భరతనాట్యం మూలాలు మాలోనే...

ABN , First Publish Date - 2021-03-28T05:35:57+05:30 IST

వంశపారంపర్యంగా సంక్రమించిన నాట్య కళ కాలక్రమేణా పరిమితులు, హద్దులకు పరిమితమైపోవడం నచ్చని ఓ కళాకారిణి వ్యవస్థ మీద తనదైన పంథాలో తిరుగుబాటుకు తెరలేపింది. అందని ద్రాక్ష చందంగా మారిన నాట్య కళ చరిత్రను చాటుతూ, నాట్య

భరతనాట్యం మూలాలు మాలోనే...

వంశపారంపర్యంగా సంక్రమించిన నాట్య కళ కాలక్రమేణా పరిమితులు, హద్దులకు పరిమితమైపోవడం నచ్చని ఓ కళాకారిణి వ్యవస్థ మీద తనదైన పంథాలో తిరుగుబాటుకు తెరలేపింది. అందని ద్రాక్ష చందంగా మారిన నాట్య కళ చరిత్రను చాటుతూ, నాట్య ప్రదర్శనలతో కళ పుట్టుపూర్వోత్తరాలను, వంశవృత్తి ఎదుర్కొంటున్న హేళనలను వేలు చూపి నిగ్గదీస్తోంది... దేవదాసి అనువంశీకురాలైన నృత్యా పిళ్లై! 


సాదిర్‌ అట్టం!

ప్రాచీన సాదిర్‌ అట్టం నాట్యం పేరు.... సాదిర్‌. దేవదాసీలు వంశపారంపర్యంగా సాదిర్‌ను సాధన చేసేవారు. ఈ కళాకారులే సాదర్‌ అట్టం నుంచి భరతనాట్యం అనే నాట్య కళనూ ఆవిష్కరించారు. అదే ప్రస్తుతం మనుగడలో ఉంది. అయితే కేవలం దేవదాసీలకే పరిమితం అని చెప్పడం కోసంగా ‘విలాసినీ నాట్యం’ అనే నాట్యకళను సృష్టించారు స్వప్న సుందరి. చెన్నైలో పుట్టి, ఆంధ్రప్రదేశ్‌లో పెరిగి, ఢిల్లీలోని కూచిపూడి డాన్స్‌ సెంటర్‌ను స్థాపించిన నాట్యకళాకారిణి స్వప్న సుందరికి, విలాసినీ నాట్యం సృష్టించినందుకుగాను, ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ అవార్డు దక్కడం విశేషం. 


‘‘దేవదాసీలది 300 ఏళ్ల చరిత్ర. భరతనాట్యం పుట్టింది మా దేవదాసీల నుంచే! తక్కువ కులానికి చెందిన వారిగా పరిగణింపబడే మా దేవదాసీల నుంచే వంశపారంపర్యంగా నాట్య కళ మనుగడ కాలంతో పాటు కొనసాగింది. అయినా వ్యభిచార వృత్తితో ముడిపెట్టి, మమ్మల్ని సమాజం హీనంగా చూసే స్థితిలోనే దేవదాసీలం పరిమితమైపోవడం బాధాకరం. సభలు, సమావేశాల్లో మా నాట్య ప్రదర్శనలకు ఆర్థిక చేయూతనిచ్చిన ఉన్నత తరగతి పురుషుల పట్ల సమాజ గౌరవం చెక్కుచెదరకుండా ఉండిపోయింది. మా గౌరవమే మంటగలిసింది. మరీముఖ్యంగా మా నుంచే ఉద్భవించిన నాట్యకళ మేం అభ్యసించకూడని విద్యగా మాకు దూరమైంది’’ అని అంతరించిపోయే స్థితిలో ఉన్న తమ వంశ చరిత్ర గురించీ, భరతనాట్య మూలాల గురించీ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది నృత్యా పిళ్లై! ఆమె మనోవేదన వెనుక ఆసక్తినీ, ఆలోచననూ రేకెత్తించే చరిత్ర ఉంది!


దశాబ్దాల చరిత్ర!

తమిళనాడులో దశాబ్దాలుగా పేరెన్నికగొన్న, వంశపారంపర్య సంగీత సమాజం ఇసైవెళ్లాలార్‌కు (దేవదాసి) చెందిన 33 ఏళ్ల మహిళ నృత్యా పిళ్లై. పేరుప్రతిష్ఠలు కలిగిన ఇసైవెళ్లాలార్‌ మహిళలు దేవాలయాలు, సభలు, బహిరంగ ప్రదేశాల్లో సంగీత, నాట్య ప్రదర్శనలకు పెట్టింది పేరు. ఈ వైభవం ఒకప్పటిది. 1920లో దేవదాసీ వ్యవస్థ రద్దయినప్పటి నుంచీ వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తదనంతర కాలంలో దేవదాసీ మహిళలు, పురుషులు భరతనాట్య గురువులుగా మాత్రమే స్థిరపడిపోయారు. ఇతరులకు నేర్పడమే తప్ప, తమ వంశాంకురాలకు నేర్పించి, ప్రదర్శనలిప్పించే సంస్కృతి క్రమేపీ అంతరించింది. నృత్యా పిళ్లై తాతయ్య రాజారత్నం పిళ్లై ప్రసిద్ధ నాట్య గురువు. నృత్య తల్లితండ్రులు కూడా నాట్య గురువులే! ఎంతోమంది కళాకారుల చేత ఆరంగేట్రాలు చేయించారు. అయినా నృత్య విషయంలో నాట్యప్రదర్శనకు వారు వెనకాడారు. అలాంటి సందర్భంలో నృత్య తనదైన పంథాలో నాట్యం ఒంటబట్టించుకుని, ప్రదర్శనలను ఇవ్వడం మొదలుపెట్టారు.


ప్రదర్శనను సంప్రదాయ మంగళంతో ముగించకుండా, జై భీమ స్లోకంతో ముగిస్తూ కొత్తదనానికి తెర తీసింది నృత్య. అంతేకాదు... భరతనాట్యం పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి తరచుగా పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్లు కూడా ఇస్తూ, తన ప్రసంగాలతో వైభవంతమైన దేవదాసీ చరిత్ర, భరతనాట్యాల గురించి చాటడం మొదలుపెట్టింది. నాట్యకళాశాలను ఏర్పాటుచేసి, నాట్యం నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ వేదిక మీద నాట్యం చేయడానికి అర్హులేననే నినాదాన్ని చాటుతోంది. ‘‘దేవదీసీ వ్యవస్థ ఎప్పుడో అంతరించింది. మేం కేవలం అవశేషాలమే! నా వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ముందుకు నడిచేవారి ద్వారా నా గళం ప్రతిధ్వనిస్తూ ఉంటే అంతే చాలు! రానున్న వందేళ్లపాటు నన్ను విమర్శలు వెంటాడవచ్చు. కానీ నేను నా అభిప్రాయానికి కట్టుబడి ఉన్నాను. ప్రస్తుతం ‘సమస్యలతో కూడిన భరతనాట్య చరిత్ర’ అనే పుస్తకం రాసే పనిలో ఉన్నాను. ఈ రచన ద్వారా పూడుకుపోయిన, నొక్కివేయబడిన నా పూర్వీకుల గొంతుకలను న్యాయం చేయగలననే అనుకుంటున్నాను’’ అంటున్న నృత్యా పిళ్లై జీవితాంతం నాట్యకళను నేర్పిస్తూనే ఉంటానని చెబుతోంది.

Updated Date - 2021-03-28T05:35:57+05:30 IST