Abn logo
Nov 18 2020 @ 00:00AM

ధీశాలికి అందలం!

హఠాత్తుగా కుటుంబ బాధ్యతలు మీద పడినా, ఓటములు ఎదురైనా నిబ్బరం కోల్పోని మహిళ రేణు దేవి. సంచలనాలకు నెలవైన బీహార్‌ రాజకీయాల్లో ఆమె కథ ముగిసిందనుకున్న పరిశీలకుల అంచనాలను వమ్ము చేసి... రెట్టింపు శక్తితో తన ఉనికిని ఆమె బలంగా చాటుకున్నారు. ఇప్పుడు బీహార్‌ తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యతలతో తనదైన ముద్ర వేస్తానంటున్నారు.


బీహార్‌లో ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరిని నియమించే అవకాశం ఉందని బీజేపీ ప్రకటించినప్పుడు చాలా పేర్లు చర్చల్లోకి వచ్చాయి. అయితే అనూహ్యంగా రేణు దేవి పేరు తెరమీదికి వచ్చింది. రాష్ట్రానికి తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా తన పేరు ప్రతిపాదనలో ఉందనే విషయాన్ని రేణు దేవి మొదట్లో కొట్టి పారేశారు. ‘‘టీవీల్లో చూశాకే ఆ సంగతి తెలిసింది. కొంతమంది నాకు అభినందనలు తెలిపారు కూడా. కానీ పార్టీ నుంచి సమాచారం రాకుండా ఇవన్నీ ఎలా నమ్ముతాను? పార్టీ ఏది చెయ్యమంటే అది చేస్తాను’’ అని స్పష్టం చేశారు. అయితే జాతీయ స్థాయిలో ఆమె ఎంపిక అప్పటికే ఖరారైపోయింది. హిందీ, ఇంగ్లీష్‌, భోజ్‌పురి, బంగ్లా భాషల్లో ప్రావీణ్యం ఉన్న రేణుకు ప్రత్యక్ష రాజకీయాల్లో విజయాలతో పాటు సంస్థాగత పదవులు నిర్వహించిన అనుభవం సైతం ఉంది. 


రేణు దేవి సొంత ఊరు బీహార్‌లోని బేతియా. ఆమె ఆ రాష్ట్రంలో అత్యంత వెనుక బడిన కులాల్లో (ఇబిసి) ఒకటైన నోనియా సామాజిక వర్గానికి చెందినవారు. రేణు తండ్రి కృష్ణప్రసాద్‌ రాష్ట్ర సాగునీటి శాఖలో జూనియర్‌ ఇంజనీర్‌గా పని చేసేవారు. ఆమె తల్లి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్త.  తల్లి ప్రభావం తన మీద ఎంతో ఉందని రేణు చెబుతారు. కోల్‌కతాకు చెందిన బీమా సంస్థ ఉద్యోగి దుర్గాప్రసాద్‌తో వివాహమయింది. భర్తతో పాటు కోల్‌కతాకు వెళ్ళారు. ఏడేళ్ళ తరువాత దుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో హఠాత్తుగా మరణించారు. అప్పటికి వారికి ఇద్దరు పిల్లలు. వారిని తీసుకొని తల్లి సొంత ఊరైన బేతియాకు తిరిగి వచ్చారు. భర్త కంపెనీ వారిని బతిమాలుకొని బీమా ఏజెంట్‌గా చేరారు. ‘‘అది నాకు నిజంగా పరీక్షా సమయం. నా జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. పెళ్ళయిన ఏడేళ్ళ లోపునే నా భర్త మరణించారు. ఆ సమయంలో నా కుటుంబం ఎంతో అండగా నిలబడింది. నేను కుంగిపోకుండా ధైర్యాన్నీ, సంకల్పబలాన్నీ, అంకితభావాన్నీ భగవంతుడు ఇచ్చాడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధీశాలిగా నన్ను ఇవే తీర్చిదిద్దాయి’’ అంటారు రేణుదేవి. 

తల్లి ప్రోత్సాహంతో విశ్వహిందూ పరిషత్‌ మహిళా విభాగమైన దుర్గా వాహినిలో సభ్యురాలైన రేణుదేవి చంపారన్‌, ఉత్తర బీహార్‌ ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల మహిళల కోసం పోరాటాలు చేశారు. ఈ పోరాట పటిమ మహిళల్లో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. బీజేపీలో చేరి మహిళా మోర్చాలో రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో కీలకమైన పదవులు చేపట్టారు. 1990లో బీజేపీ అగ్రనేత ఎల్‌.కె.అద్వానీ రథయాత్ర చేపట్టినప్పుడు, సమస్థిపూర్‌ దగ్గర లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అరెస్ట్‌ చేయించారు. అప్పుడు జరిగిన ఆందోళనల్లో  అరెస్టయిన రేణు దేవి పార్టీ అగ్రనేతల దృష్టిలో పడ్డారు. 1995 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నౌతాన్‌ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ‘‘ఆ ఓటమి నన్ను ఎంతో బాధించింది. కానీ నిరాశ చెందలేదు. ప్రజలకు దగ్గరగా ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగాను’’ అంటారామె. అలా ప్రజలతో మమేకయ్యే తత్త్వమే ఆమెకు ఆదరణ సంపాదించిపెట్టింది. వరుసగా నాలుగుసార్లు బేతియా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. నితీశ్‌ కుమార్‌ క్యాబినెట్‌లో మంత్రిగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా పని చేశారు. 2015 ఎన్నికల్లో అనూహ్యమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దాంతో ఆమె రాజకీయ జీవితం ముగిసిపోయిందని పరిశీలకులు అంచనా వేశారు. కానీ ఆమె ధైర్యం, సంకల్పబలం తాజా ఎన్నికల్లో ఆమెను విజేతను చేశాయి. ఉప ముఖ్యమంత్రి పీఠానికి బాటలు వేశాయి. ‘‘నేనెప్పుడూ ఎదురుచూడని అవకాశం ఇది. ఉపముఖ్యమంత్రి బాధ్యత చాలా పెద్దది. పార్టీ నమ్మకాన్ని నిలబెట్టడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం... ఇప్పుడు నా దృష్టంతా వీటిపైనే!’’ అంటున్నారు రేణు దేవి.

ప్రత్యేకం మరిన్ని...