Abn logo
Apr 7 2020 @ 03:14AM

సమతుల్యతే ఆరోగ్య సూత్రం

మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని యావత్ ప్రపంచం అర్థం చేసుకుని మసలుకోవాలని ఈ మహమ్మారి మరోసారి మనకు గుర్తుచేసింది. మొక్కలు, పశుపక్ష్యాదులు, ఇతర జీవరాశులతో కలిసి మనం ఈ భూగ్రహాన్ని పంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ‌ఈ పరస్పర సమన్వయ గతిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనుషులతోపాటు జంతువులు, చెట్లు, ప్రకృతి ఆరోగ్యవంతంగా ఉండేందుకు అవసరమైన బహుముఖ వ్యూహంతో డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన ‘వన్ హెల్త్’ అనే భావనను మనమంతా ఆచరణలోకి తీసుకురావాలి.


ప్రపంచాన్ని వణికిస్తూ వేలమంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారిపై మానవాళి సమరం చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవాల్సి రావడం కాకతాళీయం. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, పర్యావరణానికి నష్టం కలిగించకుండా, ప్రకృతితో మమేకమై జీవించడం ద్వారానే భూమండలంపై సుఖసంతోషాలతో జీవించడం సాధ్యమని అందుకు ఇకనైనా నడుంబిగించాల్సిన అవసరముందని ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం విశ్వమానవాళికి మరోసారి గుర్తుచేసింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ -19 వైరస్‌పై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల కీలకమైన పాత్రను యావత్ ప్రపంచం మరోసారి గుర్తుచేసుకునే సందర్భం కల్పించింది.


ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన, వైద్యశాస్త్రాల పరంగా నిత్యనూతన పరిశోధనలెన్నో జరుగుతున్నాయి. ఎన్నో సరికొత్త విషయాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ విధమైన శాస్త్ర, సాంకేతిక ప్రగతి సాధిస్తున్న సమయంలోనూ.. కరోనా వైరస్ విజృంభిస్తూ సమస్త మానవాళిని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసి విలయతాండవం చేయాలని చూస్తోంది. దీని విశృంఖలత్వాన్ని అడ్డుకునే టీకాను కనుగొని మానవజాతికి భవిష్యత్తుపై విశ్వాసం కలిగించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు విస్తృతంగా అహర్నిశలు శ్రమిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. వీలైనంత త్వరలోనే వీరు ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. కరోనాపై పోరాటంలో విజయం సాధించిన తర్వాతైనా మనలో మార్పు రావాలి. ఆర్థిక మాంద్యంపై, వ్యక్తిగత జీవితాల్లో విస్తృత విధ్వంసంపై విశ్లేషించుకోవాలి. ఎన్నో చిక్కుముడులకు ఓ పరిష్కారాన్ని కనుగొనేదిశగా సంయుక్తంగా ముందుకెళ్లాలి. కరోనా వంటి ఆకస్మిక విపత్తులు భవిష్యత్తులో తలెత్తితే వాటిని ఎదుర్కొనడంలో మన సామర్థ్యాన్ని అంచనా వేసుకుని.. వాటిని నివారించగలమా? అని అంతర్మథనం చేసుకోవాలి. సమీప భవిష్యత్తులోనే మన అభివృద్ధి నమూనాలు, పర్యావరణ వ్యవస్థ దుర్బలత్వం, మన ఉత్పత్తి- వినిమయ పద్ధతులపై ప్రశ్నలు తలెత్తే అవకాశాలున్నాయి. కొందరు మేధావులు అంటున్నట్లుగా ప్రకృతి, ఇతర జీవరాశిపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాలన్న మానవుడి అత్యాశ కారణంగానే ఈ విపత్తులు తలెత్తుతున్నాయనేదే నిజమైతే.. పైన తలెత్తే ప్రశ్నలకు మన వద్ద సమాధానం దొరకదు.


మానవుడి దురాశ కారణంగా పర్యావరణ సమతుల్యతకు జరుగుతున్న నష్టాన్ని కరోనా మహమ్మారి మరోసారి మనకు గుర్తు చేస్తోంది. ప్రకృతిని గౌరవించుకోవాలని, ఈ సమతౌల్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అత్యంత ప్రాచీనమైన భారత సంస్కృతి, సంప్రదాయాలు బోధిస్తున్నాయి. 2వేల ఏళ్లకు పూర్వమే భారతీయ ప్రాచీన వేదాలు.. మానవుడితోపాటు సమస్త ప్రాణికోటికి సమానమైన ప్రాధాన్యం ఉందని స్పష్టం చేశాయి. రుగ్వేదంలోని పురుషసూక్తంలో -‘ఓం తచ్చం యోరావృణీమహేగాతుం యజ్ఞాయా గాతుం యఙ్ఞపతయేదైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యఃఊర్ధ్వం జిగాతు భేషజమ్శంనో అస్తు ద్విపదే శం చతుష్పదేఓం శాంతిః శాంతిః శాంతిః’ అని పేర్కొనబడి ఉంది.


