అతిథి దేవోభవ

ABN , First Publish Date - 2020-04-06T08:20:13+05:30 IST

తన కుమారుడిని చూసేందుకు అమెరికా వెళ్లిన తండ్రిని ఓ స్నేహితుడి ఇంటికి భోజనానికి తీసుకెళ్లాడు కుమారుడు. తిన్నాక.. భోజనం పెట్టిన స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పాలని తండ్రికి సూచించాడు కొడుకు. కొన్నాళ్లకు భారత్‌కు తిరిగి

అతిథి దేవోభవ

తన కుమారుడిని చూసేందుకు అమెరికా వెళ్లిన తండ్రిని ఓ స్నేహితుడి ఇంటికి భోజనానికి తీసుకెళ్లాడు కుమారుడు. తిన్నాక.. భోజనం పెట్టిన స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పాలని తండ్రికి సూచించాడు కొడుకు. కొన్నాళ్లకు భారత్‌కు తిరిగి వచ్చిన తండ్రికి ఆ కొడుకు ఫోన్‌ చేసి.. తన స్నేహితుడు ఏదో పని మీద వస్తున్నాడని, అతడికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పాడు. వారం రోజులు ఆతిథ్యం పొందిన ఆ అమెరికా అబ్బాయి కార్లో ఎక్కుతుంటే ‘మా ఇంట్లో అతిథిగా ఉన్నందుకు థ్యాంక్స్‌’ అన్నాడు ఈ తండ్రి. అప్పుడా అబ్బాయి వెనక్కి తిరిగి.. ‘మీరు అమెరికా వచ్చినప్పుడు మా ఇంట్లో తిన్నప్పుడు మీరే థ్యాంక్స్‌ చెప్పారు. ఈ రోజు నేను మీ ఇంట్లో తిన్నా మీరే థ్యాంక్స్‌ చెబుతున్నారు. ఎందుకిలా?’ అని ప్రశ్నించాడు. ‘అతిథిగా వచ్చిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్పడం భారతీయ సంస్కృతి’ అన్నాడు పెద్దాయన. కళ్లనిండా నీళ్లు నింపుకొన్న అమెరికా కుర్రాడు ఆయన కాళ్లకు దండం పెట్టాడు. అవును! మన దేశంలో అతిథిని గౌరవించి, పూజించడం ఒక సభ్యతగా, సంస్కారంగా అలవర్చుకొన్నాం. అందుకే గృహస్థులు అయ్యేందుకు చేసే వివాహ తంతులో ‘అతిథి దేవోభవ’ అని ప్రమాణం చేయిస్తారు. వేరే గ్రామం నుండి వచ్చేవాడు, ఒక రాత్రి మాత్రమే ఉండేవాడు, మధ్యాహ్నం తర్వాత వచ్చేవాడు అతిథి అని గౌతముడు చెప్పాడు. అయితే.. భోజనం కోసం ఎప్పుడు వచ్చినా అతిథిగానే గుర్తించాలని ఆ తర్వాత మన శాస్త్రకారులు నిర్ణయించారు. ఇతర కారణాల వల్ల సకాలంలో రాకున్నాగాని అతిథికి భోజనం, పానీయం, ఫలాదులు అందించాలని చెప్పారు. అతిథిగా వచ్చిన వ్యక్తికి గృహస్థు తినేదాన్నే దాచకుండా పెట్టాలని కూడా సూచించారు.


న వై స్వయం తదశ్నీయాత్‌ అతిథిం యన్న భోజయేత్‌

ధన్యం యశస్యమాయుష్యం స్వర్గం చాతిథి పూజనమ్‌


భోజన సమయంలో తాను తినబోయే పెరుగు, పాలు మొదలైన అన్ని పదార్థాలనూ అతిథికి పెట్టకుండా తినకూడదు. అతిథి సంతర్పణ వల్ల ధనం, కీర్తి, ఆయుష్షు పొందడమే గాకుండా స్వర్గం పొందిన ఫలం లభిస్తుందని మను మహర్షి చెప్పాడు. అందుకే రంతిదేవుడిలాంటి మహానుభావుడు తన సర్వస్వం దానం చేసి విశేషకీర్తి పొందాడు. ‘‘సకల దేహభాజాం ఆర్తిం ప్రపద్యే’’.. అనగా, ‘‘అన్ని జీవుల్లో ఉండే దుఃఖాన్ని నాకు ఇవ్వు’’ అనగలిగినంత శక్తిని రంతిదేవుడు ఈ అతిథి సేవనం వల్లనే పొందాడు. పట్టణీకరణ, పాశ్చాత్యీకరణ పెరిగిపోయి మానవ సబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో..‘అతిథి’ రావడం పోవడం చుట్టపు చూపుగా మారిపోయింది. దుర్వాస మహర్షి బహు శిష్య సమేతుడై వస్తే అరణ్యంలో ఉన్న ద్రౌపది ఆ కఠిన పరీక్షను ఎదుర్కొని భోజనంపెట్టగలిగింది. పేరుకు అక్షయపాత్ర ఆమె చేతిలో ఉండొచ్చుగానీ పెట్టగలిగిన సహృదయత ఆమె మనస్సులో లేకపోతే అది సాధ్యం కాదు. అతిథిగా వచ్చి అన్నార్తుడై అరుపులు, కేకలు పెట్టిన వ్యాసర్షికి పరీక్ష పెట్టి అన్నం దొరక్కుండా చేసి అన్న విలువను, ఆతిథ్యపు అర్హతను ఏకకాలంలో చూపించిన అన్నపూర్ణాదేవి కథ ఆతిధ్య విలువను తెలియజేసేదే.


సర్వేషామేవ దానానామన్నదానం పరమ్‌ అన్నదానం మహాపుణ్యం ఫలప్రదమ్‌

అన్నదానం గొప్పదని మన స్మృతికారులు చెప్పడం వల్ల అతిథి, అభ్యాగతులను ఆదరించడం మన రక్తంలో భాగమైపోయింది. ఆ స్ఫూర్తిని కాపాడడం మనందరి కర్తవ్యం.

- డా.పి.భాస్కరయోగి

Updated Date - 2020-04-06T08:20:13+05:30 IST