కొత్త రెవెన్యూ చట్టం.. రైతన్నకు వరం

ABN , First Publish Date - 2020-09-10T10:21:48+05:30 IST

కొత్త రెవెన్యూ చట్టంతో అన్నదాతల కష్టాలు తొలగనున్నాయి. చట్టంలో పొందుపరిచిన కఠినమైన క్లాజులు వారికి ఊరట

కొత్త రెవెన్యూ చట్టం.. రైతన్నకు వరం

గ్రామాల్లో తగ్గనున్న భూ వివాదాలు

తొలగనున్న లంచాల బెడద

తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ అధికారం

తప్పుచేస్తే బర్తరఫ్‌, క్రిమినల్‌ కేసులు


హన్మకొండ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కొత్త రెవెన్యూ చట్టంతో అన్నదాతల కష్టాలు తొలగనున్నాయి. చట్టంలో పొందుపరిచిన కఠినమైన క్లాజులు వారికి ఊరట కలిగించనున్నాయి. రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా జరుగుతున్న భూ మార్పిడులు, పుస్తకాల జారీ, దొడ్దిదారిన ప్రభుత్వ భూముల బదిలీ, బినామీ పేర్లతో భూకబ్జాలకు ఇక కళ్ళెం పడినట్టేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. బుధవారం శాసన సభలో ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ బిల్లు పట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నాయి. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు  చేశారు. 


వెంటనే మ్యుటేషన్‌..

కొత్త రెవెన్యూ చట్టంలో  వ్యవసాయ భూముల అమ్మకం, కొనుగోలు మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే హక్కుల రికార్డ్‌ పూర్తి చేసి కొన్నవారికి వెంటనే బదిలీ చేసేలా నిబంధన విధించారు. ఇది రైతులకు ఎంతో సంతోషాన్ని కలిగించే అంశం. ఇదివరకు భూమి కొన్నతర్వాత మ్యుటేషన్‌ కోసం  రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సి వచ్చేంది. ఇప్పుడు ఆ సమస్య ఉండదు. మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొన్నవారి పేర భూమి బదిలీ అవుతుంది.


భూతగాదాలకు చెక్‌..

ఇక నుంచి ఉమ్మడి ఒప్పందం ఉంటేనే చట్టబద్ధమైన వారసుల మధ్య భూ విభజన జరుగుతుంది. గతంలో భూమిని ఒకే కుటుంబంలో ఒకరికి తెలియకుండా ఒకరు తమ పేర్ల మీద పట్టాలు చేసుకోవడంతో ఘర్షణలు జరుగుతుండేవి. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకొని చేసే ఈ తప్పుడు పనుల వల్ల ఇబ్బందులు తలెత్తేవి.  


ప్రభుత్వ భూములకు రక్షణ:

మోసపూరితంగా ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాన్ని జారీ చేస్తే రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు కొత్త చట్టంలో ఇచ్చారు. అంతేకాకుండా జారీ చేసిన తహసీల్దార్‌ను బర్తరఫ్‌ చేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు పెట్టడం, తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. దీంతో భవిష్యత్తులో ప్రభుత్వ భూముల కబ్జాకు బ్రేక్‌ పడనున్నది. 


తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ బాధ్యత..

తహసీల్దార్లకు కొత్త అధికారాలను కట్టబెట్టారు. ఇప్పటి వరకు ఎటువంటి పట్డాదార్‌ పాస్‌ పుస్తకాలు జారీ చేయని భూములకు పాస్‌ పుస్తకాలు జారీ చేసే అధికారం తహసీల్దార్లకు ఇచ్చారు. ఇక నుంచి తహసీల్దార్లే జాయింట్‌ రిజిస్ట్రార్‌లుగా వ్యవహరిస్తారు. వారికే వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. గ్రామ కంఠం, పట్టణ భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. పంట రుణాల కోసం రైతులు బ్యాంకుల్లో పాస్‌పుస్తకాలను తనఖా పెట్టే విధానానికి కొత్త చట్టంలో స్వస్తిపలకడం శుభపరిణామం. డిజిటల్‌ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని చట్టంలో నిర్దేశించారు. రుణాల కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోరారు. 


పెండిగ్‌ ఫైల్స్‌ ట్రిబ్యునల్‌కు..

బిల్లు చట్ట రూపం దాల్చగానే పట్టాదారు పాస్‌ పుస్తకాల చట్టం 1971 రద్దవుతుంది. దీంతో పెండింగ్‌లో ఉన్న ఫైల్స్‌, కేసులన్నీ కొత్తగా ఏర్పాటు చేసే ప్రత్యేక ట్రిబ్యునల్‌కు బదిలీ అవుతాయి. విచారణ తర్వాత ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు ఫైనల్‌. దీంతో రైతులు, భూవివాద బాధితులు ప్రతీ శనివారం తహసీల్దార్‌, ఆర్‌డీవో,  డీఆర్‌వో కార్యాలయంలో విచారణకు హాజరుకావలసిన తలనొప్పి తొలగిపోయినట్లే. 


ఇతర శాఖల్లోకి..

రికార్డుల డిజిటలైజేషన్‌కు చట్టబద్ధత కల్పించారు. భూరికార్డులను ఆధునీకరించి డిజిటలైజేషన్‌ చేసిన దృష్ట్యా వీఆర్‌వో వ్యవస్థ అవసరం లేదని భావించిన ప్రభుత్వం వీఆర్‌వో పోస్టులను రద్దు చేయనున్నది. విఆర్‌వోలు ఆందోళన చెందవద్దని స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తిస్తామని సీఎం తెలిపారు. స్థాయికి తగినట్టు వీఏవోలకు వివిధ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రతీ ఉద్యోగిని ప్రభుత్వ శాఖలోని ఏదైనా సమాన స్థాయి కలిగిన ఉద్యోగానికి బదిలీ చేసుకునే అఽధికారం కల్పించారు. ఎవరైనా ఇతర శాఖల బదిలీకి విముఖత వ్యక్తం చేస్తే వీఆర్‌ఎస్‌ లేదా స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు చట్టంలో అవకాశం కల్పించారు. తమ ఉద్యోగాలు ఏమవుతాయోనని కలవరపడుతున్న వీఆర్‌వోలకు ఇది ఊరటనిచ్చే అంశం. అయితే రెండు దశాబ్దాలుగా రెవెన్యూశాఖలో పని చేస్తున్న తమను ఇతర శాఖల్లో విలీనం చేయడాన్ని విఆర్‌వోలు వ్యతిరేకిస్తున్నారు. రెవెన్యూ శాఖలోనే తమను కొనసాగించాలని, ఇతర సాధారణ పరిపాలనా పనులకు వాడుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2020-09-10T10:21:48+05:30 IST