మైకులు ఆపి.. పెప్పర్‌ స్ర్పే కొట్టి..

ABN , First Publish Date - 2022-02-09T07:01:10+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో

మైకులు ఆపి..   పెప్పర్‌ స్ర్పే కొట్టి..

  • రాష్ట్రాన్ని విభజించే తీరు ఇదేనా?.. 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలకు కారణమిదే!
  • తెలంగాణ ఏర్పాటును మేం వ్యతిరేకించలేదు
  • రాష్ట్రపతి పాలనతో ప్రభుత్వాలను కూల్చారు
  • ఎన్టీఆర్‌నూ అన్యాయంగా గద్దె దించారు
  • కాంగ్రెస్‌ అధికారంలో లేకపోయి ఉంటే..
  • దేశంలో అనేక దారుణాలు జరిగి ఉండేవికావు
  • ఆ పార్టీది అర్బన్‌ నక్సలైట్ల మనస్తత్వం 
  • వారసత్వం తప్ప.. మరే విషయమూ పట్టదు
  • రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలు
  • దేశాభివృద్ధికి అమృతఘడియలు సమీపించాయి
  • ప్రాంతీయ ఆకాంక్షల్ని పరిష్కరిస్తాం: ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అత్యంత సిగ్గుచేటైన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఏపీ ప్రజల పట్ల కాంగ్రెస్‌ దారుణంగా వ్యవహరించిందన్నారు. పార్లమెంటులో మైకులు బంద్‌ చేసి, పెప్పర్‌ స్ర్పేలు కొట్టి విభజన బిల్లును ఆమోదించారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై ఎటువంటి చర్చా జరగలేదన్నారు.


‘కేంద్రంలో అధికారంలో కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పట్ల కాంగ్రెస్‌ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఇది ప్రజాస్వామ్యమా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును తాము వ్యతిరేకించలేదని, కానీ.. ఏర్పాటు చేసే పద్ధతి అదేనా? అని నిలదీశారు. అందరితో మాట్లాడి కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏర్పాటుచేసి ఉండవచ్చునని, కానీ.. అధికారంతో వచ్చిన అహంకారం తలకెక్కి క్రూరంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య విద్వేషాలున్నాయని, అవి రెండు రాష్ట్రాలకు నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రె్‌సకు ఎటువంటి రాజకీయ ప్రయోజనం లభించడంలేదన్న విషయం తమకు తెలుసునన్నారు. వాజ్‌పేయి హయాంలో బీజేపీ మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని, కానీ.. ఎలాంటి సమస్యా తలెత్తలేదని అన్నారు. అన్ని నిర్ణయాలూ శాంతియుతంగా జరిగాయన్నారు.


మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానం ఇచ్చారు. కాంగ్రె్‌సపై విమర్ళల దాడిని కొనసాగించారు. ఫరూఖ్‌ అబ్దుల్లా, మూలాయంసింగ్‌ యాదవ్‌, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, రామకృష్ణ హెగ్డే, ఎస్‌ఆర్‌ బొమ్మై, ఎంజీఆర్‌, కరుణానిధి తదితర ముఖ్యమంత్రులను, కమ్యూనిస్టు ప్రభుత్వాలను కాంగ్రెస్‌ దౌర్జన్యంగా గద్దె దించిందని మోదీ ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూడా కుప్పకూల్చిందన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ అస్వస్థతతో ఉన్నారని తెలిపారు. కనీసం వందసార్లు రాష్ట్రపతి పాలన విధించి.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కుప్పకూల్చిన ఘనత కాంగ్రె్‌సకే దక్కిందన్నారు. ఇక కరోనా సమయంలో పసుపు ఎగుమతులు పెరిగిన విషయం ఏపీ, తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. 



కాంగ్రెస్‌ వల్లే అనేక దారుణాలు..

