ఆంధ్రజ్యోతి చూపిన మార్గం

ABN , First Publish Date - 2020-02-13T11:13:47+05:30 IST

పత్రికా స్వేచ్ఛకై పోరాడటంలో ఆంధ్రజ్యోతి ఆరి తేరింది. 1970 లో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రజ్యోతిని అణచాలని తలపెట్టి ప్రెస్ బిల్ పెట్టారు. ఆనాడు అసెంబ్లీలో ఆయనకు ఎదురులేని బలం వున్నది...

ఆంధ్రజ్యోతి చూపిన మార్గం

పత్రికా స్వేచ్ఛకై పోరాడటంలో ఆంధ్రజ్యోతి ఆరి తేరింది. 1970 లో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రజ్యోతిని అణచాలని తలపెట్టి ప్రెస్ బిల్ పెట్టారు. ఆనాడు అసెంబ్లీలో ఆయనకు ఎదురులేని బలం వున్నది. దాంతో బిల్లును నెగ్గించుకున్నారు. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి పోరాడింది. నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వాన ఈ పోరాటం జరిగింది. పత్రికలు, న్యూస్‌ నెట్‌వర్క్స్ మద్దతు పలికాయి. ఆంధ్రజ్యోతి బ్యూరో ప్రముఖుడు రామారావు, యుఎన్‌ఐ అధిపతి సీతారాం, ప్రధాన బాధ్యత చేపట్టగా మిగిలిన పత్రికల వారు అండగా నిలిచారు. దేశంలోని ఇతర పత్రికలు కూడా అండగా నిలిచాయి. 

అప్పుడు నేను మానవవాద సంఘం తరఫున పెద్ద సమావేశం పెట్టదలచి, ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య దగ్గరకు వెళ్ళి సమావేశానికి వచ్చి మాట్లాడి ఆంధ్రజ్యోతి చేస్తున్న పోరాటానికి మద్దతు పలకమని కోరాను. ముఖ్యమంత్రి బ్రహ్మనంద రెడ్డి, -మామిడిపూడి వెంకటరంగయ్య మంచి మిత్రులు. కానీ, బిల్లు చదివి దాని నియంతృత్వ పోకడలు గమనించి సమావేశానికి వచ్చి దుమ్ము దులిపేశారు వెంకట రంగయ్య (పక్కచిత్రం).  ఆయన, నేను కలసి ఆంధ్రలో స్వాతంత్ర్యసమరం అనే రచన చేశాము. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరోజిని రేగాని సంపాదకత్వాన ప్రచురించగా విద్యార్థులలో అది బాగా ప్రచారమైంది. మా సన్నిహితత్వం అలా పని చేయగా, వెంకట రంగయ్య ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా పత్రికలు, ప్రసార సాధనాలు విరివిగా ప్రజలలోకి తీసుకెళ్ళాయి. ఆంధ్రజ్యోతి బ్యూరో అధిపతి రామారావు చేయూతతో మేము మానవవాద సంఘం తరఫున చేసిన పని అక్కరకు వచ్చింది. ముఖ్యమంత్రి బ్రహ్మనంద రెడ్డి బలం వున్నా ప్రజాభిప్రాయానికి తలఒగ్గారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా నార్ల విజయం సాధించారు. ఆ తరువాత బ్రహ్మానందరెడ్డి కేంద్రానికి వెళ్ళినందున రాజకీయం మారింది. ఆంధ్రజ్యోతి నాడు పత్రికా స్వాతంత్య్ర పరిరక్షణలో ఘన విజయం సాధించింది. అందువలన అభిప్రాయ స్వేచ్ఛలో ముందంజ వేసిన ఆంధ్రజ్యోతి చూపిన మార్గం నేటికీ నిలబడి వెలుగు చూపుతున్నది.

ఇన్నయ్య నరిశెట్టి (అమెరికా) 

Updated Date - 2020-02-13T11:13:47+05:30 IST