అమరావతి కల మూడు ముక్కలు!

ABN , First Publish Date - 2020-10-22T08:30:22+05:30 IST

సరిగ్గా ఐదేళ్ల క్రితం... అంటే 2015 అక్టోబరు 22వ తేదీ! విజయదశమి పర్వదినం! అదే రోజున సీమాంధ్రుల కలల రాజధాని ‘అమరావతి’కి శంకుస్థాపన జరిగింది. లక్షలాది మంది ప్రజలు, ఎందరో అతిథుల సమక్షంలో..

అమరావతి కల మూడు ముక్కలు!

అమరావతి శంకుస్థాపనకు నేటితో ఐదేళ్లు

కళకళలాడాల్సిన నేల నేడు వెలవెల

శంకుస్థాపన తర్వాత మూడున్నరేళ్లు పనుల పరుగు

ఏడాదిన్నరగా స్తబ్ధత

పనులు కొనసాగించి ఉంటే ఈపాటికి అమరావతి కొలిక్కి


మరణ శాసనం

2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. గత ఏడాది మే 30వ తేదీన నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతికి అప్పుడే తొలి అడ్డుకట్ట పడింది. రివర్స్‌ టెండరింగుల పేరిట మొదట పనులు ఆపివేశారు. తర్వాత... ముంపు ప్రాంతమని, ఖర్చు ఎక్కువని, ఒకే వర్గానికి చెందినదని అమరావతిపై వ్యూహాత్మక ప్రచారం మొదలుపెట్టారు. చివరికి... గత ఏడాది డిసెంబరు 17న ఉన్నట్టుండి మూడు రాజధానుల ప్రకటన చేసి, అమరావతిని అటకెక్కించారు.


(అమరావతి/గుంటూరు - ఆంధ్రజ్యోతి)

సరిగ్గా ఐదేళ్ల క్రితం... అంటే 2015 అక్టోబరు 22వ తేదీ! విజయదశమి పర్వదినం! అదే రోజున సీమాంధ్రుల కలల రాజధాని ‘అమరావతి’కి శంకుస్థాపన జరిగింది. లక్షలాది మంది ప్రజలు, ఎందరో అతిథుల సమక్షంలో... ప్రధాని నరేంద్ర మోదీ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఒక మహానగర నిర్మాణానికి బీజం పడింది. ‘నభూతో’ అన్నట్లుగా సుమారు 34,000 ఎకరాల భూమిని సమీకరించి... అందులో నవ నగరాలను నిర్మించి, తెలుగు కేతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేయాలనుకున్న సంకల్పం సుదృఢంగా సాగింది. పవిత్ర నదీ జలాలు, పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన మట్టితో అమరావతి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు మూడున్నరేళ్లపాటు... అంటే, తెలుగుదేశం అధికారంలో ఉన్నంతకాలం ఒక యజ్ఞంలా పనులు సాగాయి. చూస్తుండగానే ఆకాశ హర్మ్యాలు వెలిశాయి.


విశాలమైన రహదారులకు ‘మార్గాలు’ తెరుచుకున్నాయి. టీడీపీ ప్రభుత్వం రూ.35,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు టెండర్లను ఖరారు చేసింది. అప్పటికి అమరావతిలో పూర్తయిన పనుల విలువ రూ.10,000 కోట్లు. వీటిలో అనేక ప్రాజెక్టుల పనులు 45 నుంచి 80 శాతం వరకు పూర్తయ్యాయి. అంతలో... 2019 ఎన్నికలు వచ్చాయి. మే 30వ తేదీన జగన్‌ ప్రభుత్వం కొలువు తీరింది. అమరావతి ‘కల’ భగ్నమైంది. రాజధాని నగర నిర్మాణ ప్రణాళిక ‘మూడు’ ముక్కలైపోయింది. గత ప్రభుత్వ సంకల్పాన్నే ఈ సర్కారూ కొనసాగించి ఉంటే... అమరావతిని అదే వేగంతో నిర్మించి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేది?


ఇప్పటికి ఇలా కళకళలాడేది... 

సుమారు రూ.48,000 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన అమరావతి తొలి దశలో భాగమైన నిర్మాణాల్లో అనేకం పూర్తయ్యేవి. ఐదింట మూడొంతుల అమరావతి ఇప్పుడు కళ్ల ముందు కనిపించేది. 

నవ నగరాల్లో ఒకటైన ‘ప్రభుత్వ నగరం’లో ఉద్యోగుల నివాస సముదాయాలన్నీ పూర్తయి, అవన్నీ కుటుంబాలతో కళకళలాడుతూ ఉండేవి.

