ఆదివాసీకి అడవి మిగిలేది రాజ్యాధికారంతోనే!

ABN , First Publish Date - 2022-07-27T06:16:33+05:30 IST

ఇటీవల మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట గ్రామ పరిధిలోని కోయపోషగూడలో ఆదివాసులపై పోలీసులు వందలాదిగా దాడి చేసిన దృశ్యాలు, బాధితుల రోదనలు, ఆవేదనలు మీడియాలో రికార్డు అయ్యాయి....

ఆదివాసీకి అడవి మిగిలేది రాజ్యాధికారంతోనే!

ఇటీవల మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట గ్రామ పరిధిలోని కోయపోషగూడలో ఆదివాసులపై పోలీసులు వందలాదిగా దాడి చేసిన దృశ్యాలు, బాధితుల రోదనలు, ఆవేదనలు మీడియాలో రికార్డు అయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసుల పట్ల ఘోరంగా, నీచంగా, అమానవీయంగా ప్రవర్తించింది. మహిళలను బట్టలు ఊడిపోయే విధంగా కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లడం, గుడిసెలు పీకేయడం, ఆస్తుల ధ్వంసం, మొదలైనవి గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, తూర్పు కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలలో ఆదివాసీ పోడు సాగుదారులపై ప్రతిరోజు దాడులు, అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం సర్వసాధారణమైపోయింది. అడవి ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవడానికి వీల్లేకుండా గూడేల చుట్టూ కందకాలు తవ్వుతున్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుంటున్నారు. పంటచేలను దున్ని ధ్వంసం చేస్తున్నారు. గ్రామాలు, గూడేలు, గుడిసెలు అని తేడా లేకుండా కూల్చి కాల్చి వేస్తున్నారు. ఫారెస్టు, పోలీసు విభాగాలు సృష్టిస్తున్న ఈ విధ్వంసం అడవిపైన, ఆదివాసులపైన విదేశీ బలగాల దాడిని గుర్తుకు తెస్తుంది. ఇక్కడ రాజ్యాంగం, చట్టాలు, మానవ హక్కులు అన్ని ఖాకీ బూట్ల కింద లేత మొక్కల వలె నలిగిపోతున్నాయి.


ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు సాగుదార్లకు పట్టాలిస్తానని జూలై 10, 2019న అసెంబ్లీలో ప్రకటించారు. 3.5 లక్షల దరఖాస్తులు స్వీకరించినా నేటికీ ఎవరికి ఒక్క హక్కు పత్రం ఇవ్వలేదు. ఈ దరఖాస్తుల ప్రకారం 13 లక్షల ఎకరాలకు పైగా భూములకు పట్టాలివ్వాలి. కానీ మూడు ఎకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్లవలె ఈ వాగ్దానం కూడా గోదావరిలో కలిసిపోయింది. 2005 డిసెంబర్‌ 13 వరకు అటవీ భూములు సాగుచేసుకుంటున్న ఆదివాసులకు, 1930 నాటికి సాగులోనున్న ఆదివాసీయేతరులకు మాత్రమే భూమి హక్కు పట్టాలు ఇవ్వాలని చట్టం చెప్పింది. అయినప్పటికీ పట్టాలివ్వడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది?


ద్రౌపది ముర్ము అనే ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా కూర్చోబెట్టుకున్న సందర్భం ఇది. కానీ, ఆమె సమూహానికే చెందిన మహిళల వస్త్రాపహరణం జరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న అటవీ హక్కుల చట్టం 2006 (ఎఫ్‌.ఆర్‌.ఎ.)కు జూన్‌ 28, 2022న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ద్వారా ఎలాంటి చర్చా లేకుండా, ఆదివాసుల అంగీకారంతో సంబంధం లేకుండా, పెసా–2013 భూసేకరణ చట్టంతో సంబంధం లేకుండా అటవీ భూముల్ని వివిధ ప్రాజెక్టులకు అప్పచెప్పే ప్రక్రియకు కొత్త నిబంధనలను చేర్చి అటవీ హక్కుల చట్టాన్ని రద్దుచేసే కుట్ర ఎందుకు చేస్తున్నారు. ఇదంతా సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో, ద్రౌపదిని చూపించి, ప్రైవేటు శక్తుల కోసం ఆదివాసీ హక్కులను కాలరాయడానికే కాదా? ప్రైవేటీకరణ పథకాలను మరింత తీవ్రం చేసి అడవిని అమ్మివేయడానికే కాదా? కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి అభివృద్ధి పేరుతో చేపట్టే పథకాల అమలు సందర్భంగా తమ ఇష్టానుసారంగా పనులు చేపట్టేందుకు ఆదివాసుల అనుమతి లేకుండా భూముల కేటాయింపు, అడవి నరికివేతకు అనుమతినిచ్చింది కేంద్ర ప్రభుత్వం. నష్ట పరిహారం చెల్లించే విధానం ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా మార్చింది. పాత నిబంధనావళి ప్రకారం మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్న అక్కడ నివసిస్తున్న ఆదివాసుల అంగీకారం తప్పనిసరి. అటవీ భూములను ప్రభుత్వాలు ఏకపక్షంగా ఏ అవసరం పేరుతోనైనా వాడుకోగూడదు. ఈ నిబంధనలను ఎత్తివేసి అడవులను గుండుగుత్తగా కార్పొరేట్‌శక్తులకు ధారాదత్తం చేయడమే ప్రభుత్వం ఉద్దేశం.


