సి..ఫార్స్‌ బదిలీలు!

ABN , First Publish Date - 2020-07-12T08:21:53+05:30 IST

మూడేళ్ల తరువాత తొలిసారిగా బదిలీలకు అవకాశం రావడంతో టీచర్లు సంబరాలు చేసుకొన్నారు. సాధారణ బదిలీలు మొదలు అంతర్‌ జిల్లా బదిలీలు, పరస్పర బదిలీల

సి..ఫార్స్‌ బదిలీలు!

  • టీచర్ల ఆశలపై సర్కారు నీళ్లు
  • 40 రోజుల్లో 20 మందికి చాన్స్‌
  • సీఎం జిల్లాలోనే 14 బదిలీలు
  • కౌన్సెలింగ్‌కు ముందే వేగంగా
  • కదులుతున్న బదిలీల ఫైళ్లు
  • పైరవీ చేసుకొంటే ఎక్కడికైనా


అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మూడేళ్ల తరువాత తొలిసారిగా బదిలీలకు అవకాశం రావడంతో టీచర్లు సంబరాలు చేసుకొన్నారు. సాధారణ బదిలీలు మొదలు అంతర్‌ జిల్లా బదిలీలు, పరస్పర బదిలీల దాకా చేపట్టే కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తుందా అని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. కౌన్సెలింగ్‌పై ప్రకటన ఇంకా వెలువడలేదుగానీ.. బదిలీలు మాత్రం జరిగిపోతున్నాయి. అవును.. ఇవన్నీ రాజకీయ బదిలీలు. ఉన్నత స్థాయిలో సిఫారసు, పైరవీ చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు చేతిలో పెడుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో అయితే మరింత తేలికగా సర్కారీ బదిలీల పర్వం నడిచిపోతోందని చెప్పుకొంటున్నారు. జూలై నెలలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఇటీవల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కానీ ఈ లోపే ఉపాధ్యాయులను బదిలీ చేస్తుండటం పట్ల పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తమకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. ఒకవైపు కౌన్సెలింగ్‌ ద్వారా ఉపాధ్యాయ బదిలీలు చేపడతామంటూనే.. అడ్డదారి బదిలీ ఉత్తర్వులను ఇస్తుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ రాజకీయ బదిలీలు కావడంతో.. ఎటువంటి కోరికైనా ఇట్టే తీరిపోతోంది. అంతెందుకు.. కడప జిల్లాలో ఒక పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లను, అదే పాఠశాలలో బాలికల విభాగం నుంచి బాలుర విభాగానికి, బాలుర విభాగం నుంచి బాలికల విభాగానికి పరస్పర బదిలీ చేశారు. ఇలా సాధారణ, అంతర్‌ జిల్లా, పరస్పర బదిలీల కింద గత 40 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఉపాధ్యాయలు చాన్స్‌ కొట్టేశారు. ఇందులో కడప జిల్లాలోనే అత్యధికంగా 14  బదిలీలు జరగడం గమనార్హం.


దొడ్డిదారిలో ఇలా..

కడప జిల్లాలో.. లింగాలమండలం తాతిరెడ్డిపల్లిలోని ఎంపీయూపీఎ్‌సలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఎన్‌.నాగమణి అనే టీచర్‌కు ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తిలోని ఎంపీయూపీఎ్‌సకు బదిలీ. వీరపునాయునిపల్లి మండలం పెద్దయ్యగారిపల్లిలోని ఎంపీపీఎ్‌సలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న సి.నాగసరోజకు పులివెందుల సమీపంలోని మోత్నూతలపల్లి ఎంపీపీఎ్‌సకు బదిలీ. ఎన్‌.పలగిరిలోని ఎంపీపీఎస్‌ (స్పెషల్‌)లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న పి.రాజశేఖరరెడ్డికి వేముల మండలం వేల్పులలోని ఎంపీయూపీఎ్‌సకు బదిలీ. సింహాద్రిపురం మండలం వై.కొత్తపల్లిలోని ఎంపీపీఎ్‌సలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న డి.మధుసూదనరెడ్డికి కడపటౌన్‌లోని భగత్‌సింగ్‌నగర్‌లోని ఎంపీపీఎ్‌సకు బదిలీ. ఇదే మండలం నిదెవెలగలలోని ఎంపీపీఎ్‌సలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న వి.సమంతకళకు కడపటౌన్‌లోని భగత్‌సింగ్‌నగర్‌లోని ఎంపీపీఎ్‌సకు బదిలీ. ఇదే మండలం గురిజాలలోని జడ్పీ హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.జానకి, లింగాల మండలం పామపల్లి లోని జడ్పీహెచ్‌ఎ్‌సలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.విశ్వనాథరెడ్డికి పరస్పర బదిలీ. కొండాపురం మండలం సాయిపేట(బీసీ)లోని ఎంపీపీఎ్‌సలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న పి.శివకల్యాణ్‌కు అల్లూరు మండలం సింగారెడిదిన్నెలోని ఎంపీపీఎ్‌సకు బదిలీ. ప్రొద్దుటూరులోని గవర్నమెంట్‌ హైస్కూల్లో స్కూల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఎం.వసంత, సి.క్రిష్ణవేణమ్మ అనే టీచర్లకు అదే స్కూల్లో  పరస్పర బదిలీ. 


