టీఆర్‌ఎస్‌కు జిల్లా సారథులు
ABN , First Publish Date - 2022-01-27T08:04:55+05:30 IST
అధికార టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కీలకమైన జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టింది.
- ఒకేసారి 33 జిల్లాలకు నియమించిన కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి..
- ఎన్నికల టీమ్‌గా భావిస్తున్న పార్టీ శ్రేణులు
- అసెంబ్లీ ఎన్నికల దాకా వీరే క్షేత్రస్థాయి సారథులు
- జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు,
- ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు మహిళా నేతలకు చోటు
- ఓసీలకు ప్రాధాన్యం.. 11 మంది రెడ్లకు పదవులు
- బీసీల్లో అత్యధికంగా ఐదుగురు మున్నూరుకాపులకు
- జిల్లాల్లో ‘పవర్ సెంటర్’ నియంత్రణకు సీఎం వ్యూహం
- పార్టీ రాష్ట్ర కమిటీపైనా నేడో రేపో ప్రకటన
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): అధికార టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కీలకమైన జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ జట్టును ఖరారు చేసింది. గడచిన కొంతకాలంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జిల్లా అధ్యక్షుల పేర్లను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రకటించారు. ఒకేసారి 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీకి జిల్లా అధ్యక్షులను ప్రకటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తెలంగాణ ఏర్పడక ముందు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన వారే.. 2015 వరకు ఆ పదవుల్లో కొనసాగారు. ఆ తర్వాత పార్టీ అధిష్ఠానం జిల్లా అధ్యక్ష వ్యవస్థను రద్దు చేసింది. ఆ స్థానంలో జిల్లాకు ఇద్దరు చొప్పున కో-ఆర్డినేటర్లు లేదా జిల్లాకు ఒకరి వంతున కన్వీనర్ల నియామకం చేపట్టాలని భావించింది. కానీ, ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనే సంస్థాగత నిర్మాణాన్ని కేంద్రీకరించారు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట.. వారే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జులుగా ఉన్నారు. ఎమ్మెల్యేలులేని నియోజకవర్గాల బాధ్యతను స్థానికంగా పార్టీ ముఖ్యనేతకు అప్పగించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా ఇదే పద్ధతిలో ముందుకుసాగారు. అయితే నిరుడు పార్టీ ద్విదశాబ్ధి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో మళ్లీ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టాలని నిర్ణయించారు. వారి నియామకంతోపాటు, పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు అధికారాన్ని అధినేత కేసీఆర్‌కు అప్పగిస్తూ తీర్మానం చేశారు.
ఈ మేరకు ఆయన తీవ్ర కసరత్తు అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించారు. తొలిసారి ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించారు. గులాబీ అధినేత కేసీఆర్ ఈసారి వ్యూహాత్మకంగా జిల్లా అధ్యక్షుల నియామకంలో పార్టీ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశారు. మొత్తం 33 మంది జిల్లా అధ్యక్షుల్లో 20 మంది ఎమ్మెల్యేలు ఉండటం విశేషం. మిగిలిన 13 మందిలో ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. జడ్పీ చైర్‌పర్సన్లు ముగ్గురు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు ఇద్దరు, ఇతర హోదాల్లో ఉన్న వారు ముగ్గురు ఉన్నారు. ఇక సామాజికంగా ఓసీలకు కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. 33 పదవుల్లో 16 ఓసీలకు, తొమ్మిది బీసీలకు, నాలుగు ఎస్సీలకు, మూడు ఎస్టీలకు, ఒకటి మైనార్టీలకు కేటాయించారు ఈ పదవులు పొందిన ఓసీల్లో అత్యధికంగా రెడ్లు 11 మంది ఉండగా, ముగ్గురు కమ్మ సామాజికవర్గం వారు, ఒకరు వెలమ, మరొకరు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు ఉన్నా రు. బీసీల్లో అత్యధికంగా మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన ఐదుగురికి అవకాశం కల్పించా రు. పద్మశాలి, యాదవ సామాజికవర్గం వారు ఇద్దరు చొప్పున ఉన్నారు. నలుగురు ఎస్సీల్లో ముగ్గురు మాదిగ, ఒకరు మాల సామాజికవర్గానికి చెందిన వారుండగా, ముగ్గురు ఎస్టీల్లో ఇద్దరు లంబాడీలు, ఒక రు ఆదివాసీ నేతను నియమించారు. ముస్లిం మైనార్టీ నుంచి ఒకరు ఉన్నారు. ఈ నియామకాల్లో సీఎం కేసీఆర్ కొంత సమతూకం పాటించారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.
