ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో విచిత్రమైన పరిస్థితి..!

ABN , First Publish Date - 2021-07-23T08:03:20+05:30 IST

‘దళిత బంధు’ పథకం కింద ఎన్నికలు జరగనున్న ఒక్క హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే రూ.2,000 కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించటం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది

ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో విచిత్రమైన పరిస్థితి..!

ప్రజాధనంతో ఓట్ల గాలం!

సర్కారు సొమ్ముతో ఓట్ల వేట

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ‘దళిత బంధు’ను వాడుకుంటామని స్వయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్‌

దళితేతర వర్గాల్లో అసంతృప్తి

మిగిలిన నియోజకవర్గాల ప్రజలు నారాజ్‌

అధికార టీఆర్‌ఎస్‌లోనే చర్చ

మా ఎమ్మెల్యే చనిపోతే లేదా రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది

మాకు మేలు జరుగుతుంది

సోషల్‌ మీడియాలో పోస్టులు


హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ‘దళిత బంధు’ పథకం కింద ఎన్నికలు జరగనున్న ఒక్క హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే రూ.2,000 కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించటం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికార, విపక్షాలు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తే, పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేస్తారు. కానీ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయంలో షెడ్యూల్‌ వెలువడక ముందే ఏకంగా ప్రభుత్వం అక్కడ ఓటర్లను సూటిగా ప్రభావితం చేసేందుకే అన్నట్లుగా ‘దళిత బంధు’ పైలట్‌ ప్రాజెక్టు అమలుకు పూనుకోవటం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి దళిత సాధికారత’ పేరుతో ఒక పథకాన్ని తాజా వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఈ పథకం అమలు కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. అనుకోకుండా హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం కావటంతో ఈ పథకం స్వరూప, స్వభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. తొలి విడతలో ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంద మంది వంతున ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. మొదటి ఏడాది రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఈ పథకం అమలు కోసం ఇతరత్రా ఖర్చులు కాకుండా రూ.1,190 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. హఠాత్తుగా హుజూరాబాద్‌ పైలట్‌ ప్రాజెక్టును తెర మీదకు తెచ్చారు. అక్కడ సంతృప్త స్థాయిలో పథకం అమలు కోసం అదనంగా రూ.1,500 నుంచి రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. దీంతో ‘దళిత బంధు’ పథకం రాష్ట్ర వ్యాప్త అమలు కోసం వెచ్చిస్తామని చెప్పిన బడ్జెట్‌ కంటే ఎక్కువ నిధులను ఒక్క హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే ఖర్చు చేస్తారని స్పష్టమైంది. 


మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి?

‘దళిత బంధు’పై ఒకపక్క విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే మరోపక్క సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై అధికార టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వ సొమ్ముతో ఓటర్లను ఆకర్షిస్తే తప్పేంటని ముఖ్యమంత్రి ప్రశ్నించడంతో, ఆ తర్వాత ఉత్పన్నమయ్యే పరిణామాలపై ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పలువురు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు కొందరు దళిత నేతలు ఇది ఎన్నికల తాయిలమేనని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ హుజూరాబాద్‌ స్థాయిలో దళిత బంధు కోసం ఖర్చు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘‘హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం ‘దళిత బంధు’ పాచిక విసురుతున్నారు సరే! అదే నియోజకవర్గంలోని దళితేర వర్గాలు, మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి?’’ అనే ప్రశ్న వారి నుంచి వస్తోంది. ‘‘హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దళితులు మాత్రమే లేరు. మిగిలిన వర్గాల ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని ఎలా సమాధానపరుస్తారు?’’ అనే సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. 


అంతేకాక ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సంతృప్త స్థాయి పేరిట దళితుందరికీ ‘బంధు’ను అమలు చేసి, మిగిలిన 118 నియోజకవర్గాల్లో కేవలం 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్హులైన ఇతర దళితుల నుంచి తమకు నిలదీతలు తప్పవని మెజార్టీ టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అన్నింటి కంటే మించి సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఫోక్‌సగా తీసుకొస్తున్న ‘దళిత బంధు’ కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దళితేర వర్గాల నుంచి వ్యతిరేకత తప్పకపోవచ్చని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎన్నింటినో ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ, ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నగదు పంపిణీ అనే సరికి కుల, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతీ కుటుంబం ఆశ పడుతుందనే అభిప్రాయాన్ని చాలామంది టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో.. ‘మా ఎమ్మెల్యే చచ్చిపోతే బాగుండు..లేకపోతే రాజీనామా అయినా చేయాలి.. అప్పుడే ఉప ఎన్నిక వస్తుంది.. మాకు, మా నియోజకవర్గానికి నిధులు వస్తాయి. మేలు జరుగుతుంది. కొత్త పథకాలు అమలు చేస్తారు’ అనే పోస్టులు వైరల్‌ అవుతుండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ తీరుతో తమ నియోజక వర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొందని, దీనిని ఎలా డీల్‌ చేయాలో అర్థం కావటం లేదని వాపోతున్నారు. 