కాంగ్రెస్‌ అధికార దాహంతో దేశంలో ప్రజాస్వామ్యం గొంతు నులిమిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో లేకపోయి ఉంటే దేశంలో వారసత్వ రాజకీయాలు, సిక్కుల ఊచకోత, కశ్మీరీ పండిట్లపై అరాచకాలు వంటి దారుణాలు జరిగేవి కావన్నారు. ఎమర్జన్సీ, కులాలు, ప్రాంతాల వారీగా దేశ విభజన జరిగి ఉండేది కాదని, తందూరులో బాలికలను కాల్చి చంపేవారు కాదని అన్నారు. కాంగ్రెస్‌ లేకపోతే భారతదేశం మనోభావాల ఆధారంగా  నిర్ణయాలు జరిగి ఉండేవని, విదేశీ ధృక్పథం లేకపోయేదని తెలిపారు. దేశం అనే పదంతోనే కాంగ్రె్‌సకు సమస్య ఉందన్నారు కాంగ్రెస్‌ ఆలోచనల్ని, సిద్ధాంతాన్ని అర్బన్‌ నక్సలైట్లు ప్రభావితం చేస్తున్నారని, అందుకే వారు ప్రతిదానినీ వ్యతిరేక దృష్టితో చూస్తున్నారని ఆరోపించారు.


‘‘కాంగ్రెస్‌ అర్బన్‌ నక్సలైట్ల మనస్తత్వంతో ఆలోచిస్తున్నందునే చరిత్రను మేము తిరగ రాస్తున్నామంటున్నారు. కానీ, మేము చరిత్రను మార్చడంలేదు. ప్రజల జ్ఞాపకాలను తాజా చేస్తున్నాం. చరిత్రను కేవలం కొన్ని వందల ఏళ్లు వెనక్కి తీసుకెళ్తున్నాం. చరిత్ర అంటే అదే. కానీ, కొందరికి చరిత్ర అంటే ఒక కుటుంబం మాత్రమే’’ అని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా కాంగ్రెస్‌ చెలగాటమాడిందని,  గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తాను కేంద్రం నుంచి సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు.  వారసత్వం తప్ప.. మరే విషయం గురించీ కాంగ్రెస్‌ ఆలోచించలేదని, భారత ప్రజాస్వామ్యానికి వారసత్వమే అతిపెద్ద ముప్పుగా మనం అంగీకరించాలని అన్నారు. పార్టీల్లో కుటుంబాలదే పెత్తనమైతే ప్రతిభకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ‘‘భారత దేశానికి పునాది కాంగ్రెస్‌ పార్టీయే వేసిందని, బీజేపీ జెండా మాత్రమే ఎగురవేసిందని చెప్పుకొన్నారు. ఈ ఆలోచనా విధానమే దేశానికి ప్రమాదకరం’’ అని మోదీ అన్నారు. 


జాతి అనే భావన కాంగ్రె్‌సకు పడదు..

భారతదేశం 1947లోనే పుట్టిందని కాంగ్రెస్‌ నేతలు భావించారని, దానివల్లే సమస్యలు తలెత్తాయని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్‌ ఉదారత్వం వల్ల ప్రజాస్వామ్యం రాలేదన్నారు. 1975లో ప్రజాస్వామ్యం గొంతు నొక్కినవారికి దాని గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. స్వాతంత్య్రం రాకముందే కాంగ్రె్‌సను రద్దు చేయాలని మహాత్మాగాంధీ కూడా అన్నారని గుర్తు చేశారు.


‘‘జాతి అన్న భావననే వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ భావన రాజ్యాంగ వ్యతిరేకమైతే.. మీ పార్టీని భారత జాతీయ కాంగ్రె్‌సగా ఎందుకు పిలుచుకుంటున్నారు? ఆ పేరును కాంగ్రెస్‌ ఫెడరేషన్‌గా మార్చుకోవాలి’’ అని మోదీ హితవు పలికారు. కాంగ్రెస్‌ కారణంగా స్వాతంత్య్రం వచ్చిన చాలా ఏళ్ల వరకు ప్రజలు విద్యుత్‌, రహదారులు, నీటి సౌకర్యం కోసం ఎదురుచూడాల్సి వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీగా కూడా కాంగ్రెస్‌ దేశాభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా వివిధ పార్టీలకు చెందిన 50 ప్రభుత్వాలను రద్దు చేశారని అన్నారు. విమానాశ్రయంలో ప్రొటోకాల్‌ ఏర్పాట్లు సరిగా చేయలేదన్న చిన్న కారణంతో నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి టి.అంజయ్యను పదవి నుంచి తొలగించారని పరోక్షంగా రాజీవ్‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 