సొంత ఆస్తి ప్రాతిపదికపై ఏర్పడ్డ ‘నాగరిక’ రాజ్యాలన్నీ అడవిపైనా, ఆదివాసులపైనా దండయాత్ర చేసినవే, చేస్తున్నవే. వీటికి ఆదివాసుల ప్రతిస్పందనే తిరుగుబాట్లు. అటవీ ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకోవడానికి బ్రిటిష్‌ – నిజాంల కాలంలో ఎన్నో కుట్రల అనంతరం తొలిసారి 1865 సంవత్సరంలో భారత అటవీ హక్కుల చట్టం రూపొందింది. ఈ చట్టాన్ని అమలు చేయడానికి 1868లో అటవీశాఖ ఏర్పడ్డది. ఆ తర్వాత ఎన్నో దిద్దుబాటులతో, చేర్పులతో చట్టాలు వచ్చాయి. ఇన్ని చట్టాలున్న తర్వాత కూడా డ్యాములు, గనులు, రహదారులు, పరిశ్రమలు, విమానాశ్రయాలు, గ్యాస్‌ బావులు, పైపులైన్లు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, అభయారణ్యాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, రక్షిత అడవులు, ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ కేంద్రాలు, ప్లాంటేషన్లు మొదలగునవి వాటికి ఎన్నో అనుమతులిచ్చారు. అభివృద్ధి ముసుగులో అడవిని ధ్వంసం చేసి, ఆదివాసులను తరిమివేసి, వనరులను విచ్చలవిడిగా లూటీ చేసే సామ్రాజ్యవాద అనుకూల నమూనాలను అమలు జరిపారు. ఫలితంగా ప్రకృతి, అడవి, ఆదివాసుల జీవితాలు దిగజారాయి. వివిధ పాలక ముఠాల ఆధ్వర్యంలో నెలకొంటున్న దోపిడీ ప్రభుత్వాలన్నీ అడవిని చెరబట్టినవే. ఈ వరుసలో పోడు భూముల సాగుదారులకు పట్టాలివ్వకపోవడం, పట్టాదారులను సైతం వారి మాతృభూమి నుంచి తరిమివేయడం జరుగుతోంది. రెవెన్యూ, పోలీసు, అటవీశాఖలను బలోపేతం చేసుకున్న కేసీఆర్‌ పోడు భూములకు పట్టాలివ్వకుండా ఈ యంత్రాంగాన్ని ఉసిగొల్పడం ఈ కుట్రలో భాగమే. కేసీఆర్‌ ఒక సందర్భంలో అడవి ఆదివాసులది కాదు అని ప్రకటించిండు. మోదీ అటవీ హక్కుల చట్టానికి (2006) కొత్త నిబంధనలు చేర్చడం కూడా ఇందులో భాగమే.


నేడు అడవి ప్రాంతాలలో ఆదివాసీలు మైనారిటీ అయ్యారు. అడవికి ఆదివాసీ పరాయివాడయ్యాడు, దురాక్రమణదారుడై పోయాడు. మైదాన ప్రాంతం నుంచి వచ్చి అడవిలో స్థిరపడిన వలస భూస్వాముల వద్ద కూలీలుగా, పాలేర్లుగా, జీతగాళ్ళుగా మార్చబడ్డారు. ఇందుకోసం వలసాధిపత్యాన్ని ఆమోదించే బానిస మనస్తత్వాన్ని, దాని బ్రాహ్మణీయ భావజాలాన్ని ఈనాటి పాలకులు విస్తృతంగా బోధిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆదివాసులు మరింత చైతన్యవంతంగా సంఘటితం కావాలి. వందల సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలన్నీ నిర్వీర్యమై ఉన్నవాడికి అనుకూలంగా మారిపోయాయి. కావున వీటిపై ఉన్న భ్రమలను వదులుకోవాలి. సమస్త అటవీసంపదపై సర్వాధికారాలు ఆదివాసీల చేతిలో రాజ్యాధికారం ఉన్నప్పుడే సాధ్యమౌతుందని గ్రహించాలి.

ఆనంద్‌

Updated Date - 2022-07-27T06:16:33+05:30 IST