సర్కారీ స్కూల్‌ కిటకిట!

ABN , First Publish Date - 2021-08-28T09:03:06+05:30 IST

విశాఖపట్నం నగర పరిధిలోని మధురవాడలో ఉన్న చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల(చంద్రంపాలెం స్కూల్‌) విద్యార్థులతో కిటకిటలాడుతోంది. ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడి ఉపాధ్యాయులు

సర్కారీ స్కూల్‌ కిటకిట!

విశాఖ నగరంలోని చంద్రంపాలెం పాఠశాలలో 3,900 మంది విద్యార్థులు

ఈ ఏడాది 872 మందికి కొత్త అడ్మిషన్లు

రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో స్టూడెంట్స్‌

రికార్డును కొనసాగిస్తున్న ఉన్నత విద్యాసంస్థ

ప్రైవేటుకు దీటుగా విద్యా బోధన, వసతులు


(విశాఖపట్నం/కొమ్మాది-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం నగర పరిధిలోని మధురవాడలో ఉన్న చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల(చంద్రంపాలెం స్కూల్‌) విద్యార్థులతో కిటకిటలాడుతోంది. ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. దీంతో ఈ పాఠశాలలో తమ చిన్నారులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రతి ఏటా పోటీ పడుతుండడం గమనార్హం. చంద్రంపాలెం స్కూల్‌లో ప్రస్తుతం 3,900 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక విద్యార్థులు(3600 మంది) ఉన్న పాఠశాలగా గత ఏడాది నెలకొల్పిన రికార్డును ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ స్కూల్‌ అధిగమించడం విశేషం. ఈ ఏడాది ఇప్పటి వరకు 872 మంది కొత్త విద్యార్థులకు పాఠశాలలో ప్రవేశాలు కల్పించారు. వీరిలో 80 శాతం మంది ఆరో తరగతిలో చేరగా, మిగిలిన వారు ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల్లో ప్రవేశాలు పొందారు. అయితే, మరో 200 నుంచి 300 మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజబాబు అంచనా వేస్తున్నారు. 


బోధనలో మేటి!

విశాఖ నగరంలోని మధురవాడ ఎంతో కీలక ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందినవారు ఉంటున్నారు. వీరికి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేదు. అదేసమయంలో చంద్రంపాలెం పాఠశాలలో మౌలిక సదుపాయాలు, పాఠ్యాంశాల బోధన ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉండడంతో మధురవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ పాఠశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రతి ఏటా పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న 52 తరగతి గదులకు అదనంగా మరో 27 తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా విద్యాశాఖాధికారి బి. లింగేశ్వరరెడ్డి తెలిపారు.


పాఠాలు బాగా చెబుతున్నారు!

మా పాప ఐదో తరగతి వరకు భీమిలి ఏఎంజీ పాఠశాలలో చదివింది. కరోనా ప్రభావంతో పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. దీంతో ప్రైవేటు పాఠశాలలో చదివించే స్థోమత లేదు. పైగా చంద్రంపాలెం పాఠశాలలో పాఠాలు బాగా చెబుతారని తెలిసి.. ఆరో తరగతిలో చేర్పించా.

పలక కన్నమ్మ, విద్యార్థిని తల్లి




తల్లిదండ్రుల అభిమానం పొందాం

ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది ప్రస్తుతం 3,900కి చేరుకున్నాం. మరో రెండు, మూడు రోజుల్లో 4,000 మార్క్‌ను దాటేస్తాం. బోధన, వసతుల విషయంలో రాజీపడం. వీటిని పరిగణనలోకి తీసుకునే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. వారి అభిమానం సంపాదించడం సంతోషంగా ఉంది.

రాజబాబు, ప్రధానోపాధ్యాయుడు

Updated Date - 2021-08-28T09:03:06+05:30 IST