గోవా ప్రజలకు నెహ్రూ అన్యాయం 

స్వాతంత్య్రం వచ్చాక 15 ఏళ్ల వరకు గోవా.. పోర్చుగీసు అధీనంలో ఉండేదని ప్రధాని మోదీ తెలిపారు. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తప్పిదాల వల్లే విముక్తి లభించలేదన్నారు. ప్రపంచమంతా తనను శాంతి కాముకుడిగా భావించాలన్న ఉద్దేశంతోనే గోవా ప్రజలకు నెహ్రూ అన్యాయం చేశారని ఆరోపించారు. ఎర్రకోటపై నుంచి గోవా ప్రజలకు వ్యతిరేకంగా నెహ్రూ ప్రకటన చేశారని, అక్కడికి సైన్యాన్ని పంపబోమన్నారని గుర్తు చేశారు. గాయకులు లతా మంగేష్కర్‌, కిశోర్‌కుమార్‌ పట్ల కూడా కాంగ్రెస్‌ అన్యాయాలకు పాల్పడిందన్నారు. గోవాలో జన్మించిన లతా మంగేష్కర్‌ సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ ఆకాశవాణిలో వీరసావర్కర్‌పై కవితా గానం చేసినందువల్లే ఆయనను తొలగించారని తెలిపారు. ఎమర్జన్సీ సమయంలో ఇందిరాగాఽంధీ ఆధిపత్యానికి లొంగనందుకు గాయకుడు కిశోర్‌కుమార్‌ను కూడా వేధించారన్నారు. 


అందరి పట్టుదల వల్లే కరోనాపై విజయం..


130 కోట్ల మంది భారతీయుల క్రమశిక్షణ, పట్టుదల వల్ల కరోనాపై సమరంలో మనం విజయం సాధించామని ప్రధాని మోదీ అన్నారు. కానీ, ప్రతిపక్షం దీనిని కూడా రాజకీయం చేసిందన్నారు. ప్రపంచమంతా వ్యాక్సినేషన్‌ విషయంలో భారత్‌ కృషిని ప్రశంసించిందని గుర్తు చేశారు. కొవిడ్‌ సమయంలోనూ భారతీయ యువత స్టార్ట్‌పలు ప్రారంభించారని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయని, పేదల కోసం ఇళ్ల నిర్మాణం కూడా జరిగిందని చెప్పారు. కరోనా సమయంలోనే పంటలు సమృద్ధిగా పండాయని, నగదు బదిలీ ద్వారా రైతులకు అత్యధిక కనీస మద్దతు ధర లభించిందని తెలిపారు. మొట్టమొదటిగా పంజాబ్‌ రైతుల ఖాతాల్లో నగదు బదిలీ జరిగిందన్నారు.


2021లో ఈపీఎ్‌ఫవో పోర్టల్‌లో కోటి 20 లక్షల మంది నమోదు చేసుకున్నారని, వారిలో దాదాపు 65 లక్షల మంది తొలిసారి ఉపాధి పొందారని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు తాము ఎన్నో చర్యలు తీసుకున్నామని, అత్యధిక అభివృద్ధి మధ్యతరహా ద్రవ్యోల్బణం ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఏర్పడిందని అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద నేడు 80 వేల ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయని చె ప్పారు. జాతీయ అభివృద్ధికి, ప్రాంతీయ ఆకాంక్షలకు తాము ఎక్కడా వైరుధ్యాలు చూడమని స్పష్టం చేశారు. ప్రాంతీయ ఆకాంక్షలను పరిష్కరిస్తూ దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నప్పుడే దేశం బలంగా మారుతుందన్నారు. రాష్ట్రాలు బలపడితే దేశం కూడా బలపడుతుందని మోదీ పేర్కొన్నారు.


Updated Date - 2022-02-09T07:01:10+05:30 IST