న్యాయమూర్తులు, ప్రభుత్వ కార్యదర్శులు, మంత్రుల కోసం మొదలుపెట్టిన 225 బంగళాలు... ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలు (అపార్ట్‌మెంట్లు) గత ఏడాదే నిర్మాణం పూర్తి చేసుకుని ఉండేవి.

అమరావతిలో తమ స్థానం కోసం పోటీపడి, స్థలాలు సొంతం చేసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేవి.

ప్రవాసాంధ్రులు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏపీఎన్నార్టీ టవర్స్‌ పూర్తయ్యేది.

50 అంతస్థులతో సెక్రటేరియట్‌-జీఏడీ టవర్ల నిర్మాణం కొలిక్కి వచ్చేది.

రాజధానిని చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారితో అనుసంధానించే సీడ్‌ యాక్సెస్‌ రహదారికి, కొన్ని ఇతర రహదారులకు ఉన్న అవరోధాలు తొలగి, అమరావతికి అద్భుతమైన అనుసంధానత అందుబాటులోకి వచ్చేది.

విజయవాడ శివారులో ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిపై... హైదరాబాద్‌ వైపు నుంచి రాజధానికి అనుసంధానం చేసే ఐకానిక్‌ వంతెన పనులు 40 శాతం పూర్తయ్యేవి. 

రైతుల రిటర్నబుల్‌ ప్లాట్లున్న ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి ఒక కొలిక్కి వచ్చి, వాటిలోనూ నిర్మాణాలు, ప్రైవేటు వ్యాపార లావాదేవీలు ఊపందుకునేవి.

తిరుమల తిరుపతి దేవస్థానం రూ.160 కోట్లతో మొదలుపెట్టిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ఇప్పటికి ఒక రూపం వచ్చేది. 

అమృత, ఎన్‌ఐడీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి ఎన్నెన్నో సుప్రసిద్ధ విద్యాసంస్థలు తమ ప్రాంగణాలు ప్రారంభించి, విద్యార్థులతో అమరావతి కళకళలాడుతూ ఉండేది.

శాఖమూరు వద్ద 25 ఎకరాల్లో నిర్మించదలచిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్మృతివనం, నీరుకొండపై అభివృద్ధి పరచదలచిన ఎన్టీఆర్‌ స్మారకంతోపాటు కృష్ణా నది లంకల్లో ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయదలచిన గోల్ఫ్‌ కోర్సులు, ఉద్యానవనాలు, థీమ్‌ పార్క్‌లు, రిసార్ట్‌లు వంటి ప్రాజెక్టుల్లో కొన్నయినా ఇప్పటికి ప్రారంభమయ్యేవి. 


ఉద్వేగం... ఉత్సాహం!

నాడు కార్యక్రమం జరిగిందిలా..


‘విభజనతో నష్టపోయామనే భావన నుంచి బయటపడాలి. కష్టపడి అభివృద్ధి చెందాలి’ అనే సంకల్పానికి అమరావతి శంకుస్థాపనతో బీజం పడింది. 2015 అక్టోబరు 22వ తేదీన ఉద్ధండ్రాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగింది. ఒక నవ నగర నిర్మాణం, అందునా సీమాంధ్ర రాజధానికి నాంది కావడంతో అప్పుడంతా ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది ప్రముఖుల రాకకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. అప్పటికప్పుడు భారీ హెలిప్యాడ్‌లు, ప్రజల రాకపోకలకు వీలుగా తాత్కాలిక రహదారులు  నిర్మించారు. అమరావతి త్రీడీ గ్యాలరీని ఏర్పాటు చేశారు. అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, కొందరు సినీ నటులు హాజరయ్యారు. ప్రముఖ సంగీతకారుడు శివమణి తన వాయిద్యాలతో అలరించారు. శంకుస్థాపన కార్యక్రమం రోజున ఉద్ధండ్రాయునిపాలెంతో పాటు మందడం, లింగాయపాలెం, రాయపూడి తదితర గ్రామాల్లో ప్రతీ ఇంట్లో పొంగలి, పులిహోర తదితర ప్రసాదాలు తయారు చేసి... శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు పంపిణీ చేశారు.


