహిళలు మొదలైన వారి దుస్థితికి మధ్య సంబంధముందని ఆయన విశ్లేషిస్తారు. ఇతర సామాజిక సమూహాలకు చెందిన నాయకుల వలే ఖాలిద్ కూడా రాజ్యాంగ హక్కుల పరిభాషలో మాట్లాడతారు. అయితే ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్ష, ఇతర పేద, అణగారిన వర్గాలవారు చవి చూస్తున్న వివక్షకు భిన్నమైందని స్పష్టంగా వివరిస్తారు. వివక్షాపూరిత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. ఆయన చాలా ధైర్యంగా, దృఢ సంకల్పంతో మాట్లాడతారు. ఆజాదీ నినాదాలను- హం క్యా మాంగే, ఆజాదీ... భూఖ్ సే ఆజాదీ, అంబేడ్కర్‌వాలీ ఆజాదీ...’ తనతో పాటు ఎలుగెత్తాలని ఆయన పిలుపునిచ్చినప్పుడు వేలాది మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా కాగడాలుగా అయిపోవడాన్ని నేను మరచిపోలేను. అదీ ఉమర్ ఖాలిద్ వ్యక్తిత్వ ప్రభావం. యువకుడు. ఆదర్శవాది. ధిక్కారి. తిరగుబాటుదారు. రాజీపడిని వ్యక్తి. ఏక కాలంలో భారతీయుడు, ముస్లిం. కనుకనే నేటి యువతరానికి ఆయన ఆదర్శప్రాయుడుయ్యారు. మరీ ముఖ్యంగా కొత్తగా విద్యావంతులైన మధ్యతరగతి భారతీయ ముస్లింలకు; మతాచార్యుల బంధనాల నుంచి, ముస్లిం వెలివాడల నుంచి, ఒక ముస్లిం గురించి ప్రచలితంగా ఉన్న మూకభావనల నుంచి బయటపడేందుకు ఆరాటపడుతున్న నవతరం ముస్లింలకు ఖాలిద్ స్ఫూర్తిగా నిలిచారు. 


మరి ఇటువంటి ఉమర్ ఖాలిద్ ఇప్పుడు అరెస్టయ్యాడు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద హస్యాస్పద ఆరోపణలపై ఆయన్ని అరెస్ట్ చేశారు. 2018 నుంచి పోలీసు సంరక్షణలో ఉన్న (ఖాలిద్‌కు ఒక పోలీసు సదా కాపలా ఉంటాడు) వ్యక్తి, బహుశా ఎలక్ట్రానిక్ నిఘాలో వున్న వ్యక్తి, దేశ రాజధానిలో హింసకాండను రెచ్చగొట్టేందుకు ఒక కుట్రను రూపొందించి, అమలుపరిచాడని- మనం విశ్వసించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. వామపక్షవాదులపై మీరు ఏ ఆరోపణ అయినా చేయగలరేమో గానీ మతతత్వ హింసాకాండకు కారకులనే ఆరోపణను ఎట్టి పరిస్థితులలోనూ చేయలేరు. మతతత్వ హింసాకాండను ఖాలిద్ రెచ్చగొట్టాడని నమ్మమని ఢిల్లీ పోలీసులు మనను కోరుతున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో కుమ్మక్కయి మతోన్మాద హింసాకాండను ఖాలిద్ రెచ్చగొట్టాడట! నిజమేమిటంటే ‘పాపులర్ ఫ్రంట్’ లాంటి ముస్లిం మతతత్వ సంస్థలకు వ్యతిరేకంగా ఖాలిద్ రాజీలేని పోరు చేస్తున్నారు. గత జనవరి 8న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా హింసాకాండను రెచ్చగొట్టే యోచనతో ఖాలిద్ ఒక రహస్య సమావేశం నిర్వహించాడని కూడా ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ట్రంప్ పర్యటన గురించి ఎవరికీ తెలియక ముందే ఖాలిద్ ఆ కుట్రకు సమాయత్తమయాడని విశ్వసించాల్సిందిగా మనను ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. ఖాలిద్ స్థానంలో ఒక యోగేంద్ర యాదవ్ లేదా ఒక సీతారాం యేచూరి ఉన్నట్టయితే ఢిల్లీ పోలీసుల ఆరోపణలు పరిహసింపబడేవి కాదూ? అంతేకాక అమాయకులపై ఆరోపణల పత్రం రచించేందుకు ఒక మంచి రచయిత సేవలను వినియోగించుకోవాలని ఢిల్లీ పోలీసులకు విజ్ఞులు తప్పక సూచించేవారు. కానీ, ఇక్కడ అసలు విషయం, ఉమర్ ఖాలిద్ ఒక ముస్లిం. 


ఉమర్ ఖాలిద్ అరెస్ట్ ఆయనకు ఒక ఆపదగా పరిణమించకపోవచ్చు; అలాగే ఆయన లక్ష్యానికీ ప్రమాదం కాకపోవచ్చు. బహుశా, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అన్నట్టు ఖాలిద్ స్వేచ్ఛాజీవిగా కంటే ఖైదీగా ఉండడం వల్లే ఆయన లక్ష్య సాధనకు ఎక్కువ దోహదం జరగవచ్చు. జాతీయ స్థాయిలో ఒక ప్రముఖుడిగా ఆవిర్భవించవచ్చు. ఆ ప్రఖ్యాతికి ఆయన అర్హుడే. దురదృష్టమేమిటంటే ఖాలిద్ అరెస్ట్ ఒక తరం భారతీయ ముస్లింలకు ఒక గౌరవపూర్వక, ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాన్ని మూసివేస్తుంది. ఇదే, భారత్ భావనకు నిజంగా ఒక ముప్పు.

యోగేంద్ర యాదవ్

(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

Advertisement
Advertisement
Advertisement