ప్రాంతీయ పార్టీలపై తుది సమరం

ABN , First Publish Date - 2022-01-04T05:57:41+05:30 IST

‘అభివృద్ది, సంపదను పెంచే లక్ష్య సాధనలో మనం ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. మన స్వాతంత్ర్య సమరయోధుల స్వప్నాల్ని సాకారం చేయాలి’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు...

ప్రాంతీయ పార్టీలపై తుది సమరం

‘అభివృద్ది, సంపదను పెంచే లక్ష్య సాధనలో మనం ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. మన స్వాతంత్ర్య సమరయోధుల స్వప్నాల్ని సాకారం చేయాలి’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. కొత్త సంవత్సరం తొలి రోజు ప్రజలకు ఆయన ఇచ్చిన సందేశమది. ప్రతి ఏడాది మాదిరే 2022 తొలి రోజు కూడా ఆయన ప్రజాసంక్షేమ కార్యకలాపాలలోనే తలమునకలై గడిపారు. ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ నుంచి 10 కోట్ల రైతు కుటుంబాలకు మోదీ రూ. 20వేల కోట్లు విడుదల చేశారు. అంతేకాక ఆయన ‘రైతుల ఉత్పాదక సంస్థ’ (ఎఫ్‌పిఓ)లకు రూ. 14 కోట్ల గ్రాంట్ విడుదల చేశారు. దీని వల్ల లక్షా 24వేల మంది రైతులు లబ్ధి పొందారు. ఇప్పటివరకూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి లక్షా 80 వేలకోట్లు బదిలీ కావడం సాధారణ విషయం కాదు.


మోదీ, ఆయన టీమ్ ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా పనిచేయడం వల్లే ప్రధానమంత్రి లక్ష్యాలను అనుకున్న గడువు కంటే ముందుగా నెరవేర్చగలుగుతున్నారు. ‘ఉన్నతంగా ఆలోచించండి, సమున్నతమైన కలలు కనండి, దేశాన్ని ఉజ్వలంగా మార్చేందుకు అంకితమవ్వండి’ అని 2021లో తన చివరి ‘మన్ కీ బాత్’ సందేశంలో మోదీ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ తన ‘2019 సార్వత్రక ఎన్నికల ప్రణాళిక’లో ఉగ్రవాదం నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, నల్లధనం వెలికితీత మొదలైన హమీలను ఇచ్చింది. గత రెండున్నరేళ్ళ పాలనలో మోదీ ఆ వాగ్దానాలను నెరవేర్చడమే కాకుండా ఇంకా ఎన్నో బృహత్తర విజయాలను సాధించారు. 2019 ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగానే రాజ్యాంగపరిధిలోనే రామజన్మభూమి వివాదం పరిష్కారమయి భవ్యమైన మందిర నిర్మాణం జరుగుతోంది. దీనికి తోడుగా కాశీ విశ్వనాథ మందిర ప్రాంగణం విశాలంగా, అధునాతనంగా రూపుదిద్దుకుంది. 2017లో విడుదల చేసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికను కూడా అద్భుతంగా అమలుచేసిన ఘనత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి దక్కుతుంది.


ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా పనిచేస్తున్న బీజేపీకి 2022లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఘన విజయం లభిస్తుందడనంలో సందేహం లేదు. ‘వికాస్ కావాలా, వారసత్వం కావాలా’ అన్న నినాదంతో జనం ముందుకు వెళ్లినందువల్లే నరేంద్రమోదీ గుజరాత్‌లో బీజేపీని వరుసగా గత ఎన్నికల్లో నాలుగోసారి గెలిపించారు. వచ్చే నవంబర్‌లో గుజరాత్‌లో మరోసారి కూడా ప్రజలు బీజేపీని గెలిపిస్తారనడంలో సందేహం లేదు. ఎందుకంటే బీజేపీ హయాంలో గుజరాత్ ప్రజలు ఒక అద్భుతమైన మార్పును గమనించారు. అభివృద్ధి విషయంలో మోదీ నిజాయితీని గ్రహించినందువల్లే 2017లో యూపీలో ప్రజలు బీజేపీని అఖండమైన మెజారిటీతో గెలిపించారు. 2019 సార్వత్రక ఎన్నికల్లో కూడా అభివృద్ధే బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురాగలిగింది. సాధారణంగా యూపీలో ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ మరోసారి అధికారంలోకిరాదు. కాని మోదీ, ఆదిత్యనాథ్‌ల నాయకత్వంలో యూపీలో జరిగిన గణనీయమైన అభివృద్ధిని గ్రహించిన ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కడతారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.