భూమండలంపై ఉన్న సమస్త జీవకోటి సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. మునులు, రుషులు భగవంతుడిని ప్రార్థిస్తూ.. చెట్లు, మరీ ముఖ్యంగా వనమూలికలు సమృద్ధిగా పెరగాలని.. అందరూ ఎలాంటి అనారోగ్య సమస్యల్లేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగుండాలని కోరుతున్నారు. భగవంతుడు మనుషులతోపాటు ప్రకృతి, పశుపక్ష్యాదులపైన అపారమైన కరుణను, శాంతిని ప్రసరింపజేస్తాడని వారు మనస్ఫూర్తిగా భావించారు. చివరగా తన ప్రార్థనను ముగిస్తూ.. సమస్త భూమండలంపై ఉన్న ప్రతి ప్రాణికి క్షేమంగా, ప్రశాంతంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.


భూమిపై ఉన్న అన్ని జీవరాశుల మధ్య అవసరమైన పరస్పర సమన్వయ, సామరస్యపూర్వక జీవనాన్ని.. పురాతన భారతీయ సంప్రదాయం మనకు బోధిస్తుంది. చెట్లు, జంతువులతోపాటు అన్నింటిలోనూ భగవంతుడిని చూడటాన్ని, ప్రకృతిని ఆరాధించడాన్ని మన సంస్కృతి నేర్పిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, జీవావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవడం మన ప్రాచీన సంప్రదాయమని గుర్తుచేస్తుంది. ‘ప్రకృతిలోని అందాన్ని గుర్తించడాన్ని, దాన్ని కాపాడుకోవడాన్ని జీవన పద్ధతిగా, మతపరమైన ప్రాముఖ్యతగా ఆచరించి చూపిన మన పూర్వీకులకు శిరసువంచి నమస్కరిస్తున్నాను’ అని ప్రకృతితో మమేకమైన జీవన విధానం అవసరాన్ని జాతిపిత మహాత్మాగాంధీ చాలా చక్కగా వివరించారు.


అందుకే మళ్లీ ప్రతి భారతీయుడు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి నడుం బిగించాలి. భూమండలంపై ఉన్న చెట్లు, పశుపక్ష్యాదులతోపాటు తోటి మానవులు కూడా ఆరోగ్యకరమైన, సామరస్య పూర్వకమైన జీవితాన్ని అనుభవించేలా చొరవ తీసుకోవాలి. మనం పీలుస్తున్న గాలి, తాగేనీరు స్వచ్ఛంగా ఉండాలి. మన నేలతల్లిని, వృక్ష సంపదను, సహజవనరులను కాపాడుకుంటామనే కృతనిశ్చయంతో పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైంది. లాక్‌డౌన్ నేపథ్యంలో గాలి నాణ్యత చాలా బాగా పెరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. 


అడవి జంతువులు ఊళ్లలోకి, పట్టణాల శివారు ప్రాంతాల్లోకి వస్తున్నాయనే వార్తలు ఇటీవల తరచుగా కనబడుతున్నాయి. ప్రకృతిని, అడవులను మన అవసరాలకోసం ఎంతగా విధ్వంసం చేస్తున్నామో, ప్రకృతితో కలిసి జీవించడం ఎంత అవసరమో తెలిపేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే.


భారతీయుల ప్రాపంచిక దృష్టి ప్రకారం.. మన ప్రార్థనల్లో భూమిమీదున్న జీవరాశితోపాటు ఆకాశంలో, అంతరిక్షంలో ఉన్న జీవరాశి మధ్య కూడా సామరస్యపూర్వకమైన జీవనం కొనసాగాలని ఆకాంక్షించాం. దీనికి ఈ వేదమంత్రమే ఓ ఉదాహరణ. ‘ఓం ద్యౌశాంతిః- అంతరిక్షగ్ శాంతిః పృథివిః శాంతిః - ఆపాః శాంతిః – ఓషధయ శాంతిః వనస్పతయః శాంతిః – విశ్వేదేవాః శాంతిః – బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః – శాంతి రేవా శాంతిః – సామా శాంతిరేధి’ (ఆకాశంలో, అంతరిక్షంలో శాంతి నెలకొనాలి, భూమి మీద శాంతి ఉండాలి, నీటిలో శాంతి ఉండాలి, మొక్కల్లో శాంతి ఉండాలి, చెట్లలో శాంతి ఉండాలి, ప్రకృతిలోని ప్రతి అంశలోనూ భగవంతుడి కృపతో శాంతి నెలకొనాలి. మన జాగరూకతలో (సచేతనత్వంలో)నూ శాంతి ఉండాలి. ప్రతిచోటా శాంతి విస్తరించాలి. మన ఆత్మలో, మన చేతల్లో శాంతి ఉండాలి. జీవితం పరిపూర్ణమయ్యేందుకు అవసరమైన శాంతిని మనమంతా పొందాలి అని ఈ సంస్కృత శ్లోకం భావం). మన సృష్టిని కాపాడుకోవడంలోనే మన శాంతి నెలకొంది.