ముద్దనూరు మండలం కొడికండ్లపల్లిలోని ఎంపీపీఎ్‌సలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న బి.ప్రసన్నకు ప్రొద్దుటూరుకు సమీపంలోని పాఠశాలకు బదిలీ. ప్రొద్దుటూరు మండలం సంజీవనగర్‌లోని ఎంపీపీఎ్‌సలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న జి.దస్తగిరి, అదే మండలం అమృతనగర్‌ ఎంపీపీఎస్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న బి.పద్మావతికి పరస్పర బదిలీ. కడప మండలం అలంఖాన్‌లోని ఎంపీపీఎ్‌సలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న జి.తిరుపాల్‌, సీకేదిన్నె మండలం రామచంద్రయ్య కాలనీ ఎంపీపీఎ్‌సలో ఎస్‌జీటీ ఎం.వెంకట శివారెడ్డికి పరస్పర బదిలీ. గుంటూరు జిల్లాలో.. శావల్యాపురం మండలం మతుకుమల్లి ఎంపీ మోడల్‌ ప్రైమరీ స్కూల్‌లో ఎల్‌ఎ్‌ఫఎల్‌హెచ్‌ఎం పి.సుబ్బలక్ష్మికి పెదకాకాని మండలం యాదవపాలెంలోని ఎంపిపిఎ్‌సకు బదిలీ. నెల్లూరు జిల్లాలో..పెళ్లకూరు మండలం రోసనూర్‌ ఎంపీపీఎ్‌సలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న జె.లక్ష్మికి ఇందుకూరుపేట మండలం పల్లిపాడు బీసీ కాలనీలోని ఎంపీపీఎ్‌సకు బదిలీ. శ్రీకాకుళం జిల్లాలో.. గార మండలం గొర్లెవానిపేటలోని మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ (డైట్‌)లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న బి.కరుణశ్రీకి శ్రీకాకుళం రూరల్‌ మండలం ఓమరవల్లి మోడల్‌ స్కూల్‌కు బదిలీ. ప్రకాశం జిల్లాలో... కొమరోలు మండలం బ్రాహ్మణపల్లి ఎంపీపీఎ్‌సలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న డి.నిర్మలకి కడప జిల్లాకు స్పెషల్‌ కేసుగా బదిలీ (అంతర్‌ జిల్లా). అనంతపురం జిల్లాలో.. ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లి జడ్పీహెచ్‌ఎ్‌సలో స్కూల్‌ అసిస్టెంట్‌గా (హిందీ) పనిచేస్తున్న ఎం.మల్లేశ్వరికి ఇదే జిల్లా  కదిరి మండలంలోని జడ్పీహెచ్‌ఎస్‌ (బాలికలు)కు  బదిలీ. 


సిఫారసు బదిలీలు రద్దు చేయాలి : యూటీఎఫ్‌

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా రాజకీయ పలుకు బడితో చేసిన అక్రమ బదిలీలను రద్దు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ సాబ్జీ, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గత మూడేళ్లుగా ఉపాధ్యాయులంతా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారని, ఈ విద్యా సంవత్సరంలో బదిలీలు చేసేందుకు ఫైళ్లు నడుస్తుండగా, రాజకీయ పలుకు బడి కల్గిన వారికి సచివాలయం నుంచి బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం సామాన్య టీచర్లకు అన్యాయం చేయడమేనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు అందరికీ న్యాయం చేయాలి తప్ప కౌన్సెలింగ్‌ నిబంధనలకు నీళ్లొదిలి కొంత మందికే ఎలా బదిలీలు చేస్తారని వారు ప్రశ్నించారు. వెంటనే కౌన్సెలింగ్‌ బదిలీలకు షెడ్యూల్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-12T08:21:53+05:30 IST