ఒకే కుటుంబంలో 6 కేసులు

ABN , First Publish Date - 2020-03-29T09:02:14+05:30 IST

రాష్ట్రంలో కరోనా మరణం నమోదైంది. ఇటీవలే ఢిల్లీలో ప్రార్థనా మందిరానికి వెళ్లొచ్చిన 74 ఏళ్ల ఖైరతాబాద్‌ వాసి ఇతర జబ్బులతో బాధ పడుతూ నగరంలోని ఓ

ఒకే కుటుంబంలో 6 కేసులు

కరోనాతో 74 ఏళ్ల వృద్ధుడి మృతి 

చనిపోయిన తరువాత గుర్తింపు

రాష్ట్రంలో తాజాగా ఎనిమిది కేసులు

4 కుటుంబాల్లో 22 మందికి పాజిటివ్‌

కుత్బుల్లాపూర్‌ కుటుంబంలో ఐదుగురు

అందరికీ ఢిల్లీ ప్రయాణంతోనే లింకు

ఇటీవలే కలిసి ఢిల్లీకి ఆధ్యాత్మిక యాత్రకు

థర్మల్‌ స్ర్కీనింగ్‌ విధుల్లో పాల్గొన్న 

నలుగురు వైద్య సిబ్బందికిసోకిన వైరస్‌

కోలుకున్న 9 మంది త్వరలో డిశ్చార్జి

కరోనా అనుమానంతో ఒకరి ఆత్మహత్య


హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరోనా మరణం నమోదైంది. ఇటీవలే ఢిల్లీలో ప్రార్థనా మందిరానికి వెళ్లొచ్చిన 74 ఏళ్ల ఖైరతాబాద్‌ వాసి ఇతర జబ్బులతో బాధ పడుతూ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన మృతి చెందారు. చికిత్స సమయంలో ఆయన తీవ్ర న్యూమోనియా లక్షణాలతో బాధ పడుతున్నారు. చనిపోయిన తరువాత అనుమానంతో ఆయన నమూనాలను పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో అతడి మృతదేహాన్ని ప్రొటోకాల్‌ ప్రకారం తొలుత గాంధీకి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం రాష్ట్రంలో మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 67కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే 14 కేసులు నమోదు కాగా, రెండు రోజులు కలిపి 22  కేసులు అయ్యాయి. 


తాజాగా ఒక్క హైదరాబాద్‌లోనే నాలుగు కుటుంబాలకు కరోనా సోకింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి కుటుంబంలో ఏకంగా ఆరుగురికి కరోనా సోకింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన నాంపల్లికి చెందిన మరో వ్యక్తి కుటుంబానికి కూడా కరోనా సోకింది. కుత్బుల్లాపూర్‌లోని ఒకే కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌ అని తేలింది. దోమల్‌గూడకు చెందిన ఓ వైద్యుడి కుటుంబంలో ఆయన తల్లికి కూడా కరోనా సోకింది. ఇవిగాక ఇప్పటికే మణికొండలో కొడుకు నుంచి తల్లికి, కోకాపేటలో భర్త నుంచి భార్యకు, సికింద్రాబాద్‌లో భార్యాభర్తల నుంచి కుమారుడికి, కొత్తగూడెంలో కొడు కు నుంచి తండ్రికి, పనిమనిషికి కరోనా సోకింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 కుటుంబాలకు కరోనా సోకింది. 


నలుగురు వైద్య సిబ్బందికీ

విమానాశ్రయంలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ విధుల్లో పాల్గొ న్న నలుగురు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికీ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచారు.  


పొంతన కుదరని లెక్కలు

రోగుల కేసుల సంఖ్యకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ గురువారం వరకు బులిటెన్‌ విడుదల చేసింది.  తర్వాత కేవలం కేసుల సంఖ్యనే ప్రకటించింది. శుక్రవారం 14 కేసులు, శనివారం 8 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 22 కేసులకు సంబంధించి ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడినపుడు 4 కుటుంబాలకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. పాతబస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి, కుత్భుల్లాపూర్‌లో ఒకే కుటుంబంలో నలుగురితో పాటు విమానాశ్రయంలో స్ర్కీనింగ్‌ విధుల్లో పాల్గొన్న మరో నలుగురికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు.