ప్రణాళిక ప్రకారమే..
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం కూర్పుపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒక ప్రణాళిక ప్రకారమే సీఎం కేసీఆర్ ఈ నియామకాలు చేపట్టినట్లు ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి 17లోపు అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్త శాసనసభ ఏర్పడాల్సి ఉంటుంది. అంటే, 2023 జులై నుంచి జనవరి లోపు ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. అయితే ఈసారి కూడా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే అంచనాలు ఇటు టీఆర్‌ఎస్ వర్గాల్లో, అటు విపక్షాల్లో ఉన్నాయి. ఎలాగూ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు 2024 మార్చి-ఏప్రిల్‌లో జరగాలి. ఇందుకు ఏడాదిన్నర-రెండేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. ఈ మేరకు ఇప్పుడు నియమితులైన పార్టీ జిల్లా అధ్యక్షులు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వరకు టీఆర్‌ఎస్ తరఫున క్షేత్రస్థాయి సారథులుగా వ్యవహరించడం లాంఛనమే! ఈ కారణంగానే జిల్లా అధ్యక్షుల నియామకంలో సీఎం కేసీఆర్ అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నట్లు టీఆర్‌ఎస్ ముఖ్యులు విశ్లేషిస్తున్నారు. అయితే జిల్లా స్థాయిలో ‘పవర్ సెంటర్’ నియంత్రణ కోసమే అధ్యక్ష పదవుల కోసం ఇతర నేతల పేర్లను పరిశీలించలేదనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. ‘‘పార్టీ పరంగా జిల్లా స్థాయిలో అధ్యక్ష పదవి ముఖ్యమైంది. ఈ సమయంలో బాధ్యతలు నిర్వర్తించిన వాళ్లు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ టికెట్ ఆశించడం సహజం. అంతేకాకుండా వారు జిల్లా స్థాయిలో పవర్ సెంటర్‌గా మారే అవకాశం ఉంది. ఇది జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారవచ్చు. అందుకే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు’’ అని టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు అంటున్నారు. అలాగే రాబోయేది ఎన్నికల కాలమే కాకుండా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేయాలనే ఆలోచన మేరకు పార్టీ కార్యక్రమాలు పెరుగుతాయి. ఈ వ్యవహారాలు కొంత ఖర్చుతో ముడిపడి ఉంటాయి. వాటిని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉంటేనే, సరిగా హ్యాండిల్ చేయగలరని కేసీఆర్ భావించి ఉండొచ్చని అంటున్నారు.
కేసీఆర్, కేటీఆర్‌ను కలిసిన కొత్త అధ్యక్షులు
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన పలువురు బుధవారం ప్రగతి భవన్‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తమ నియామకం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. వారిని కేసీఆర్, కేటీఆర్ అభినందించారు.
పార్టీ నిర్మాణంపై ఫోకస్..
పార్టీ జిల్లా అధ్యక్షులుగా ప్రజాప్రతినిధుల నియామకంతో సీఎం కేసీఆర్ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్లుగా టీఆర్‌ఎస్ ముఖ్యులు పలువురు అంచనా వేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపైనా అధినేత నుంచి ప్రకటన రావచ్చని వారు భావిస్తున్నారు. ఇంతకాలం నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బిజీగా ఉండే ఎమ్మెల్యేలను పార్టీ పరంగా కీలకం చేస్తున్నారని, జిల్లాల వారీగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల్లో కొంత చురుకుదనం, చొరవ కలిగిన వారికి కొత్తగా జిల్లా అధ్యక్ష పదవులు అప్పగించారని చెబుతున్నారు.
