సమైక్య స్ఫూర్తికి నిదర్శనం జాతీయ పతాకం
ABN , First Publish Date - 2022-08-03T07:22:09+05:30 IST
సమైక్య స్ఫూర్తికి నిదర్శనం జాతీయ పతాకం
ఘనంగా పింగళి జయంతి వేడుకలు.. గవర్నర్ నివాళి
విజయవాడ కల్చరల్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం స్వేచ్ఛా స్వాతంత్య్రం, భారతదేశ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిందని గవర్నర్ హరిచందన్ అన్నారు. పింగళి నిస్వార్థ స్వాతంత్ర సమర యోధుడని కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో మంగళవారం పింగళి 146వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళికి ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ సమైక్యతలో మువ్వన్నెల జెండా - భారతీయ భాషా సాహిత్యంలో త్రివర్ణ పతాక ప్రతిఫలాలు అనే అంశంపై జరిగిన సదస్సులో గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో 1921 మార్చిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య స్వరాజ్య జెండాను రూపొందించి గాంధీజీకి అందజేశారని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ప్రజలంతా ఐక్యంగా దేశం, జెండా పట్ల ప్రేరణ పొందాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకుడు కె.శివారెడ్డి, స్వాతంత్య్ర సమరయోధురాలు రాంపిళ్ల నరసాయమ్మ పాల్గొన్నారు.