సొంత గ్రామం,దత్తత గ్రామాల పేరుతోనూ..

స్వగ్రామం, దత్తత గ్రామాల పేరుతో సీఎం కేసీఆర్‌ పెద్దఎత్తున ప్రభుత్వ నిధుల ఖర్చుకు సిద్ధపడటం కూడా తమకు తలనొప్పులు తెచ్చిందని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఎవరైనా ఊరును దత్తత తీసుకుంటే, తమ సొంత నిధులతో అక్కడ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతారు. కానీ కేసీఆర్‌ సీఎంగా తనకు ఉన్న విచక్షణాధికారాలను వినియోగించి, ప్రజలు పన్నులు చెల్లించటం ద్వారా ప్రభుత్వానికి సమకూరిన సొమ్మును స్వగ్రామం, దత్తత పేరుతో కొన్ని గ్రామాల్లోనే కుమ్మరించటంపై ఇంటా, బయట విమర్శలు ఉన్నాయి. అయినా ఆయన వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగుతుండటం వివాదాస్పదమవుతోంది. కేవలం తాను పుట్టిన ఊరు అనే ఒకే ఒక్క కారణంతో ఉమ్మడి మెదక్‌  జిల్లా చింతమడక, దానికి అనుబంధంగా గ్రామాల్లోని 1,276 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వ నిధులు పంచిపెట్టారు. దీని వల్ల తమ నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తాయని, చింతమడక తరహా ఆర్థిక సాయం ఎందుకు అందించరనే ప్రశ్నలు స్థానిక ప్రజల నుంచి ఎదురయ్యాయని పలువురు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఎర్రవెల్లి, చిన్నముల్కనూరు, నర్సన్నపేట, లక్ష్మీపూర్‌, కేశవరం, చింతలపల్లి, వాసాలమర్రి గ్రామాలను సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకొని భారీ ఎత్తున నిధుల ప్రకటన చేయటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.


చట్టం ముందు నిలుస్తుందా?

ఉప ఎన్నికలో ‘దళిత బంధు’ ప్రాజెక్టును వాడుకుంటామని సీఎం కేసీఆర్‌ బహిరంగంగానే చెప్పిన మేరకు అక్కడ ఈ కార్యక్రమం అమలు చట్టం ముందు నిలుస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కాక ముందు వరకు ప్రభుత్వం అక్కడ ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అయినా నిర్వహించవచ్చు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన మరు క్షణం ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం అక్కడ కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే వీలుండదు. ఒకవేళ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలకు ముందే, హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని అమల్లోకి తెచ్చి ఉంటే మాత్రం, ఆన్‌ గోయింగ్‌ స్కీం కింద కొనసాగుతుందని, ఎన్నికల కోడ్‌ కారణంగా నిలుపుదల కాకపోవచ్చని అంటున్నారు. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ముందు అమల్లోకి తెచ్చిన రైతు బంధు పథకం, ఎన్నికల సమయంలోనూ కొనసాగించటానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించటాన్ని వారు గుర్తుచేస్తున్నారు. కానీ, ‘దళిత బంధు’ విధివిధానాలు ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలకు ముందే, నియోజకవర్గంలోని దళితులందరికీ సంతృప్త స్థాయిలో రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారా? లేక కొందరికే సాయం అందించి, ఎన్నికల తర్వాత మిగిలిన వారికి సాయం అందిస్తామని చెబుతారా? అనే విషయంలో స్పష్టత లేదు. సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్న మేరకు నియోజకవర్గంలోని దళితులందరికీ ‘బంధు’ నిధులు చేరితే, అక్కడి దళితేర వర్గాల నుంచి వచ్చే వ్యతిరేకత వేడిని తమ ప్రభుత్వం ఎలా చల్లారుస్తుందనేది వేచి చూడాల్సి ఉందని అధికార టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. అంతేకాక ఉప ఎన్నికలు ఉన్నాయని ప్రభుత్వమే ఓట్ల కోసం ఒక నియోజకవర్గంలో పథకం పేరుతో ప్రజల సొమ్ము రూ.1,500-రూ.2,000 కోట్లు పంచటాన్ని తప్పుపడుతూ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించలేమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.


