Abn logo
Jun 22 2021 @ 04:17AM

నాలుగో రోజు వరుణుడిదే

  • ఒక్క బంతీ పడకుండానే ఆట రద్దు
  • టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 

సౌతాంప్టన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌పై వరుణుడు ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. తొలి రోజు మాదిరే నాలుగో రోజైన సోమవారం ఆట కూడా పూర్తిగా రద్దయింది. రెండో రోజు రెండు సెషన్ల ఆట జరగ్గా.. మూడోరోజు ఆఖరి సెషన్‌ను ముందుగానే ముగించారు. ఇక తెల్లవారుజాము నుంచే ఇక్క డ ఏకధాటిగా వర్షం కురిసింది. అప్పుడప్పుడు కాస్త తెరిపిచ్చినా.. అంతలోనే ప్రభావం చూపడంతో పిచ్‌పై కప్పిన కవర్లపై భారీగా నీరు చేరింది. అటు అవుట్‌ ఫీల్డ్‌ పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. రెండు సెషన్ల పాటు ఎదురుచూసినప్పటికీ ఎలాంటి మార్పూ కనిపించలేదు. మరోవైపు ఈ విరామంలో చేసేదేమీ లేక ఇరు జట్ల ఆటగాళ్లు టైమ్‌పాస్‌ చేస్తూ కనిపించారు.

కివీస్‌ పేసర్‌ జేమిసన్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఆడగా.. ఇతర క్రికెటర్లు మొబైల్‌ ఫోన్లతో సమయం గడిపారు. మైదానాన్ని పరీక్షించిన అంపైర్లు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐదో రోజు ఆటకు వాతావరణం అనుకూలించే అవకాశం ఉండడం ఊరటనిచ్చే విషయం. ఇప్పటికే రెండు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో బుధవారం రిజర్వ్‌ డేలోనూ మ్యాచ్‌ జరుగుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్లకు 101 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్‌ (12 బ్యాటింగ్‌), టేలర్‌ (0 బ్యాటింగ్‌) ఉన్నారు. అంతకుముందు భారత్‌ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.