విజయవాడలో కొత్తగా ‘వైఎస్సార్‌ తాడిగడప’ మున్సిపాలిటీ

ABN , First Publish Date - 2021-01-05T07:57:12+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా ఒక పురపాలక సంఘం, 5 నగర పంచాయతీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయవాడలో కొత్తగా ‘వైఎస్సార్‌ తాడిగడప’ మున్సిపాలిటీ

  • మరిన్ని పట్టణ స్థానిక సంస్థలు
  • రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ, 5 నగర పంచాయతీలు
  • 13 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్ల విస్తరణ 
  • మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో 6 రాజధాని గ్రామాల విలీనం!
  • ‘అమరావతి’ గ్రామాల సంఖ్య 23కు కుదింపు.. సర్కారు ఉత్తర్వులు


అమరావతి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఒక పురపాలక సంఘం, 5 నగర పంచాయతీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై గవర్నర్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. వివిధ జిల్లాల్లోని 13 మున్సిపాలిటీల పరిధిని విస్తరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడి, విజయనగరం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన రాజాంలతోపాటు చిత్తూరు జిల్లాలో బి.కొత్తకోట, కర్నూలు జిల్లాలోని ఆలూరు, ప్రకాశం జిల్లాలో  పొదిలి పంచాయతీలు ఇకపై నగర పంచాయతీలుగా మార్చారు.


వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీ

 విజయవాడ నగరంలో అంతర్భాగంగా ఉన్న కానూరు, పోరంకి, యనమలకుదురు, తాడిగడప గ్రామాలను కలిపి ‘వైఎస్సార్‌ తాడిగడప’ అనే కొత్త పురపాలక సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వీటిని కలిపి ‘గ్రేటర్‌ విజయవాడ’గా మార్చాలని గతంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ అలా అయితే పన్నుల భారం పెరగడంతోపాటు తమ ప్రత్యేకత అస్తిత్వం ఉండబోదన్న అభిప్రాయంతో ఆయా గ్రామాల ప్రజల్లో అత్యధికులు ‘గ్రేటర్‌’ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఇప్పుడు అవే గ్రామాలతో ‘వైఎస్సార్‌ తాడిగడప’ పేరిట కొత్త మునిసిపాలిటీ ఏర్పాటైంది. 


రాజధాని గ్రామాల కుదింపు

ఇప్పటి వరకూ అమరావతి రాజధాని పరిధిలో  ఉండవల్లి, పెనుమాక, నవులూరు, ఎర్రుబాలెం, నిడమర్రు  బేతపూడి పంచాయతీలను ప్రభుత్వం మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాల పరిధిలో చేర్చేసింది. దీంతో ఇప్పటి వరకూ 29గా ఉన్న రాజధాని గ్రామాల సంఖ్యను 23కు తగ్గించేసింది. నవులూరు, ఎర్రుబాలెం, నిడమర్రు గ్రామాలను మంగళగిరి మున్సిపాలిటీలో విలీనం చేయగా... ఉండవల్లిని తాడేపల్లి పురపాలక సంఘంలో కలిపింది. మంగళగిరి మున్సిపాలిటీలో బేతపూడి, చినకాకాని, కాజ, నూతక్కి, చినవడ్లపూడి, పెదవడ్లపూడి, రామచంద్రాపురం, ఆత్మకూరు కూడా విలీనమవనున్నాయి. ఇదే విధంగా తాడేపల్లి పురపాలక సంఘంలో ఉండవల్లి, పెనుమాకలతో పాటు వడ్డేశ్వరం, కుంచనపల్లి, కొలనుకొండ, పాతూరు తదితర గ్రామాలను చేర్చారు.


మున్సిపాలిటీల పరిధి పెంపు

శ్రీకాకుళం, రాజమహేంద్రవరం మునిసిసిపల్‌ కార్పొరేషన్లలో మరిన్ని గ్రామాలను చేర్చారు. మంగళగిరి, తాడేపల్లితోపాటు మొత్తం 13 మున్సిపాలిటీల పరిధిని  విస్తరింపజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాల చుట్టుపక్కల ఉన్న ఐదేసి గ్రామాలను, తణుకు, భీమవరం మున్సిపాలిటీలను ఆనుకుని ఉన్న నాలుగేసి గ్రామాలను, గుంటూరు జిల్లాలోని బాపట్ల మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలను, పొన్నూరు మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలను, ప్రకాశం జిల్లాలోని కందుకూరు పురపాలక సంఘం చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలను ఆయా మున్సిపాలిటీల్లో  విలీనం చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నెల్లూరు జిల్లా కావలి, గూడూరు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీల విస్తీర్ణం పెంచారు. 

Updated Date - 2021-01-05T07:57:12+05:30 IST