మహమ్మారి చెప్పిన మహా సత్యం!

ABN , First Publish Date - 2020-04-10T05:41:40+05:30 IST

నా కులమే గొప్పది, నా జాతే గొప్పది, నా దేశమే గొప్పది, నా వంశమే గొప్పది...’ ఇలా అనేక అహంకారాలతో విర్రవీగేవారు మనలో చాలామందే...

మహమ్మారి చెప్పిన మహా సత్యం!

‘నా కులమే గొప్పది, నా జాతే గొప్పది, నా దేశమే గొప్పది, నా వంశమే గొప్పది...’ ఇలా అనేక అహంకారాలతో విర్రవీగేవారు మనలో చాలామందే ఉన్నారు. ఈ అహంకార అంధకారం వల్లనే ఎన్నో జాతులు, ఎన్నో దేశాలు తమ చరిత్రను రక్తంతో రాసుకున్నాయి. ఈ అహంకారం వల్లే ప్రపంచ యుద్ధాలు వచ్చి పడ్డాయి. మనిషిలోని మానవత్వాన్ని ఈ అహంకారాలు నమిలి మింగేశాయి. ఇప్పటికీ ‘నాదే అగ్ర రాజ్యం. మేమే ప్రపంచ శాసకులం’ అని విర్రవీగే దేశాలూ ఉన్నాయి.


ఒకనాడు బుద్ధుడి సోదరుడు ఆనందునికి సందేహం వచ్చింది... ‘మానవుల్లో ఉత్తమ జాతి ఏది?’ అని! వెంటనే బుద్ధుడి దగ్గరకు వచ్చి- ‘‘భగవాన్‌! సింధు దేశానికి చెందిన సైంధవ అశ్వాలు ఉత్తమమైనవి. వృషభాల్లో కొన్ని వృషభాలు శ్రేష్టమైనవి. ఏనుగుల్లో ఛద్దంతి జాతి ఏనుగులు ఉత్తమోత్తమం. ఫలాల్లో ఉత్తమమైనవి ఉన్నాయి. అలాగే మానవుల్లో ఉత్తమమైన జాతి ఏది?’’ అని అడిగాడు.


అప్పుడు బుద్ధ భగవానుడు చిరునవ్వు నవ్వి ‘‘ఆనందా! మనుషులు శారీరక బలంతో కాకుండా బుద్ధి బలంతో, గుణంతో రాణిస్తారు. ఒక జాతిలోనో, ఒక కులంలోనో, ఒక దేశంలోనో ఉన్నతుడు, ఉత్తముడు జన్మించవచ్చు. జాతి జాతంతా ఉత్తమమైనదీ, మహోన్నతమైనదీ అంటూ మానవుల్లో ఏదీ ఉండదు’’ అని చెప్పాడు. 


ఎవరికి వారు... లేదా ఆర్థిక బలమో, అంగ బలమో (ఆయుధ బలం) ఉన్నవారు ‘నా దేశం గొప్పది’ అని చెప్పుకోవచ్చు. కానీ ప్రకృతికి మనుషులంతా ఒక్కటే! ఈ విషయం ఇన్నాళ్ళకు కరోనా మహమ్మారి అనే శత్రువు మనకు గుర్తు చేసింది. మనం ఇన్నాళ్ళూ వంశం, కులం, ప్రాంతం, దేశం పేరుతో పెంచుకున్న శత్రుత్వాలన్నీ చెరిపేసింది. ‘మనుషులంతా ఒక్కటే’ అనే మహాసత్యాన్ని ఆ మహమ్మారి ప్రత్యక్షంగా చూపించింది. మనుషుల మధ్య మమకారాలూ, మాధుర్యాలూ, సహకారాలూ మాత్రమే ఉండాలని చెళ్ళున చరిచి మరీ చెప్పింది!

- బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-04-10T05:41:40+05:30 IST