అధికారి అతి యవ్వారం!

ABN , First Publish Date - 2020-09-13T07:23:04+05:30 IST

ఆయనో ఉన్నతస్థాయి అధికారి. కేంద్ర పరిధిలోని ఒక విభాగం తరఫున మన రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ రీత్యా... ఆయన అనేక మందిని కలుస్తుంటారు. అలాగే, అనేక మంది ఆయనను కలుస్తుంటారు.

అధికారి అతి యవ్వారం!

  • ప్రభుత్వ పెద్దల తరఫున లాబీయింగ్‌
  • విమర్శకులు, విశ్లేషకులే టార్గెట్‌
  • విధి నిర్వహణలో భాగంగా భేటీలు.. ప్రభుత్వంతో పెట్టుకోవద్దని సలహాలు!
  • ‘మీకు చాలా భవిష్యత్తు’ ఉందంటూ ‘సూచనలు’.. వింత రాయబారంపై విస్మయం
  • ఇదో రకం రాయ‘బేరం’!
  • లాబీయింగ్‌లోనే  కొత్త రకం! 

చేయాల్సిన పని చేయకుండా... అధికార పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకున్న చిత్రం! ఇది ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నతస్థాయి వర్గాల్లో రచ్చ చేస్తోంది. విషయం మరింత శ్రుతి మించి కేంద్రం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అదేమిటో మీరూ చూడండి...


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆయనో ఉన్నతస్థాయి అధికారి. కేంద్ర పరిధిలోని ఒక విభాగం తరఫున మన రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ రీత్యా... ఆయన అనేక మందిని కలుస్తుంటారు. అలాగే, అనేక మంది ఆయనను కలుస్తుంటారు. ఈ సందర్భంగా పలు రకాల పరిణామాలు, పరిస్థితులపై చర్చ జరగడం, సమాచారం తెలుసుకోవడం అత్యంత సహజం. కానీ... ఆ అధికారి అంతకు మించి ఇంకేదో చేస్తుండటమే అసలు విషయం! అదేమిటంటే... ప్రభుత్వం తరఫున ‘రాయబారం’ నడపడం! ప్రభుత్వ తప్పిదాలను వేలెత్తి చూపిస్తున్న, విధానాల్లోని లోపాలను సమర్థంగా విమర్శిస్తున్న వారే ఆయన ‘టార్గెట్‌’! అయితే... ఇదంతా సుతిమెత్తగా సాగుతుంది. ఆయన మాటల్లో అంతే సున్నితమైన సూచన, సలహా, హెచ్చరికలు కూడా వినిపిస్తాయి. ‘‘ప్రభుత్వం ఏదో చేస్తోంది కదా! వారికీ కాస్త టైమ్‌ ఇవ్వాలి! అనవసరంగా మీరు ఎందుకు విమర్శిస్తున్నారు! మీలాంటి వారు కూడా ఇలా చేయడం భావ్యమా’’ అంటూ సలహాపూర్వకంగా చెబుతారు.  ‘‘మీకు చాలా భవిష్యత్తు ఉంది. ప్రభుత్వంలో ఉన్న వారితో పెట్టుకోవడం ఎందుకండీ!’’ అని కాస్త హెచ్చరిక స్వరం కూడా వినిపిస్తారు. ప్రభుత్వ విధానాలపై గట్టిగా, ప్రభావవంతంగా మాట్లాడుతున్న వారిని ఈ అధికారి స్వయంగా కలిసి మరీ ‘సూచనలు’ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అవతలి వారి స్థాయిని బట్టి ఆయన స్వరం మారుతూ ఉండటం అసలు విశేషం. కొందరిని బుజ్జగించేలా.. కొందర్ని బతిమలాడేలా.. ఇంకొందరికి ఉచిత సలహా ఇస్తున్నట్టు సాగిపోతుంటుంది ఆయన గారి వ్యవహారం!


ఎందుకీ రాయబారం!

నిబంధనలను మరిచి నిర్ణయాలు తీసుకోవడం, కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలు, అవినీతి రహితం అని పైకి చెబుతున్నా మద్యం నుంచి గనుల వరకు జరుగుతున్న దందా, భూముల కబ్జాలు, క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, దళితులపై దాడులు.... ప్రజల్లో ఈ అంశాలన్నింటిపైనా నిత్యం చర్చ జరుగుతోంది. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు, సంస్థలు, వ్యవస్థలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు, తటస్థ నిపుణులు, మేధావులు, విశ్లేషకుల మాటలు జనంలోకి  బాగా వెళుతున్నాయి. ఇక... ప్రభుత్వ నిర్ణయాలను అనేక అధికారిక వ్యవస్థలు కూడా తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే... కేంద్ర సర్వీసుల్లో ఉన్న సదరు అధికారి రంగంలోకి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి జాబితా తయారు చేసుకుని... విధి నిర్వహణలో భాగంగా అనిపించేలా వారిని కలుస్తున్నారు. మొదట అవీ ఇవీ మాట్లాడిన ఆ అధికారి, మెల్లగా ‘ప్రభుత్వంతో ఎందుకు పెట్టుకుంటున్నారు’ అంటూ సలహాపూర్వక హెచ్చరికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అవతలివారు విస్మయానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని పేర్కొంటున్నారు. 


ఎందుకీ అత్యుత్సాహం?

కేంద్ర సర్వీసుల్లోని ఆ అధికారికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారితో మంచి సంబంధాలున్నాయి. అధికార పార్టీ అంటే అలవిమాలిన అభిమానం కూడా! ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం తరఫున రాయబారా లు నడుపుతున్నట్లు తెలుస్తోంది.  అధికారంలో ఉన్న వారి మెప్పు కోసం సొంతంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా...  లేక, చికాకు పెడుతున్న వారిని దారిలో పెట్టాలని ప్రభుత్వ పెద్దలే ఆయనను రంగంలోకి దించారా? అనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. కానీ... ఇప్పుడైతే సదరు అధికారి తన అసలు పని పక్కనపెట్టి, రాయబారాల్లో బిజీగా గడుపుతున్నారు. ‘ప్రభుత్వంతో ఎందుకు పెట్టుకుంటారు’ అని  ఒకటి రెండుసార్లు చెప్పినప్పుడు... ‘క్యాజువల్‌’గా చెబుతున్నారులే అని అనుకున్నారు. కానీ, అదే పనిగా పలువురిని కలుస్తూ, పదేపదే ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకోవడంతో ఆయన ఉద్దేశాలు స్పష్టంగా అర్థమవుతున్నట్లు చెబుతున్నారు. ఆయన వ్యవహార శైలి మరీ శ్రుతిమించడంతో... ‘‘మీ అధికారి ఇక్కడ తనకు మాలిన పనులు చేస్తున్నాడు. కాస్త ఓ కన్నేసి ఉంచండి’’ అని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఆ అధికారి మారతారా? కేంద్రం రంగంలోకి దిగి ఆయనకు కళ్లెం వేస్తుందా.... చూడాలి మరి!

Updated Date - 2020-09-13T07:23:04+05:30 IST