వీరంతా కలిపితే 14 మంది అయ్యారు. అలాగే వైద్యుల కుటుంబంలో డాక్టర్‌ తల్లికి, యుఎ్‌సఏ నుంచి వచ్చిన ఒకరికి కరోనా వచ్చింది. నిజామాబాద్‌ నుంచి విదేశాలకు, ఇటీవల ఢిల్లీలో మత కార్యక్రమానికి వెళ్లివచ్చిన వ్యక్తికి కూడా పాజిటివ్‌ వచ్చింది.   దీంతో మొత్తం 17 కేసులకు సంబంధించిన వివరాలు తెలిశాయి. మిగతా 5 కేసుల వివరాలు వెల్లడి కాలేదు. 


10 మంది సేఫ్‌ జోన్లోకి

రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్‌గా వచ్చిన 67 మందిలో 10 మంది పూర్తిగా కోలుకున్నారు. వారికి తాజాగా జరిపిన పరీక్షల్లో నెగటివ్‌ వచ్చింది.  మరో 8 మందికి కూడా తాజాగా నెగిటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వీరిని ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వెల్లడించాయి. 


మెడిసిటీ వద్ద కరోనా కలకలం

మేడ్చల్‌ మండలం ఘనాపూర్‌ పరిధిలో ఉన్న మెడిసిటీ ఆస్పత్రి  వద్ద శనివారం కరోనా కలకలం రేగింది. మెడిసిటీ హాస్టల్‌లో ఉంటూ నర్సింగ్‌ చేస్తున్న ఓ యువకుడు కరోనా లక్షణాలు ఉన్నట్లు తానే స్వయంగా 108కు ఫోన్‌ చేశాడు. వైద్యులు అతడిని వాహనంలో గాంఽధీ ఆస్పతికి తీసుకెళ్లారు.  ఘనాపూర్‌ గ్రామస్థులు మెడిసిటీ ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు.



డబ్ల్యూహెచ్‌వో బృందం సందర్శన

కుత్బుల్లాపూర్‌ గాజులరామారం సర్కిల్‌ చంద్రగిరినగర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తి మార్చి 14న సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రె్‌సలో ఢిల్లీలో మసీదుల సందర్శనకు వెళ్లారు. 17న తెలంగాణ ఎక్స్‌ప్రె్‌సలో బయలుదేరి 18న నగరానికి వచ్చారు. అదేరోజు జ్వరం, జలుబు రావడంతో వైద్యుడిని సంప్రదించారు. 25న గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌గా తేలడంతో నలుగురు కుటుంబ సభ్యులు గురువారం హుటాహటిన గాంధీకి వచ్చి పరీక్షలు చేయించున్నారు. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె పాజిటివ్‌ అని తేలింది. ప్రగతినగర్‌ గృహిణి (27)కి కూడా పాటిజివ్‌ వచ్చింది. దాంతో ఆ ప్రాంతమంతా పగలు కూడా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. డబ్ల్యూహెచ్‌వో బృందం, స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌, వైద్యాధికారులు శనివారం చంద్రగిరినగర్‌లో పర్యటించారు. అధికారులు గురువారం నుంచే పరిసర ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్‌ పిచికారీని ముమ్మరం చేశారు. బాధిత కుటుంబం ఇంటికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఇంటింటి పరిశీలన మొదలు పెట్టారు. 


క్వారంటైన్‌ పాటించని డ్రైవర్‌పై కేసు

హోం క్వారంటైన్‌లో ఉండకుండా బయటకు వెళ్లిన డీసీఎం డ్రైవర్‌పై, అతని యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీవన్గి గ్రామానికి చెందిన డ్రైవర్‌ యనముల శ్రీనివాస్‌ ఇటీవల డీసీఏంతో కేరళకు వెళ్లి లోడ్‌ దింపి వచ్చాడు. కరోనా కమిటీ గుర్తించి శ్రీనివా్‌సను హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. వైద్య బృందం రోజూ పరీక్షలు జరుపుతోంది. శనివారం డ్రైవర్‌ ఇంటికి వైద్య బృందం వెళ్లగా అతను కనిపించలేదు. పోలీసులు విచారించగా యజమాని నసీర్‌ తన డీసీఎంను శ్రీనివా్‌సకు ఇచ్చి హైదరాబాద్‌కు పంపినట్లు తేలింది. ఇద్దరిపైనా కేసు నమోదైంది.

Updated Date - 2020-03-29T09:02:14+05:30 IST