స్వాతంత్య్రానంతరం భారతదేశం పలు ఆరోగ్య సూచీల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. యాస్ (చర్మవ్యాధి), స్మాల్ పాక్స్ (మశూచి), పోలియో, గినియా వార్మ్ (నారికురుపు) వ్యాధి వంటి ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించుకున్నాం. సగటు జీవితకాలాన్ని 69 ఏళ్లకు పెంచుకున్నాం. అంటువ్యాధులు, మాతృ, శిశు, పౌష్టికాహారలోపం తదితర కారణాలతో నమోదయ్యే మరణాల సంఖ్య 1990లో 61 శాతం ఉండగా.. 2016లో అది 33 శాతానికి తీసుకొచ్చాం. అయితే కొన్నేళ్లుగా వస్తున్న జీవనశైలిలో మార్పుల కారణంగా అసంక్రమిత వ్యాధులు ఎక్కువవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విడుదల చేసిన జాబితా ప్రకారం.. మన దేశంలో గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, మధుమేహం మొదలైన అసంక్రమిత వ్యాధుల కారణంగానే 61శాతం మరణాలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి అత్యంత ఆందోళనకరం. దీనికి వీలైనంత త్వరగా అడ్డుకట్టవేయాలి. దేశవ్యాప్తంగా గ్రామీణ-–పట్టణ ప్రాంతాల్లో వైద్య వసతుల విషయంలో స్పష్టమైన అంతరం కనబడుతున్న నేపథ్యంలో కరోనా వ్యాధి విస్తరిస్తున్న ఈ సమయం.. భారతదేశంలో ప్రజారోగ్యంపై మరింత పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని మనకు గుర్తుచేస్తోంది. లక్షన్నరకు పైగా ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి ప్రాథమిక వైద్యాన్ని అందించడంతోపాటు 50కోట్ల మంది పేదలకు ఆరోగ్యబీమా సదుపాయాన్ని కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా కొంతమేర ఈ సమస్యకు పరిష్కారం లభిస్తున్నప్పటికీ.. ప్రజారోగ్యం విషయంలో మరింత ప్రగతి జరగాల్సిన అవసరం ఉంది.


మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని యావత్ ప్రపంచం అర్థం చేసుకుని మసలుకునేలా ఈ మహమ్మారి మరోసారి మనకు గుర్తుచేసింది. మొక్కలు, పశుపక్ష్యాదులు, ఇతర జీవరాశులతో కలిసి మనం ఈ భూగ్రహాన్ని పంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఈ పరస్పర సమన్వయ గతిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనుషులతోపాటు జంతువులు, చెట్లు, ప్రకృతి ఆరోగ్యవంతంగా ఉండేందుకు అవసరమైన బహుముఖ వ్యూహంతో డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన ‘వన్ హెల్త్’ అనే భావనను మనమంతా ఆచరణలోకి తీసుకురావాలి. పరిపూర్ణ ఆరోగ్య ఫలితాలను పొందేందుకు వివిధ రంగాలను, వైద్య నిపుణులు, జీవశాస్త్రవేత్తలు, పశువైద్యులు, వైరస్‌లపై అధ్యయనం చేస్తున్నవారు (వైరాలజిస్టులు), పర్యావరణ వేత్తలతోపాటు ప్రభుత్వాల విధివిధానాలు, కార్యక్రమాల రూపకల్పనలో కృషిచేస్తున్న వారందరినీ ఒకచోటికి తెచ్చి మేధోమథనం జరపాల్సిన అవసరం ఉంది.


మనదంతా ఒకే ప్రపంచం. ఇక్కడ ప్రతీదీ పరస్పర అనుసంధానం, పరస్పర ఆధారితమే. ఈ సమతుల్యతను మనం కాపాడుకున్నప్పడే ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమవుతుంది. విజ్ఞానాన్ని వివేకంతో మేళవించాలి. సురక్షితమైన గ్రహాన్ని, మనుషులు, చెట్లు, పశుపక్ష్యాదుల పరిపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సర్వసమ్మతితో ముందుకెళ్తూ.. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరముంది.


ముప్పవరపు వెంకయ్యనాయుడు

భారత ఉపరాష్ట్రపతి

(నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం)

Advertisement
Advertisement
Advertisement