Abn logo
May 22 2020 @ 00:14AM

ఆదుకొనేది ఉపాధి హామీ పథకమే!

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇతర చర్యలతో పాటు యుపిఎ1 కాలంలో వామపక్షాల ఒత్తిడితో అమలులోకొచ్చిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకంలో తీసుకురావాల్సిన ముఖ్యమైన మార్పు ఏమిటంటే గ్రామాల్లో వ్యవసాయాన్ని రక్షించటంతోపాటు, పట్టణంలో పేదలను చిన్న పరిశ్రమలను రక్షించటానికి ఈ పథకాన్ని వర్తింపజేయాలి.


ఆలస్యంగానైనా ప్రధాని మోదీ చేసిన రూ.20లక్షల కోట్ల భారీ ‘ప్యాకేజీ ప్రకటన’ సంతోషం కలిగించింది కానీ, దానికి ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఇచ్చిన దశలవారీగా వివరణలతో ఆ సంతోషం అంతలోనే ఆవిరైపోయింది. గతంలో రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించిన 5లక్షల 24వేల కోట్లు, ప్రభుత్వం ప్రకటించిన 1లక్షా 70వేల కోట్లు కూడా ఈ భారీ ప్యాకేజీలో కలిపేసారు. రిజర్వ్‌బ్యాంక్‌ గతంలో ప్రకటించిన రాయితీలన్నీ కార్పొరేట్‌ సంపన్నులకే తప్ప సామాన్యులకు ఒరగబెట్టిందేమీ లేదు. ఇపుడు ఆర్థిక మంత్రి కొత్తగా ప్రకటించిన ‘ప్యాకేజీ’ల్లో విధానాలు తప్ప రాయితీలు తక్కువ. ఆర్థిక డిమాండ్‌ పెంచటానికి రెండువిధాలుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మొదటిది రిజర్వ్‌బ్యాంకు ద్వారా విధాన పరంగా తీసుకునే చర్యలు. అంటే మానిటరీ పాలసీ ద్వారా ఎక్కువ డబ్బును మార్కెట్లోకి చెలామణీలోకి తేవటం. రెండోది ప్రభుత్వమే నేరుగా ఖర్చు పెట్టటం. అంటే బడ్జెట్‌ కేటాయింపులతో వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఆదాయం కల్పించటం. 


ప్రభుత్వం ప్రకటించిన రు.20లక్షల కోట్ల ప్యాకేజీల్లో అత్యధికంగా దాదాపు 19లక్షల కోట్లమేరకు మొదటి (మానిటరీ పాలసీ) కోవలోకే వస్తాయి తప్ప ప్రత్యక్షంగా డిమాండ్‌ను పెంచే చర్యలు కావు. వివరాల్లోకి వెళితే రిజర్వ్‌బ్యాంక్‌ మొదట ప్రకటించిన 5లక్షల కోట్ల రాయితీలన్నీ కార్పొరేట్‌ శక్తులకే ఇచ్చారు. ఇక ఇప్పుడు ప్రకటించిన వాటిలో చిన్న పరిశ్రమలకు 3లక్షల 70వేల కోట్లు, ఎం.ఎఫ్‌.ఐలకు 75వేల కోట్లు, డిస్కంలకు 90వేల కోట్లు, కిసాన్‌కార్డు ద్వారా రైతులకు 2లక్షల కోట్లు, నాబార్డ్‌ ద్వారా మరో 30వేల కోట్లు ఇవన్నీ కూడా రుణాలే. వీధివ్యాపారులకు 5వేల కోట్లు, గృహకొనుగోళ్లకు 70వేల కోట్లు కూడా రుణాలే. ఈ రుణాలన్నీ ఎప్పటికి అమలులోకి వస్తాయి? అసలు వస్తాయా? 


కరోనా నేపథ్యంలో ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యలకు ఇవేవీ పరిష్కారాలు చూపలేవు. అలాగే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా రక్షించే చర్యలుగానూ ఇవి ఉపయోగపడవు. ప్రభుత్వం ప్రకటించిన కొన్ని రాయితీలు ఎలా ఉన్నాయంటే ప్రజల డబ్బు ప్రజలకే ఇచ్చి అది కూడా తమ ప్యాకేజీగా గొప్పలు చెప్పుకున్నారు. ఉదాహరణకు ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లింపుల్లో ఇచ్చిన రాయితీల సంగతి చూద్దాం.