ప్రధాని మోదీ పార్లమెంటు ఆవరణ నుంచి మట్టి, యమునా నది నీటిని తీసుకొచ్చి చంద్రబాబు చేతికి అందించారు. ఆ క్షణాన అంతా ఉద్వేగానికి లోనయ్యారు. ఆ మట్టి ద్వారా పార్లమెంటు అమరావతికి అండగా ఉంటుందన్న భరోసా కల్పిస్తున్నానని ప్రధాని చేసిన వ్యాఖ్యలు నేటికీ రాజధాని గ్రామాల ప్రజల చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వ్యాఖ్యలు, విమర్శలను మరిచిపోయిన సీమాంధ్రులు... కేసీఆర్‌ వేదికపైకి చేరుకొని అభివాదం చేయగానే కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. ‘‘నమో నమో నమో జగతి ఆంధ్రప్రదేశ్‌ నమహాః... జయతు జయతు ధరణికోట అమరావతి నమహాః’’ అంటూ సాగిన అమరావతి అధికారిక గీతం ఒక మధురస్వరమైంది. ఈ పాట చిత్రీకరణలో చూపించిన వనరులు, చారిత్రక ఘనత విభజన గాయంతో ఉన్న సీమాంధ్రుల్లో ఉత్సాహాన్ని నింపాయి. రాజధానిని అనతికాలంలోనే నిర్మించుకొని సగర్వంగా తలెత్తుకుని నిలవాలన్న కసి, పట్టుదల కనిపించాయి. శంకుస్థాపన జరిగిన కొద్దిరోజుల్లోనే మధ్యంతర ప్రభుత్వ సముదాయం  నిర్మితమైంది. అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణంతో ప్రభుత్వ పాలన సొంత గడ్డమీదకు వచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచినా, గెలవకపోయినా... ఎవరు అధికారంలోకి వచ్చినా, అమరావతిని ‘రివర్స్‌’ చేయలేని దశకు చేరుకుందని అంతా భావించారు. కానీ... జగన్‌ అనూహ్యంగా అమరావతికి మరణ శాసనం లిఖించారు!


నాడు మోదీ అన్న మాట...

‘‘ఇక్కడకు వస్తూ నాతోపాటు పార్లమెంట్‌ ప్రాంగణంలో మట్టిని... యమునా నది జలాలను తీసుకొచ్చాను.  ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామనేందుకే ఇవి తీసుకొచ్చాను. అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌  వేసే ప్రతి అడుగులో కేంద్రం ఉంటుంది.  సీమాంధ్ర ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తున్నాను! విభజన చట్టంలో పేర్కొన్న ప్రతీ అంశాన్ని మేం తు.చ. తప్పకుండా అమలు చేస్తాం. మోదీ - బాబు జోడికి అద్భుతాలు చేసే శక్తి ఉంది. మాపై నమ్మకం ఉంచండి. మీ కళ్లలోని ఆశలను వంద శాతం సంపూర్ణంగా నెరవేరుస్తాం.’’


చంద్రబాబు నోట...

‘‘కేంద్ర ప్రభుత్వం సహకరించి ఆదుకుంటే ఆదాయాన్ని పెంచి దేశాభివృద్ధికీ తోడ్పాటునందిస్తాం. ఢిల్లీకంటే మెరుగైన రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నిలబెట్టుకోవాలి. తెలంగాణకు హైదరాబాద్‌, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు నగరాలు ఉన్నాయి. మాకు ఆదాయాన్ని సమకూర్చే నగరమేదీ లేదు. అమరావతికి ప్రజల మద్దతుతోపాటు దేవుళ్లందరి ఆశీస్సులు ఉన్నాయి. అనేక పవిత్ర స్థలాల నుంచి తెచ్చిన మట్టి - నీరు వెదజల్లడంతో ఈ ప్రాంతం శక్తిమంతమైంది. వాస్తుబలానికి తోడు ఉత్తమ ముహూర్తం - లగ్నం అన్నీ సానుకూలంగా ఉన్నాయి.’’


మహా నిర్మాణ యజ్ఞం...

శంకుస్థాపన తర్వాత అమరావతి పనులు ఊపందుకున్నాయి. దేశ విదేశాలకు చెందిన కాంట్రాక్టు సంస్థలు రంగంలోకి దిగాయి. వేలాది మంది కార్మికులు స్వేదం చిందించారు. వందల సంఖ్యలో ఇంజనీర్లు పనులను పర్యవేక్షించారు. అతి భారీ క్రేన్లు, పొక్లైన్లు, రోడ్‌ రోలర్లు, వందలకొద్దీ టిప్పర్ల రాకపోకలు.... అప్పుడు అక్కడంతా పనుల సందడి. ఈ నిర్మాణ మహాయజ్ఞం రేయింబవళ్లు కొనసాగింది. దీని ఫలితంగానే అనేక కట్టడాలు శరవేగంగా రూపుదిద్దుకున్నాయి. 


మంగళాశాసనం

రాజధాని లేకుండా విడిపోయిన సీమాంధ్రకు ఒక మహానగరం ఉండాలని... అది సరికొత్త సొగసులతో, అంతర్జాతీయ స్థాయి హంగులతో, దేశానికే తలమానికంగా నిలవాలని తలపోశారు. చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ‘అమరావతి’ పేరిట కొత్త నగర నిర్మాణానికి 2015 అక్టోబరు 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి... శాస్త్రోక్తంగా జరిగిన పూజల్లో పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-22T08:30:22+05:30 IST