బోర్డుల పరిధిపై కేంద్ర నిర్ణయమే ఫైనల్‌!

ABN , First Publish Date - 2021-08-04T08:36:38+05:30 IST

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ప్రకటిస్తూ కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌ అని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ)ల సభ్య కార్యదర్శులు స్పష్టం

బోర్డుల పరిధిపై కేంద్ర నిర్ణయమే ఫైనల్‌!

అక్టోబరు 14 నుంచి కార్యాచరణ.. హైదరాబాద్‌లో సమన్వయ కమిటీ భేటీ

ప్రాజెక్టులు, డీపీఆర్‌లు, సిబ్బంది, స్థిర, చరాస్తుల వివరాలివ్వాలని స్పష్టీకరణ

రాష్ట్రం నుంచి ఈఎన్‌సీ, జెన్‌కో ఎండీ హాజరు.. తెలంగాణ అధికారులు గైర్హాజరు

షెకావత్‌తో సీఎం జగన్‌ మాట్లాడాకే బోర్డుల పరిధిపై అభ్యంతరాలు

ముందుగా కేంద్రానికే చెబుతాం.. తర్వాత బోర్డులకు సమర్పిస్తాం

మీపై గౌరవంతోనే వచ్చాం.. రాష్ట్ర అధికారుల వెల్లడి.. రేపు ‘సీమ’కు కృష్ణా బోర్డు

బృందంలో తెలంగాణ ప్రతినిధులు ఉండకూడదని రాష్ట్రం సూచన


అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ప్రకటిస్తూ కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌ అని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ)ల సభ్య కార్యదర్శులు స్పష్టం చేశారు. గత నెల 15వ తేదీన గెజిట్‌ను ప్రకటిస్తూనే.. అక్టోబరు 14వ తేదీ నుంచి కార్యాచరణ అమలు చేస్తామని వెల్లడించిందని గుర్తుచేశారు. గెజిట్‌లో పేర్కొన్న విధంగా రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు, ఇతర కట్టడాలను సంబంధిత బోర్డులకు స్వాధీనపరచాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రాజెక్టుల డీపీఆర్‌లతో పాటు ఇతరత్రా  సమాచారం అందించాలని సూచించారు. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌ జలసౌధలో జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శులు, కేంద్ర జలశక్తి శాఖ ప్రతినిధుల సమక్షంలో బోర్డుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర జల వనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్‌కో ఎండీ శ్రీధర్‌ హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఎవరూ రాలేదు.


ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల మేరకు నియమితులైన సిబ్బందిని.. స్థిర చరాస్తులను అప్పగించాలని సభ్య కార్యదర్శులు ఈ సందర్భంగా కోరారు. అదేవిధంగా ఒక్కో బోర్డు నిర్వహణకు తలో రూ.200 కోట్ల వంతున రెండు రాష్ట్రాలూ రూ.400 కోట్ల చొప్పున (మొత్తం 800 కోట్లు) చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. బోర్డుల   అభిప్రాయాలను చెప్పాక.. రాష్ట్రాల వైఖరిని వారు తెలుసుకోగోరారు. బోర్డుల పరిధిపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని మన రాష్ట్ర అధికారులు చెప్పారు. అవేంటో ఈ వేదికపై  చెప్పబోమన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడాక.. ముందుగా కేంద్రానికి అభ్యంతరాలను తెలియజేస్తారని.. ఆ తర్వాతే వాటిని బోర్డులకు సమర్పిస్తామని చెప్పారు. తక్షణమే ప్రాజెక్టులను స్వాధీనం చేయాలని.. నోటిఫై చేసిన పోస్టుల్లో నియమితులైన సిబ్బంది జాబితా ఇవ్వాలని.. స్థిర, చరాస్తులు సమర్పించాలని బోర్డులు కోరాయని.. అయితే ఆ వివరాలను ఇప్పటికిప్పుడు సమర్పించలేమని స్పష్టం చేశారు. తొలి సమన్వయ కమిటీ సమావేశానికి రావాలని కోరడంతో.. బోర్డుల మర్యాదను కాపాడేందుకు.. చిత్తశుద్ధి కలిగిన వారిగా హాజరయ్యామని తెలిపారు. దరిమిలా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సభ్య కార్యదర్శులు ప్రకటించారు. 


బోర్డులకు నిధుల విడుదలకు ప్రతిపాదన

గోదావరి, కృష్ణా బోర్డుల నిర్వహణ కోసం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖకు జల వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. బోర్డులను తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌ స్వాగతిస్తున్న సంగతి తెలిసిందే.


రేపు సీమ ఎత్తిపోతల పరిశీలన

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) బృందం గురువారం అక్కడ పర్యటించనుంది. ఎత్తిపోతల వద్ద పనులు జరుగుతున్నదీ లేనిదీ తనిఖీచేసి నివేదికివ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) బోర్డును ఆదేశించిన సంగతి తెలిసిందే. తొలుత తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న పథకాలను  చూసి రావాలని ఆంధ్రప్రదేశ్‌ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌జీటీ ఆదేశాల మేరకు పర్యటించి నివేదికను సమర్పించాలని కేఆర్‌ఎంబీ నిర్ణయించింది. అయితే బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని ఏపీ అభ్యంతరం చెప్పింది. అయినా ఐదో తేదీన కేఆర్‌ఎంబీ పర్యటించనున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే బోర్డు బృందంతో పాటు తెలంగాణకు చెందిన న్యాయవాదులు గానీ, ఇతర ప్రతినిధులు గానీ రావడానికి వీల్లేదని రాష్ట్రప్రభుత్వం సూచించింది. 

Updated Date - 2021-08-04T08:36:38+05:30 IST