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుల జాబితా
- 1. ఆదిలాబాద్ జోగు రామన్న, ఎమ్మెల్యే (బీసీ-మున్నూరుకాపు)
- 2. కుమ్రంభీం ఆసిఫాబాద్ కోనేరు కోనప్ప, ఎమ్మెల్యే (ఓసీ-కమ్మ)
- 3. మంచిర్యాల బాల్క సుమన్, ఎమ్మెల్యే (ఎస్సీ-మాల)
- 4. నిర్మల్ జి.విఠల్‌రెడ్డి, ఎమ్మెల్యే (ఓసీ-రెడ్డి)
- 5. నిజామాబాద్ ఎ.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే (ఓసీ-రెడ్డి)
- 6. కామారెడ్డి ఎం.కె.ముజీబుద్దీన్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ (మైనార్టీ-ముస్లిం)
- 7. కరీంనగర్ జీవీ రామకృష్ణారావు, సుడా చైర్మన్ (ఓసీ-బ్రాహ్మణ)
- 8. రాజన్న సిరిసిల్ల తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ (బీసీ-మున్నూరుకాపు)
- 9. జగిత్యాల కె.విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే (ఓసీ-వెలమ)
- 10. పెద్దపల్లి కోరుకంటి చందర్, ఎమ్మెల్యే (బీసీ-మున్నూరుకాపు)
- 11. మెదక్ ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే (ఓసీ-రెడ్డి)
- 12. సంగారెడ్డి చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే (బీసీ-పద్మశాలి)
- 13. సిద్దిపేట కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ (ఓసీ-రెడ్డి)
- 14. వరంగల్ ఆరూరి రమేశ్, ఎమ్మెల్యే (ఎస్సీ-మాదిగ)
- 15. హనుమకొండ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే (బీసీ-మున్నూరుకాపు)
- 16. జనగామ పి.సంపత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ (ఓసీ-రెడ్డి)
- 17. మహబూబాబాద్ మాలోతు కవితానాయక్, ఎంపీ (ఎస్టీ-లంబాడ)
- 18. ములుగు కుసుమ జగదీశ్, జడ్పీ చైర్మన్ (బీసీ-పద్మశాలి)
- 19. జయశంకర్ భూపాలపల్లి గండ్ర జ్యోతి, జడ్పీ చైర్‌పర్సన్, (ఓసీ-రెడ్డి)
- 20. ఖమ్మం తాతా మధుసూదన్, ఎమ్మెల్సీ (ఓసీ-కమ్మ)
- 21. భద్రాద్రి కొత్తగూడెం రేగా కాంతారావు, ఎమ్మెల్యే (ఎస్టీ-ఆదివాసీ)
- 22. నల్లగొండ రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్యే (ఎస్టీ-లంబాడ)
- 23. సూర్యాపేట బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీ (బీసీ-యాదవ)
- 24. యాదాద్రి భువనగిరి కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ (ఓసీ-రెడ్డి)
- 25. రంగారెడ్డి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే (ఓసీ-రెడ్డి)
- 26. వికారాబాద్ డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే (ఎస్సీ-మాదిగ)
- 27. మేడ్చల్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ (బీసీ-మున్నూరుకాపు)
- 28. మహబూబ్‌నగర్ సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే (ఓసీ-రెడ్డి)
- 29. నాగర్‌కర్నూల్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే, (ఎస్సీ-మాదిగ)
- 30. జోగులాంబ గద్వాల బి.కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే (ఓసీ-రెడ్డి)
- 31. నారాయణపేట ఎస్.రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే (ఓసీ-రెడ్డి)
- 32. వనపర్తి ఏర్పుల గట్టుయాదవ్, మునిసిపల్ చైర్మన్ (బీసీ-యాదవ)
- 33. హైదరాబాద్ మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యే (ఓసీ-కమ్మ)