దుర్యోధన పాలన అంతం ఖాయం

ABN , First Publish Date - 2022-07-09T10:08:02+05:30 IST

రాష్ట్రంలో పోడు భూమి..

దుర్యోధన పాలన అంతం ఖాయం

  • పోరు భూమిని తలపిస్తున్న పోడు భూమి: రేవంత్‌..
  • వైఎస్సార్‌కు కాంగ్రెస్‌ నేతల ఘన నివాళి 

హైదరాబాద్‌/పంజాగుట్ట, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోడు భూమి.. పోరు భూమిని తలపిస్తోందని.. మంచిర్యాల, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూల్‌, ఖమ్మం జిల్లాలు నిత్యం పోడు రణంతో రగులుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలిస్తామన్న హామీతో కేసీఆర్‌ ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు ఆడబిడ్డను వివస్త్రను చేసి, ఈడ్చి పారేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి కురుక్షేత్రంలో ఈ దుర్యోధన పాలన అంతం ఖాయమని రేవంత్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. పోడు భూములకు సంబంధించి ఓ మహిళను మహిళా పోలీసు ఈడ్చుకెళ్తున్న వీడియోను పోస్టు చేశారు. కేసీఆర్‌ పర్యటనలకు సంబంధించిన వివరాలు కోరుతూ ఆర్టీఐకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 100 దరఖాస్తులు పెట్టడంపై రేవంత్‌ స్పందిస్తూ.. బండి సంజయ్‌, కేసీఆర్‌ల కొట్లాట చూస్తుంటే పంపకాల్లో తేడా వస్తే దోపిడీ దొంగలు కొట్టుకున్నట్లు ఉందన్నారు. కాగా, రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చివరి కోరిక అని, ఆయన కోరికను నెరవేరుస్తామని రేవంత్‌ అన్నారు. నగరంలో వైఎస్సార్‌ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 


వైఎస్సార్‌ 73వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో, పంజాగుట్ట చౌరస్తాలో ఆయనకు రేవంత్‌, భట్టి, కేవీపీ, షబ్బీర్‌ అలీ, పొన్నాల తదితరులు ఘన నివాళి అర్పించారు. నగరంలో వైఎస్సార్‌ స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు వైఎస్‌ స్ఫూర్తితో పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామన్నారు. జలయజ్ఞంతో లక్షలాది ఎకరాలకు వైఎస్‌ నీరందించారని, వివిధ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచాడని గుర్తు చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధి అంతా కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందని, సీఎం కేసీఆర్‌ హయాంలో జరిగిందేమీ లేదని టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కొల్లాపూర్‌లో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసినందుకు వీఆర్‌వో శిరీషపై దుశ్శాసన పర్వం చేసిన టీఆర్‌ఎస్‌ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌ చేశారు. కాగా, కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశం శనివారం గాంధీభవన్‌లో జరగనుంది. రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రచ్చబండ కార్యక్రమ నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తారు. రాహుల్‌ సభను ఏ తేదీల్లో నిర్వహించాలో నిర్ణయిస్తారు. 

Updated Date - 2022-07-09T10:08:02+05:30 IST