అదరగొట్టిన హ్యాపియెస్ట్‌ మైండ్స్‌

ABN , First Publish Date - 2020-09-18T05:58:36+05:30 IST

తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లో అదరగొట్టిన హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌...

అదరగొట్టిన హ్యాపియెస్ట్‌ మైండ్స్‌

  • కంపెనీ లిస్టింగ్‌కు అపూర్వ స్పందన  
  • తొలిరోజే 123 శాతం పెరిగిన షేరు 


న్యూఢిల్లీ: తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లో అదరగొట్టిన హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌.. గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో లిస్ట్‌ అయింది. ఈ ఐటీ కంపెనీ షేర్లకు మదుపర్లు బ్రహ్మరథం పట్టారు. ఐపీఓ ఇష్యూ ధర రూ.166తో పోలిస్తే తొలి రోజే షేరు 123 శాతం వృద్ధి చెంది రూ.371కి చేరుకుంది. గడిచిన కొన్నేళ్లలో లిస్టింగ్‌ రోజునే 100 శాతం పైగా పుంజుకున్న కంపెనీ షేర్ల జాబితాలో తాజాగా హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ కూడా చేరింది. గతంలో డీ-మార్ట్‌ సూపర్‌ మార్కెట్ల నిర్వహణ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌, ప్రభుత్వ రంగ రైల్వే సంస్థ ఐఆర్‌సీటీసీ మాత్రమే లిస్టింగ్‌ రోజున 100 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. గురువారం బీఎ్‌సఈలో ట్రేడింగ్‌ ముగిసేసరికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 5,448.64 కోట్లుగా నమోదైంది. బీఎస్‌ ఈలో మొత్తం 109.73 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కాగా ఎన్‌ ఎ్‌సఈలో 5 కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి. 


ఐపీఓలో 151 రెట్ల బిడ్లు

దేశీయ ఐటీ రంగ ఆద్యుల్లో ఒకరైన అశోక్‌ సూతాకు చెందిన హ్యాపియెస్ట్‌ మైండ్స్‌.. రూ.700 కోట్లకు పైగా నిధుల సేకరణ లక్ష్యంతో ఐపీఓకు వచ్చింది. కంపెనీ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఇష్యూ సైజుతో పోలిస్తే 151 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. 


సెన్సెక్స్‌ 323 పాయింట్లు డౌన్‌ 

స్టాక్‌ మార్కెట్లో రెండ్రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ గురువారం 323 పాయింట్లు నష్టపోయి 38,979.85 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 88.45 పాయింట్లు కోల్పోయి 11,516.10 వద్ద స్థిరపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి ఇంకా వీడలేదని హెచ్చరించిన ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ ‘ఫెడరల్‌ రిజర్వ్‌’.. కొత్తగా ఉద్దీపనలేం ప్రకటించకపోవడంపై ఇన్వెస్టర్లు పెదవి విరిచారు. దాంతో గ్లోబల్‌ మార్కెట్లో అమ్మకాలు పోటెత్తాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీ మార్కెట్లూ నష్టాలబాటలో పయనించాయి. 

Updated Date - 2020-09-18T05:58:36+05:30 IST