కార్మికుల మూల వేతనంలో 12శాతం కార్మికులు, మరో 12శాతం యజమాని పి.ఎఫ్‌ ఫండ్‌కు చెల్లించాలి. అది భవిష్యత్తులో కార్మికులకు చెందుతుంది. దానిని 2శాతం తగ్గించారు. అంటే కార్మికుల జీతంలో 12కు బదులు 10శాతం మాత్రమే పి.ఎఫ్‌ కింద కట్‌ అవుతుంది. ఆ మేరకు ఎక్కువ జీతం చేతికొస్తుంది. అంటే దాచుకునే సొమ్ములో కొంత మొత్తాన్ని తగ్గించి భవిష్యత్తులో కాకుండా ఇపుడే ఖర్చుపెట్టుకోవడానికి అందుబాటులోకి తెస్తారన్నమాట. ఆ విధంగా తక్షణం ఖర్చులకు పనికొచ్చేట్లుగా కొంత సొమ్ము సమకూరిన మాట నిజమేగానీ, అది కార్మికుల సొంత సొమ్మేగానీ ప్రభుత్వం ఇచ్చేది కాదుగదా? ఇలాంటి గారడీలన్నీ పక్కనబెట్టినా మొత్తం ప్యాకేజీలో ప్రత్యక్షంగా పేదలకు, బలహీనులకు ఉపయోగపడే ప్రతిపాదనలు సుమారు 50 నుండి 70వేల కోట్ల రూపాయిలకు మించి ఉండవు. 


మన పారిశ్రామికీకరణ, పట్టణ జనాభా ఎంతగా పెరిగినా భారతీయ ఆర్థిక వ్యవస్థ ఆత్మ ఇప్పటికీ గ్రామమే. కరోనా సృష్టించిన విలయంలో కోట్లాది వలస కార్మికులు తిరిగి తమ గ్రామాలకు చేరుకోవడానికి పడుతున్న ఆరాటం ఇందుకు తిరుగులేని తార్కాణం. వలస కార్మికులేగాక, పట్టణ పేదలు, అసంఘటిత రంగ కార్మికుల మూలాలన్నీ గ్రామాల్లోనే ఉన్నాయి. ఇప్పటికీ దేశజనాభాలో మూడింట రెండొంతులు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అందువల్ల మన ఆర్థిక వ్యవస్థకూ, ఆత్మగౌరవానికీ మూలమైన ఆ గ్రామాన్ని రక్షించుకోవాలి. దానికి ఆధారమైన వ్యవసాయాన్ని రక్షించుకోవాలి. తిండి అందించే గ్రామంతో పాటు, ఇతర కనీస సరుకులను అందించే చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడుకోవటం మన ప్రాధాన్యాలుగా ఉండాలి. ఇందుకోసం ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇతర చర్యలతో పాటు యుపిఎ1 కాలంలో వామపక్షాల ఒత్తిడితో అమలులోకొచ్చిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ బాగా ఉపయోగ పడుతుంది. ఈ పథకాన్ని మెరుగుపర్చి అమలుజేస్తే అద్భుత ఫలితాలను సాధించవచ్చు.


ఈ పథకంలో తీసుకురావాల్సిన ముఖ్యమైన మార్పు ఏమిటంటే గ్రామాల్లో వ్యవసాయాన్ని రక్షించటంతోపాటు, పట్టణంలో పేదలను చిన్న పరిశ్రమలను రక్షించటానికి ఈ పథకాన్ని వర్తింపజేయాలి. గ్రామంలో ఉండే పేద, మధ్య తరగతి రైతులందరి (ఉదా: 5ఎకరాల మాగాణి లేదా 10ఎకరాల మెట్టకు మించనివారి) కమతాల్లో పనిజేసే కూలీల వేతనాలన్నిటినీ ఈ పథకం ద్వారానే చెల్లించాలి. అంతేగాక ఆ రైతుల కుటుంబ సభ్యులు తమ స్వంత భూమిలో చేసే శ్రమలకు కూడా ఈ పథకం ద్వారా వేతనాలు ఇవ్వాలి. ఇలా చేయటం ద్వారా దాదాపు 60శాతంకు పైగా రైతాంగానికి, మొత్తం గ్రామీణ పేదలందరికీ మేలు జరిగి ఆర్థిక ఊతం లభిస్తుంది.


