Abn logo
May 16 2021 @ 00:16AM

అమ్మతనంలోనే ఆనందం!

‘బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరు’, ‘భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భార్య’ అంటూ అనుష్కా శర్మను కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేదు. ఎలాంటి పాత్రనైనా మెప్పించే అభినేత్రిగా ఆమెకు పేరుంది. కొన్నాళ్ళ నుంచి నటిగా సినిమాలు తగ్గించుకున్న ఆమె ‘అమ్మ’గా కొత్త పాత్రను ఆస్వాదిస్తున్నారు. మాతృత్వ అనుభూతుల గురించీ, కుమార్తె వామిక పెంపకంపై తన ఆలోచనల గురించీ అనుష్క ఏం చెబుతున్నారంటే...‘‘మోడల్‌, నటి, నిర్మాత... వీటన్నిటికన్నా నాకు ఎంతో ఆనందాన్నిస్తున్న పాత్ర... ఇప్పుడు నేను పోషిస్తున్న ‘అమ్మ’ పాత్ర. మా అమ్మాయి వామిక ఈ ఏడాది జనవరిలో పుట్టింది. దాదాపు నాలుగు నెలల నుంచీ తనే నా లోకం. మొదటిసారి తనను చూడగానే  కన్నీళ్ళు, నవ్వు, ఉత్తేజం, ఊరట... ఇలా ఎన్నో భావోద్వేగాలు ఒకే క్షణంలో కలిగాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. 


ఆ మాట నేను ఒప్పుకోను...

‘పిల్లలను పెంచే బాధ్యత పూర్తిగా తల్లిదే!’ అనే అభిప్రాయం మన సమాజంలో బలంగా ఉంది. అది నేను ఒప్పుకోను. గర్భధారణ, ప్రసవించడం, చనుబాలు ఇవ్వడం లాంటి పనులు తల్లి తప్ప మరెవరూ చెయ్యలేరు. బిడ్డ పుట్టాక సంరక్షణ కోసం ఎంతో చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను తల్లీ, తండ్రీ పంచుకోవాల్సిందే. ‘ఇది అమ్మ పని, ఇది నాన్న పని’ అని నేనూ, నా భర్త విరాట్‌ కోహ్లీ గీతలు గీసుకోం. అది కుటుంబం పని. కుటుంబంలో ఎవరైనా చెయ్యవచ్చు. మా బిడ్డను చక్కటి దృక్పథంతో పెంచడం మాకు ముఖ్యం. మొదటి కొన్ని సంవత్సరాల్లో బిడ్డ సంరక్షణ బాధ్యత ప్రధానంగా తల్లిదే. విరాట్‌ ఏడాది పొడుగునా క్రికెట్‌ ఆడుతూ ఉంటాడు. అందుకే మా అమ్మాయి కోసం ప్రస్తుతానికి సినిమాలు తగ్గించుకున్నా. విరాట్‌ ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మాయి పనుల్లో కొన్ని అతడికి అప్పగిస్తూ ఉంటా. వామిక పుట్టడానికి మందే విరాట్‌ పెటర్నటీ లీవ్‌ తీసుకొని వచ్చాడు. నా అవసరాలు చూసుకున్నాడు. ఇప్పుడే సెలబ్రిటీని చెయ్యొద్దు..

విరాట్‌కు క్రికెటర్‌గా, నాకు నటిగా అభిమానులున్నారు. మా అమ్మాయి ఫొటోలు చూడాలని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ ఈ హడావిడికి దూరంగా వామికను ఉంచాలనుకుంటున్నాం. మా బిడ్డను ఎలా పెంచుతున్నదీ ప్రజలందరికీ తెలియాలనో, పుట్టగానే సోషల్‌ మీడియా ద్వారా పేరు తెచ్చేసుకోవాలనో మేము కోరుకోవడం లేదు. పుట్టినప్పుడు పిల్లలంతా సమానమే. ‘మిగిలిన వారికన్నా నువ్వు ప్రత్యేకం’ అనే భావన చిన్నప్పటి నుంచీ వాళ్ళలో కలిగిస్తే... పెద్దయ్యాక సమాజంతో కలిసిపోవడం కష్టం అవుతుంది. మన వ్యక్తిగత జీవితం గోప్యంగా ఉండాలా, లేదంటే అన్ని విషయాలూ మాధ్యమాలతో పంచుకోవాలా అనేది ఎవరికి వారు సొంతంగా తీసుకొనే నిర్ణయం. అలాంటి నిర్ణయం పెద్దయ్యాక మా అమ్మాయే తీసుకుంటుంది. కొందరు మా అమ్మాయి ఫొటో అంటూ ఫేక్‌ పోస్టులు పెట్టారు. ఇలాంటి దానికి తెరదించాలనుకున్నాం. కానీ, ఇప్పుడే తనను సెలబ్రిటీగా చెయ్యాలనుకోలేదు. తల వెనుక భాగం మాత్రమే కనిపించేలా ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడానికి కారణం అదే. అనవసరమైన ప్రచారం వద్దనీ, రహస్యంగా మా అమ్మాయి ఫొటోలు తీయ్యొద్దనీ మీడియాను కోరుతున్నాం.


బ్యాలెన్స్‌ చేసుకోవడం ఇబ్బందే...

పిల్లల పెంపకం గురించి సలహాలు ఇచ్చేంత వయసూ, అనుభవం నాకు లేవు. ఒక బిడ్డకూ, మరో బిడ్డకూ అవసరాలు కూడా వేరేగా ఉంటాయి. ఇది ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిందే. పిల్లల సంరక్షణలో ప్రధానంగా ఉండాల్సింది సహనం, ఒత్తిడికి లోనుకాకుండా ఉండడం అని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. తల్లితండ్రులు ఇద్దరూ తమతమ కెరీర్లలో బిజీగా ఉంటే పిల్లల్ని చూసుకోవడం కష్టం అవుతుంది. ముఖ్యంగా మహిళలు తమ కెరీర్లనూ, పిల్లల బాధ్యతనూ బ్యాలెన్స్‌ చేసుకోవడం ఇబ్బందే. నేను గర్భం ధరించిన తరువాత ఎక్కువగా వాణిజ్య ప్రకటనల్లోనే నటించాను. వెబ్‌సిరీస్‌లూ, సినిమాలు నిర్మిస్తున్నాను. వాటిలో నేను నటించడం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా వామిక పెంపకం మీదే.’’ 

Advertisement
Advertisement
Advertisement