2022లో బీజేపీ మరిన్ని అఖండ విజయాలతో ప్రజలకు చేరువ అవుతుందని తెలిసినందువల్లే ప్రతిపక్షాలు కంపించిపోతున్నాయి. మోదీ, యోగి మాదిరి ప్రతిపక్షాలకు చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాంగ్రెస్ హయాంలో దేశంలో వ్యవస్థలు కుళ్లిపోయి, అవినీతి ఎంత పరాకాష్ఠకు చేరుకుందో ప్రజలు ఇంకా మరిచిపోలేదు. సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీల హయాంలో గూండారాజ్, అరాచకత్వం ఎంత విశృంఖలంగా జరిగిందో, వేల కోట్లు ఈ పార్టీల నేతలు ఏ విధంగా పోగుచేసుకున్నారో ప్రజల అనుభవంలో ఉన్నది. దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ప్రజలందరికీ అర్థమయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రాంతీయ పార్టీల హయాంలో విచ్చలవిడి అవినీతి, కుటుంబ పాలన, ప్రజా దోపిడి, అస్తవ్యస్త ఆర్థిక విధానాల గురించి జనం అసహ్యించుకుంటున్నారు.


భారతీయ జనతా పార్టీ చెప్పింది చేస్తుంది అన్న నమ్మకం జనానికి ఉన్నందువల్లే బిజెపి పట్ల ఆకర్షితులవుతున్నారు. అనేక పార్టీలనుంచే కాక, అనేక వర్గాల నుంచి బీజేపీలో చేరేందుకు ఎనలేని ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఏడేళ్ల నుంచి అధికారంలో ఉన్నా బీజేపీ పట్ల కానీ, మోదీ నాయకత్వ శైలి పట్ల కానీ జనానికి ఆసక్తి తగ్గకపోవడమే కాదు, రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ప్రతి రోజూ ఇతర పార్టీల నుంచి నేతలు బీజేపీలోకి వలస వస్తుండగా కాంగ్రెస్ ముఖం చూసే వారే లేకుండా పోయారు. మోదీ పిలుపు మేరకు కాంగ్రెస్ విముక్త భారత్‌కు ప్రజలు స్పందించినందువల్లే కాంగ్రెస్ ఇవాళ కేవలం మూడు రాష్ట్రాల- పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌కే పరిమితమైంది. మరో రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో అంటకాగాల్సి వస్తోంది. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీకి ఏమాత్రం ఒక ప్రత్యర్థి కానే కాదు. అసలు ఆ పార్టీకి నాయకుడెవరో, ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. కొత్త సంవత్సరం రోజు ప్రధాని మోదీ ప్రజల మధ్య ఉండగా రాహుల్ గాంధీ ఇటలీలో ఉన్నారు! రాహుల్ గాంధీ అసమర్థ నాయకత్వం మూలంగా, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోగా, ప్రాంతీయ పార్టీలే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థులుగా మారాయి. పశ్చిమబెంగాల్, యూపీ, బిహార్, ఢిల్లీలో కాంగ్రెస్ ఉనికి లేకుండా పోవడంతో ప్రాంతీయ పార్టీలే బీజేపీతో తలపడుతున్నాయి. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలకు జవాబుదారీతనం ఉండదు. జాతీయ ప్రయోజనాలను కాపాడాల్సిన విశాలదృక్పథం ఉండదు. లక్షల కోట్ల అప్పులు చేసినా, వేల కోట్ల అవినీతికి పాల్పడినా, రాష్ట్రాలను తమ స్వంత రాజ్యాలుగా మార్చుకుని, వ్యవస్థల్ని నాశనం చేసి, రాజకీయ ప్రత్యర్థులను బూటకపు కేసుల్లో ఇరికించి, ప్రశ్నించిన వారిని అణగదొక్కి ఎన్ని దుర్మార్గాలకు పాల్పడినా అడిగేవారుండరు. ఇవాళ ప్రాంతీయ పార్టీలే దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య పాలనకు, అభివృద్ధికి అడ్డంకిగా మారాయి. ఈ ప్రమాదకరమైన పరిణామం నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత తనకు ఉన్నదని బీజేపీ భావిస్తోంది. ప్రాంతీయ పార్టీల నుంచి దేశాన్ని విముక్తం చేసే కర్తవ్యాన్ని బీజేపీ తనకు తాను భుజాలపైకి ఎత్తుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఘన విజయంతో బీజేపీ ఈ మహోన్నత కర్తవ్యాన్ని మరింత విప్లవాత్మకంగా అమలు చేసి తీరుతుంది.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-01-04T05:57:41+05:30 IST