దళితుల ఓట్లు ఎక్కువగా ఉండటం వల్లనే

హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ నియోజకవర్గంలో దళితుల ఓట్లు అత్యధికంగా 45,000 ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ దళిత సాధికారత పథకం పేరు మార్చి ‘దళిత బంధు’ను తెరపైకి తెచ్చారని, పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ పథకం అమలు కోసం హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారనే విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తాయి. ఈ వాదనను తొలుత మంత్రులు, టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు చాలా మంది ఖండించారు. ‘దళిత బంధు’ హుజూరాబాద్‌ ఓట్ల కోసం కాదని, దళితుల అభ్యన్నతి కోసం అని వివరణ ఇచ్చారు. అయితే, తాజాగా సీఎం కేసీఆర్‌ బుధవారం తెలంగాణ భవన్‌లో హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ బహిష్కృత నేత పాడి కౌశిక్‌రెడ్డిని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకునే కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘దళిత బంధు’ ప్రాజెక్టును హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వాడుకుంటామని స్పష్టత ఇచ్చారు. తమది ఫంక్తు రాజకీయ పార్టీ అని, ఎన్నికల్లో గెలవటానికి ‘దళిత బంధు’ను ఉపయోగించుకుంటే తప్పేమిటని విపక్షాలను నిలదీశారు.


జీహెచ్‌ఎంసీలో పంచినా..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల సమయంలోనూ వరద సాయం పేరిట ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వ సొమ్మును పంపిణీ చేశారు. అధికార పార్టీ నాయకులు పోటీలుపడి అనర్హులైన అనుచరులకు వేల మందికి ఈ సొమ్ము ఇప్పించారు. వరద రాని కాలనీలకు కూడా పెద్ద ఎత్తున పరిహారం అందింది. అయినప్పటికీ, అధికార టీఆర్‌ఎ్‌సకి ఆ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు రాలేదు. సిటింగ్‌ స్థానాలన్నింటినీ నిలబెట్టుకోలేకపోయింది. ఈ కార్యక్రమం వల్ల అప్పుడు లాభం కంటే ఎక్కువగా నష్టమే జరిగిందని టీఆర్‌ఎస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ వల్ల వరద సాయం పంపిణీ మధ్యలోనే నిలిచిపోగా, పోలింగ్‌ తర్వాత వరద సాయం పంపిణీ ఉంటుందని ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పినప్పటికీ, గ్రేటర్‌ ప్రజలు టీఆర్‌ఎ్‌సను నమ్మలేదని ఫలితాలతో తేలిపోయింది. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిశాక ఇప్పటి వరకు వరద సాయం పంపిణీ పునరుద్ధరణకు నోచుకోని విషయం తెలిసిందే.


సమన్యాయం ఏదీ?

ముఖ్యమంత్రి రాష్ట్రానికి ధర్మకర్త. సంపదలను రాష్ట్ర ప్రజల అభివృద్ధికి వినియోగించాల్సిన పెద్ద మనిషి పాత్ర ఆయనది. ఈ క్రమంలో బాగా వెనుక బడిన ప్రాంతాలకు, బాగా వెనుక బడిన వర్గాలకు అనుకూలంగా పక్షపాతం చూపించాల్సిన బాధ్యత కూడా ఆయనదే. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న నిధుల ఖర్చులో ఆ ధర్మ సూక్ష్మతలు ఏవీ పాటిస్తున్నట్లు కనిపించడం లేదు. తాను పుట్టిన ఊరిలో ఒక్కో కుటుంబానికి పది లక్షలు ఇవ్వడం చట్టబద్ధ పాలనకు భిన్నమైనదే. ఇలా పంచి పెట్టడానికి గీటురాయిగా పాటించిన అర్హతలేంటో చెప్పలేదు. గతంలో నాయకులు ఇలా సొంత ఊరి కోసం బాహాటంగా చేయాలంటే భయపడే వారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయోనని ఆలోచించే వారు. సాధారణంగా పైలట్‌ ప్రాజెక్టును చిన్న స్థాయిలో అమలు చేసి, అందులో లోపాలను పరిహరిస్తూ అసలు ప్రాజెక్టును పెద్ద ఎత్తున చేపడతారు. దళిత బంధు విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. అసలు ప్రాజెక్టును మాత్రం నియోజకవర్గానికి వంద అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ఇచ్చే విధంగా చేపట్టారు. ముందుగా చేపట్టాల్సిన పైలట్‌ ప్రాజెక్టును మాత్రం ఉప ఎన్నికల ప్రభావంతో భారీ ఎత్తున నియోజకవర్గానికి 20 వేల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఇచ్చేట్లు ప్లాన్‌ చేశారు. హుజూరాబాద్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా పరిగణిస్తే దాని ఫలితాలు వచ్చే వరకు రాష్ట్రమంతటా ‘దళిత బంధు’ వేచిచూడాలా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతున్నా కొద్దీ ఆయా సమాజాల్లో ఓటర్లకు తాయిలాల పాత్ర తగ్గుతూ ఉంటుంది. రాష్ట్రంలో మాత్రం విచిత్రంగా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. 


