Abn logo
Sep 24 2020 @ 00:17AM

ఇంత ఇసం పోయలేక ఇంత పని చేశారు

Kaakateeya

కష్టం ఎవరికైనా రావచ్చు.. ఎలాగైనా రావచ్చు.. తాళ్లప్రొద్దుటూరు మహిళలకు అది నీటి రూపంలో వచ్చింది. కళ్ల ముందు పచ్చని పంటలే కాదు.. కష్టపడి కట్టుకున్న కలల ఇళ్ళు నీటమునిగిపోతుంటే ఏమి చేయలేని స్థితిలో ఉన్నవారు, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ‘ఈ పల్లె మనది.. పచ్చని పొలం మనది.. చుట్టూ ఉన్న ప్రజలందరూ మనవారు’ అనే ధీమా ఇప్పుడు వారిలో కనిపించడం లేదు. ‘‘వయసొచ్చిన  ఆడపిల్లలు.. గొడ్డుగోదాతో కాళరాత్రిలో యాడికి పోవాలా..! ఈ బాధలు పెట్టడం కన్నా కాసింత ఇసమివ్వండి..!’’ అని 20 రోజులుగా ధర్నా చేస్తున్నారు. ఆ ఆందోళనలో చురుకుగా పాల్గొంటున్న 80 ఏళ్ల అవ్వ పొతిరెడ్డిగారి లక్ష్మీదేవి తన ఆవేదనను ‘నవ్య’తో పంచుకున్నారు. 


ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలున్నారు. వారిని తీసుకొని యాడికెళ్ళాలో దిక్కుతోచడం లేదు. రాత్రి నిద్ర పట్టడం లేదు. ఏ అర్ధరాత్రో... అపరాత్రో ఇంట్లోకి గండికోట నీళ్ళొస్తాయని భయం.. భయంగా రోజులు గడపుతున్నాం. వెళ్ళిపోండంటే పిల్లాజల్లా... గొడ్డుగోదాతో యాడికెళ్ళాలి.. 


‘‘ఒక్క ఏడాదైనా గడువివ్వండి సారూ..! అని కాళ్లావేళ్లా పడి బతిమలాడినాము. ‘సరే’ అన్నారు. అర్థరాత్రి గాఢ నిద్రలో ఉన్నాం... పరుపు కిందకి నీళ్లోచ్చినాయ్‌. లేచి చూస్తే మా వీధులంతా నీళ్ళే! అంతలోనే ఇంట్లోకి నడుముల్లోతు నీళ్ళొచ్చే. నాకు ఎనభైయేళ్ళు... ఇట్టాంటి అన్యాయమెప్పుడూ చూడనే లేదు. ఎక్కెక్కి ఏడ్చినా మా గోడు పట్టించుకునే నాఽథుడే లేడాయే. నా నలుగురు కొడుకులు తలా ఓచోట ఉన్నారు. రాత్రిరాత్రి ఊళ్ళోకి నీళ్ళొదుతున్నారు. ఇంట్లో ఈడుకొచ్చిన ఆడపిల్లలున్నారు. వారిని తీసుకొని యాడికెళ్ళాలో దిక్కుతోచడం లేదు. రాత్రి నిద్ర పట్టడం లేదు. ఏ అర్ధరాత్రో... అపరాత్రో ఇంట్లోకి నీళ్ళొస్తాయని భయం.. భయంగా రోజులు గడుపుతున్నాం. లెక్కిస్తాం... వెళ్ళిపోండంటే పిల్లాజల్లా... గొడ్డుగోదాతో యాడికెళ్ళాలి.. అసలే కరోనా భయంతో కొత్తొళ్ళను ఇంట్లోకే రానివ్వరు.


ఈ కష్టకాలంలో మా కష్టాలు పట్టవా...? ఆడోళ్ళం ఇరవై రోజులుగా న్యాయం కోసం ధర్నా చేస్తున్నాం. నేను కాదు, నాలాంటోళ్ళు ఎంతో మంది. లక్ష్మీనారాయణమ్మది పెద్ద కుటుంబం. ఇంటాయన, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్లు, నలుగురు పిల్లలతో గా రాత్రిపూట ఎద్దులు... ఎనుములు... మ్యాకలు యాడబోవాలో దిక్కుతెల్వలేదు. కొంపలో యాడసామాన్లు ఆన్నే ఉండిపోయాయి. రేత్రంతా నడుముల్లోతు నీళ్లలో ఉండలేక.. పానాలను అరిచేతులో పెట్టుకొని ఎట్టోగోట్టాగా బయట పడినారు. పశుల మేతంతా నానిపోయే. ఏం తిని బతకాలి... ఎట్లా బతకాలి... మేమేమి పాపం చేశాం...! ఈ ఊరితో ఎన్నో ఏళ్ల బంధం. ఎకరన్నర చేనులో వరి, బుడ్లు (వేరుశనగ) పండిస్తూ, పాడి ఎనుములు (బర్రెలు) సాకుతూ ఆనందంగా బతుకున్నాం. మా పాలిట గండికోట శాపమైంది. ప్రాజెక్టు కోసం ఇండ్లు, చేన్లు త్యాగం చేశాం. ‘ఓ ఏడాది గడువివ్వండి... మేమే ఇల్టు కట్టకొని వెళ్లిపోతాం’ అంటిమి. మాపైన పగబట్టినట్టు ‘ఇండ్లకు లెక్క ఇస్తున్నాం. ఖాళీ చేసేల్లిపోండ్రీ’ అంటూ నీళ్ళలో ముంచేశారు. ఇదెక్కడి న్యాయమయ్యా...! మేమో చోట.. పసువులో చోటా ఎట్లా బతికేది. ఇన్ని కష్టాలు పెట్టడడం కన్నా కాసింత ఇసమివ్వండి.’’ 

