గురువు ఆంతర్యం

ABN , First Publish Date - 2020-10-16T05:16:34+05:30 IST

సూఫీ గురువుల్లో జున్నున్‌ ప్రముఖుడు. ఆయన గొప్పతనాన్ని విని, ఆయనకు శిష్యులుగా ఉండాలని ఎందరో వచ్చేవారు. తమను శిష్యులుగా చేర్చుకోవాలని ప్రాథేయపడేవారు. వచ్చిన వారందరినీ చేర్చుకుంటే, వారిని సక్రమమైన మార్గంలో నడిపించడం అసాధ్యం అనో లేదా ఉచితంగా విద్యను అందిస్తే దాని విలువ తెలుసుకోలేక అశ్రద్ధ చేస్తారనో...

గురువు ఆంతర్యం

సూఫీ గురువుల్లో జున్నున్‌ ప్రముఖుడు. ఆయన గొప్పతనాన్ని విని, ఆయనకు శిష్యులుగా ఉండాలని ఎందరో వచ్చేవారు. తమను శిష్యులుగా చేర్చుకోవాలని ప్రాథేయపడేవారు. వచ్చిన వారందరినీ చేర్చుకుంటే, వారిని సక్రమమైన మార్గంలో నడిపించడం అసాధ్యం అనో లేదా ఉచితంగా విద్యను అందిస్తే దాని విలువ తెలుసుకోలేక అశ్రద్ధ చేస్తారనో... తనకు శిష్యులుగా ఉండాలనుకున్న వారి నుంచి ఆయన కొంత డబ్బు వసూలు చేసేవాడు. ఆ వసూలుకు కూడా ఆయన ఒక పద్ధతి పాటించేవాడు.


‘‘నువ్వు ఎవరి దగ్గరైనా శిష్యుడిగా ఉన్నావా?’’ అని శిష్యరికానికి వచ్చిన వ్యక్తిని అడిగేవాడు. 

‘‘లేదు’’ అని అతడు సమాధానం ఇస్తే, తను నిర్ణయించిన సాధారణ రుసుము ఇవ్వమనేవాడు. 

‘‘అవును! నేను కొంతకాలం మరో గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నాను అని చెబితే... ‘‘ఎంతకాలం ఉన్నావ్‌?’’ అని జున్నున్‌ అడిగేవాడు. 

‘‘ఒక సంవత్సరం’’ అని అతడు బదులిస్తే, ‘‘సాధారణ రుసుము కన్నా రెండింతలివ్వాలి’’ అనేవాడు.

‘‘రెండేళ్ళు’’ అని అంటే ‘‘అయితే నాలుగింతలు ఇవ్వాల్సిందే’’ అనేవాడు.


‘‘ఎందుకని? అక్కడ ఎంతో కొంత ఇప్పటికే నేను తెలుసుకున్నాను కదా! రుసుము తగ్గించాలి కానీ ఇంకా ఎక్కువ అడుగుతున్నారే?’’ అని అవతలి వ్యక్తి ప్రశ్నిస్తే...

‘‘సరాసరి మొదటే నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి నాకు తెలిసినది బోధిస్తే, అతను దాన్ని గ్రహించడం, ఆచరించడం సులభం. అలాకాకుండా ఎవరెవరి వద్దకో వెళ్ళి, వాళ్ళు బోధించిన చెత్త విషయాలన్నీ బుర్రలో నిండా నింపుకొని వచ్చాడనుకో! ఆ బుర్రలోంచీ ఆ చెత్తనీ, మూఢ నమ్మకాలనీ, మూర్ఖ ఆచారాలనీ ముందు తొలగించాలి. అది చాలా శ్రమతో కూడుకున్న పని. దానికి నా సమయాన్నీ, శక్తి యుక్తులనూ వినియోగించాలి. ఆ తరువాత నా బోధనలను వారికి వినిపించాలి. వాటికి అనుగుణంగా అతని జీవితాన్ని మలచాలి. అందుకే నేను ఎక్కువ రుసుము తీసుకుంటాను. అతను ఇతరుల దగ్గర ఎన్ని సంవత్సరాలు శిష్యుడిగా ఉంటాడో అంత ఎక్కువ చెత్త విషయాలు అతనిలో పేరుకుపోయి ఉంటాయి. వాటిని తొలగించి, అతని బుర్రను శుభ్రం చెయ్యాలంటే నేను ఎన్నో పాట్లు పడాల్సి ఉంటుంది. మరి, ఆ కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని రుసుము పెంచుతాను. న్యాయమే కదా!’’ అని బదులిచ్చేవాడు. 

జ్ఞానం కోసం అన్వేషించే వ్యక్తి ఒక గురువు వెంట కొన్ని రోజులూ,మరో గురువు వెనుక మరి కొన్ని రోజులూ వెళ్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. లౌకిక లాభాలన్నిటినీ వదులుకొని, కేవలం ఆధ్యాత్మిక ప్రగతి కోసం సిద్ధమైనప్పుడే సద్గురువు లభిస్తాడు.

- రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2020-10-16T05:16:34+05:30 IST