దత్తత అంతంతే..ఇది మరో కోణం

సీఎం స్థాయిలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను సమానంగా చూడాల్సిన కేసీఆర్‌.. సొంత, దత్తత గ్రామాల పేరిట కొన్నింటిపైనే వల్లమాలిన అభిమానం చూపుతూ భారీ ఎత్తున ప్రభుత్వ నిధుల మంజూరు ప్రకటనలు చేయటం ఒక కోణం అయితే, కొన్నిచోట్ల దత్తత పథకాలు అరకొరగా మాత్రమే అమలవడం మరో కోణంగా నిలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామాన్ని సీఎం కేసీఆర్‌ తొలుత దత్తత తీసుకున్నారు. ఆ గ్రామానికి మూడుసార్లు వెళ్లిన సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. చిన్న ముల్కనూరు గ్రామంలో అర్హులైన లబ్థిదారులు సుమారు 500 మందికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. కానీ, 247 ఇళ్లను మాత్రమే మంజూరు చేశారు. ఇందులో ఐదుగురు లబ్థిదారులకు సంబంధించిన కేసు కోర్టు వివాదంలో ఉండగా, 242 ఇళ్లు మాత్రమే నిర్మించి ఇచ్చారు. మిగతా వారికి ఇప్పటివరకు ఇళ్లు మంజూరు కాలేదు. గ్రామంలో ఉన్న అతిథి గృహాన్ని కూల్చివేసి, అదే స్థలంలో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ ఫంక్షన్‌ హాల్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అతిథి గృహాన్ని కూల్చివేశారు. కానీ, ఆ స్థలంలో ఫంక్షన్‌ హాల్‌ మాత్రం ఇప్పటివరకు నిర్మించలేదు. మహిళా సంఘాల కోసం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పిన హామీ అమలు కాలేదు. ఊర చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా చేస్తామన్న హామీది అదే పరిస్థితి. గ్రామంలోని అన్ని వార్డుల్లో సిసి రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, కొన్ని వార్డుల్లో మాత్రమే సీసీ రోడ్లు నిర్మించారు. మిగతా వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు నిధుల లేమితో అర్థంతరంగా నిలిచిపోయాయి. గ్రామంలో పూర్తిస్థాయిలో మురికి కాల్వల నిర్మాణానికి హామీ ఇచ్చినప్పటికీ, అదీ అమలుకు నోచుకోలేదు. ఇక్కడి మోడల్‌ స్కూల్‌ నుంచి ప్రైమరీ స్కూల్‌ వరకు డబుల్‌ రోడ్డు నిర్మించి, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తామన్న పనులు మొదలు పెట్టలేదు. సీఎం కేసీఆర్‌ సొంత గ్రామం ఉమ్మడి మెదక్‌ జిల్లా చింతమడక గ్రామంలో హామీ ఇచ్చిన గురుకుల పాఠశాల భవనం నిర్మాణ దశలో ఉంది. గ్రామానికి 2,000 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేస్తానని చెప్పి, కేవలం 200 ఇళ్లు పూర్తి చేసి పంపిణీ చేశారు. మిగిలిన ఇళ్లు ఇంకా పూర్తి కాలేదు. చెప్పిన విధంగా కులానికి ఒక ఫంక్షన్‌ హాల్‌ కూడా నిర్మించలేదు. సీఎం కేసీఆర్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు. ఆ గ్రామ అభివృద్ధికి రూ.150 కోట్లు అవసరమని తేల్చారు. ఖర్చుకు వెనుకాడేది లేదని సీఎం చెప్పారు. 

Updated Date - 2021-07-23T08:03:20+05:30 IST