ఎక్కెక్కి ఏడ్చినా..

‘‘ఒకప్పుడు నీరు కనిపిస్తే ఆ గ్రామ ప్రజలకు ఆనందం... ఇప్పుడు విషాదం. గండికోటలోకి నీళ్ళు వస్తాయంటే వారికి భయం. ‘నీళ్ళు వస్తున్నాయి కదా!’ అని ఖాళీ చేసి వెళ్ళిపోదామంటే ప్రభుత్వం చేపట్టిన పునరావాస చర్యలు ఇంకా పూర్తి కాలేదు’’’ అంటారు పోతిరెడ్డిగారి లక్ష్మిదేవి. ఈ గ్రామంలో కష్టాలకు ధనిక, పేద వ్యత్యాసం లేదు. అందరూ ప్రభావితులే. ‘‘నాకు నలుగురు కొడుకులు... కోడళ్ళు... కూతుళ్ళు. వారికి పది మంది పిల్లలు. పెండ్లీడుకొచ్చిన ఆడపిల్లలున్నారు. మాకు 20 ఎకరాలు పొలముంది. మరో 60 ఎకరాలు కౌలుకు తీసుకొని కొడుకులు సాగు చేస్తున్నారు. పంటలన్నీ నీళ్ళ పాలై, లక్షలు నష్టపోయాం. ‘ఇండ్లు కూలుస్తాం’ అంటే అడ్డుకున్నాం. రేతిరికిరేతిరి నీళ్ళు వదులుతున్నారు. మేమ్యాడ ఇల్లు కట్టుకోవాలో స్థలం చూపనే లేదు. పునరావాస కాలనీ అంటున్న చోట కాలుపెడితే దిగబడిపోతుంది. నీళ్ళు కూడా లేవు. ఎట్టాగెల్లేది. ఊళ్ళో, ఇళ్ళలో నీళ్ళు పెట్టి మా బతుకులు బజారున పడేత్తున్నారు’ అంటున్నారు కొప్పెల లక్ష్మిదేవి. 


కొండప్ప గోరంట్ల,  కడప

ఫొటోలు: టి. రత్నం

లెక్క లేకుండానే మా తాడు తెంచినారు

మాకు లెక్కలు వల్లె ఏం వల్లె... నీళ్లిడ్తివి... మేం ఏడ సావుదుము. ఎనుములు, పసులు, మ్యాకలు ఉన్నాయి. లెక్క కట్టిత్తం అంటిరి... లెక్క లేకుండానే మా తాడు తెంచినారు. ఇంత ఇసం పోయలేక ఇంత పనిచేసినారు ఈ గవర్నమెంటు. గడ్డంతా నానిపోయింది. నిద్రపోకుండా నీళ్లలో కూర్చుండే ఉండాం. మా బతుకులు తెల్లార్చినారు. మా ఊరు ఏం పాపం చేసింది? ఇంత అధ్వాన్నమా? ఆర్నెళ్లన్న టైం ఇయ్యాల కదా! మాకు లక్ష రూపాయల నష్టం జరిగింది. ఎవరిస్తారు?

(సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లక్ష్మీనారాయణమ్మ ఆక్రోశం)

గండికోట గోడు

ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు, 460 గ్రామాలకు తాగునీరు అందించడానికి చేపట్టిన ‘గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు’  కోసం గండికోట జలాశయం నిర్మించారు. ఈ రిజర్వాయర్లో అనుకున్న స్థాయిలో నీరు నింపాలంటే కొండాపురం, తాళ్ళప్రొద్దుటూరు, చామలూరు, ఎర్రగుడి, టి.అనంతపురం, రేగడిపల్లె, సుగుమంచిపల్లె, ఏటూరు గ్రామాల్లో 7,919 మంది బాధితులు ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. కనీసం 12 టీఎంసీలపైనా నీటిని నింపాలన్నా తాళ్ళప్రొద్దుటూరు గ్రామంలోని 2,869 కుటుంబాలు తక్షణం ఖాళీ చేయాలి. కానీ పునరావాసం కల్పించకుండా, ఇళ్ళ నిర్మాణాలకు కనీస గడువు ఇవ్వకుండా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలని ఆ గ్రామ మహిళలు ఒక వైపు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అధికారులు రాత్రికిరాత్రీ కొంచెం కొంచెంగా 14 టీఎంసీల మేర నీటిని వదిలారు. దీంతో గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీలు నీట మునిగాయి.

‘‘తాళ్ళప్రొద్దుటూరుతో పాటు ఏడు గ్రామాలను ఉన్నఫలంగా ఖాళీ చేయమన్నారు. వారు ఎలా చేస్తారు? వారూ మనుషులే. వారికీ హక్కులున్నాయి. ఆ హక్కుల కోసమే ఆయా గ్రామాల్లోని మహిళలు ధర్నాలు చేస్తున్నారు. అసలే కరోనా కాలం. ఈ సమయంలో పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లలతో ఎక్కడికి వెళ్తారు? ఈ విషయాన్ని అందరూ ఆలోచించాలి.’’ 

జయశ్రీ, మానవహక్కుల వేదిక

Advertisement
Advertisement
Advertisement