Abn logo
Oct 23 2020 @ 00:00AM

కరుణ సాధించిన విజయం

Kaakateeya

పండుగలు, ఉత్సవాలు మానవ నాగరికతలో ఒక భాగం. మరుగున పడిపోకుండా, సమాజంలో ఒక మధుర స్మృతిగా మిగిలిన ఒకానొక సంఘటనకు చిహ్నమే పండుగ. సమాజాన్ని మలుపుతిప్పిన మానవీయ కోణం అందులో ఉంటేనే అది తరతరాల పండుగగా మనగలుగుతుంది. అలాంటి వాటిలో విజయదశమి ఒకటి. ఈ పండుగ గురించి మన ఇతిహాసాలూ, పురాణాలూ చెప్పిన కథలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ రోజుకు సంబంధించి జైనులకూ, సిక్కులకూ కూడా వేర్వేరు కథలున్నాయి. ఇవన్నీ యుద్ధ విజయోత్సవాలే! అలాగే చరిత్ర లిఖించిన మరో విశేషం కూడా ఉంది. అదే అశోకుడు సాధించిన కళింగ విజయం. విజయదశమికీ, కళింగ విజయానికీ సంబంధించిన చారిత్రక కథనం ఇది. క్రీస్తు పూర్వం 261లో కళింగ యుద్ధం జరిగింది.నెలల తరబడీ సాగిన ఈ యుద్ధంలో లక్ష మందికి పైగా మరణించగా, లక్షన్నర మంది క్షతగాత్రులయ్యారు. కళింగ గణరాజ్యాల ఉమ్మడి నేతగా నిలబడిన ‘ఇళ’ అనే యోధుడి చేతిలో చివరకు కన్నులొట్టపోయినట్టుగా అశోకుడు విజయం సాధించాడు. కానీ ఆ గెలుపు అశోకుడికి ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. అప్పటికే ఆయన మనసు బౌద్ధం వైపు మళ్ళింది.


కళింగ విజయం తరువాత ఏడాది కాలానికి... దేశమంతా కళింగ విజయోత్సవాలు జరపాలని నిర్ణయించారు. కానీ అశోకుడు. కళింగ విజయాన్ని ‘ధర్మవిజయం’గా రూపొందించాలనుకున్నాడు. అది తనపై తాను సాధించుకున్న విజయం. అదే అహింసా మార్గం. 

ఆశ్వయుజ మాసం ప్రారంభంతోనే దశ దినోత్సవాలను అశోకుడు ప్రకటించాడు. మొదటి ఏడు రోజులూ ఏడు రకాల ప్రజా సంక్షేమ పథకాలను ప్రకటించాడు. ఎనిమిదో రోజు అష్టమి. అది బౌద్ధుల ఉపవాస దినం. ఆ రోజున ఆయన బౌద్ధ ఉపాసక దీక్ష స్వీకరించాడు. ఖైదీలందరినీ విడుదల చేశాడు. యుద్ధ ఖైదీలకు తగినంత భూమిని కానుకగా ప్రకటించి, హక్కు పత్రాలను అందించాడు. నవమి రోజున తన మార్పునకు కారణమైన కళింగులకు ప్రత్యేక చట్టాన్ని ప్రకటించాడు. అటవీ (గిరిజన) ప్రాంతాల్లో ప్రజలకు ప్రత్యేక భూమి హక్కు కల్పించాడు. మైదాన ప్రాంత ధనికులు, వ్యాపారులూ ఆ భూములను కొనుగోలు చేయడాన్ని నిషేధించాడు. పదో రోజున లోకం నివ్వెరపోయే సంచలన ప్రకటన చేశాడు. ‘‘ఇక నుంచి  కత్తి పట్టను. ఆయుధాలను విసర్జిస్తున్నాను. యుద్ధాల్ని రద్దు చేస్తున్నాను. నేను గానీ, నా వంశం వారు గానీ ఇక రాజ్యాల కోసం యుద్ధం చేయరు. హింసకు పాల్పడరు. ధర్మం కోసమే జీవిస్తారు. ధర్మం కోసమే పాలిస్తారు’’ అని చెప్పాడు.

అప్పటికి అశోకుడిది అతి పెద్ద సైనిక శక్తి. వారితో ఆయన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయించాడు. ఆ పదో రోజే... ‘ధమ్మ విజం’. అశోకుడు ప్రతి ఏడాదీ ‘ధమ్మ విజయ దశమి’గా ఈ ఉత్సవాలు నిర్వహించాడు. ఆ తరువాత ప్రజలు దాన్ని ‘అశోక విజయదశమి’గా జరుపుకొన్నారు. 

ఆధునిక కాలంలో ధమ్మానంద కోసంబి, సత్య నారాయణ గోయంకా ఈ ఉత్సవాలను తిరిగి ప్రారంభించారు. అశోకుడు బౌద్ధ దీక్ష స్వీకరించిన విజయదశమి నాడు... 1956లో బోధిసత్వ డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆరు లక్షల మందితో కలిసి నాగపూర్‌లో బౌద్ధ దీక్ష స్వీకరించారు. నాటి నుంచి బౌద్ధులు దేశమంతటా ఈ విజయదశమి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ అశోక విజయదశమి శాంతికి చిహ్నం. కత్తిపై కరుణ సాధించిన విజయం. 

- బొర్రా గోవర్ధన్‌


Advertisement
Advertisement