వ్యవసాయం ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుండి బయటపడుతుంది. గ్రామీణ జనాభా అంతటికీ ఆహార భద్రత ఏర్పడుతుంది. అలాగే ఈ పథకాన్ని ‘పట్టణ ఉపాధి హామీ పథకం’గా కూడా విస్తరించి, చిన్న పరిశ్రమలకు వర్తింపజేయాలి. చిన్న పరిశ్రమల్లో ముఖ్యంగా అత్యవసర వస్తువులు, సేవలు ఉత్పత్తిజేసే పరిశ్రమల్లో పనిజేసే కార్మికుల వేతనాలన్నింటిని ఈ పథకం ద్వారా చెల్లిస్తే సంక్షోభం ఎదుర్కొంటున్న చిన్న పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుంది. ఇలా ఒకవైపు పరిశ్రమలకు కార్మికుల కొరత లేకుండా చేయటమేగాక మరోవైపు వారి వేతనభారం యజమానులకు లేకుండా చేయటం వల్ల చిన్న పరిశ్రమలు ప్రస్తుత మాంద్యం నుండి వేగంగా బయటపడతాయి. ఈ చర్యల ద్వారా వ్యవసాయం, పరిశ్రమలకు జరిగే మేలుతోబాటు మొత్తం పట్టణ గ్రామీణ పేదలు, పారిశ్రామిక వ్యవసాయ కార్మికులు, అలాగే ఇటీవల గ్రామాలకు చేరిన వలస కార్మికులతో సహా అందరికీ పని దొరికి జీవితాలకు కనీస రక్షణ లభిస్తుంది.


మోదీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీల్లోని రుణ సదుపాయాలు అమలు జరిగితే ‘సరుకుల సప్లై’కి కొంత సహాయం లభిస్తుందేమోగానీ, నేడు మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ‘డిమాండ్‌ కొరత’కు పరిష్కారం లభించబోదు. ఇలాంటి సమయంలో మార్కెట్‌లో డిమాండ్‌ సృష్టించటానికి ఎంతో ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి, పరిశ్రమలకు వర్తింపజేయటం ఎంత కీలకమో మనం గుర్తించాలి.


ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకూ విస్తరించి పైన చెప్పిన విధంగా సమగ్రంగా అమలు జరపటానికి ప్రభుత్వానికి మూడు, నాలుగులక్షల కోట్ల కంటే ఎక్కువేమీ ఖర్చు కాదు. మన ప్రభుత్వం గతంలో కార్పొరేట్‌ వర్గాలకు తగ్గించిన పన్నులు, ఇచ్చిన రాయితీలతో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తమే. ఈ నిధులు సమకూరటానికి మార్గాలున్నాయి. మొత్తం జిడిపి (2019లో రు.210లక్షల కోట్లు)లో 70శాతం (రు.147లక్షల కోట్లు) వాటాను లాభాల రూపంలో జనాభాలో ఒక్కశాతం మాత్రమే ఉన్న ధనికులు దక్కించుకుంటున్నారు. మొత్తం దేశానికే కష్టమొచ్చినపుడు కొంత భారం మోయాల్సిన బాధ్యత ఈ ధనిక కార్పొరేట్లకు ఉండదా? కాబట్టి వారిపై సంపద పన్ను విధించటం లాంటి చర్యలు తీసుకుంటే అవసరమైన వనరులు సమకూర్చుకోవటం కష్టమేమీ కాదు. కనుక మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మంచి పథకాన్ని పైమార్పులతో అమలు జరిపాలి. కరోనా రూపంలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య సంక్షోభాలను అధిగమించటానికి ఇదే మంచి మార్గం.

తమ్మినేని వీరభద్రం

తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ(ఎం)

Advertisement
Advertisement
Advertisement