Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘విద్యుత్’ వైపరీత్యమే చమోలీ విపత్తు

విశాల భారత భూఖండం కింద ఒక బృహత్ టెక్టానిక్ ప్లేట్ (విరూపకారక ఫలకం- భూపటలంలోని శిలాపదార్థం విచ్ఛిన్నమవడం, వంపులు తిరగడాన్ని విరూపకారక ప్రక్రియ అంటారు) ఉంది. ‘ఇండియన్ ప్లేట్’గా ఇది సుప్రసిద్ధం. భూ భ్రమణం కారణంగా ఈ ప్లేట్, అంటే, పెద్ద భూభాగం నిరంతరం ఉత్తర దిశగా చలిస్తుంటుంది. ఒక సెంట్రీఫ్యూగల్ మెషీన్ (అపకేంద్రక యంత్రం)లో ఏ పదార్థమైనా పై స్థాయికి చేరే విధంగా భారత్ భూఫలకం నిరంతరం ఉత్తర దిశగా కదులుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలా కదులుతూ ఇది టిబెటన్ ప్లేట్‌ను ఢీకొంటుంది. ఈ రెండు బృహత్ భూఫలకాల మధ్య ఒత్తిడి హిమాలయాల నిరంతర ఊర్థ్వ చలనానికి దారితీస్తుంది. అంతేకాదు, భూకంపాలకు, మరీ ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లో భూప్రళయాలకు దారితీస్తోంది. ఫలితంగా ఉత్తరాఖండ్‌లో ప్రతి పది సంవత్సరాలకు కనీసం ఒకసారి పెను భూకంపం సంభవిస్తుంది. అయితే గత ఇరవై సంవత్సరాలుగా తీవ్ర భూకంపాలు ఏవీ సంభవించలేదు. కారణమేమిటి? బహుశా తెహ్రీ జలాశయంలో అపారంగా నిల్వ ఉన్న నీరు భారత, టిబెటన్ బృహత్ భూఫలకాల మధ్య ఒత్తిడిని నిభాయించడమే కావచ్చు. అయినప్పటికీ భారత భూఫలకం టిబెటన్ భూ ఫలకాన్ని ఢీ కొనటం కొనసాగుతూనే ఉంది. పర్యవసానంగా రాబోయేకాలంలో మరింత భయానకమైన భూకంపం సంభవించే అవకాశం ఎంతైనా ఉంది. 


టెక్టానిక్స్ (భూపటలంలోని చలనాలకు కారణమయ్యే అంతర్జనిత ప్రక్రియలు) మూలంగా భూపాతాలు సంభవిస్తుంటాయి. ఈ ఘటనల్లో వివిధ భౌతిక పదార్థాలు పెద్దఎత్తున నది గర్భంలో నిక్షిప్తమవుతాయి. కాల క్రమంలో గంగా ప్రవాహం వాటిని మైదానాలకు తీసుకువెళుతుంది. ఇదొక ప్రాకృతిక చర్య. నిరంతరంగా కొనసాగవలసిన చర్య. ఇందు కోసం గంగాప్రవాహం స్వేచ్ఛగా సాగి పోతుండడం అవశ్యం. జల విద్యుదుత్పాదనకు నదులపై నిర్మిస్తున్న బ్యారేజీలు, డ్యాంలు నదిలో స్వేచ్ఛా ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. 2013 కేదార్‌నాథ్‌లో సంభవించిన విలయంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ మంత్రిత్వశాఖ ఒక కమిటీని నియమించింది. 2013 విపత్తులో సంభవించిన పెనునష్టం అంతా జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులకు ఎగువున లేదా దిగువున సంభవించిందని ఆ కమిటీ నివేదిక పేర్కొంది. అసాధారణ స్థాయిలో కుండపోత వర్షాలు కురవడం దీనికి కారణం కాదని నిర్మాణమైన, నిర్మాణంలో ఉన్న పలు విద్యుదుత్పాదన ప్రాజెక్టుల వల్ల మందాకిని, అలకనంద నదులలో స్వేచ్ఛా ప్రవాహానికి అంతరాయం కలగడమే వల్లే కేదార్‌నాథ్‌లో మహా విపత్తుకు కారణమని ఆ కమిటీ స్పష్టం చేసింది. 


ఇది సంపూర్ణ సత్యం. రిషిగంగ, ధౌలిగంగా నదులలో స్వేచ్ఛాప్రవాహానికి రిషి గంగ, తపోవన్ విష్ణుగాడ్ విద్యుదుత్పాదన ప్రాజెక్టులు అవరోధంగా పరిణమించినందునే ఇటీవల చమోలీలో భయానకస్థాయిలో మంచు చరియలు విరిగిపడి జలప్రళయం సంభవించింది. ప్రస్తావిత రెండు విద్యుదుత్పాదన ప్రాజెక్టులూ ఆర్థికంగా లాభసాటి కాదని నిపుణులు హెచ్చరించినప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం వాటి నిర్మాణాన్ని చేపట్టింది! సరికొత్త విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి చేసే విద్యుత్ ధర ప్రస్తుతం యూనిట్‌కు 7 నుంచి 10 రూపాయల వరకు ఉంది. సరే, పర్యావరణ పరమైన వ్యయాలు తక్కువేమీ కావు కదా. అయితే వీటిని విద్యుత్ ధర నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోరు. పర్యావరణానికి జరిగే నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ప్రతిపాదిత కోట్లిభెల్-1బి ప్రాజెక్ట్ ఉత్పత్తిచేసే విద్యుత్ ధర యూనిట్‌కు రూ.18గా ఉంటుంది. మరి సౌర విద్యుత్ యూనిట్ కేవలం రూ.3కే లభిస్తుంది. దీనితో ఒక సమస్యేమిటంటే సౌరశక్తి పగటిపూట మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఉదయం, ఆ తరువాత సాయంత్రం మాత్రమే విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే సమయాలు. సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే సౌరవిద్యుత్‌ను యూనిట్‌కు యాభైపైసల అదనపురుసుముతో సరఫరా చేయడం ద్వారా ఉదయం, సాయంత్రం అవసరాలకు వినియోగించుకోవచ్చు. అంటే సౌర విద్యుత్ యూనిట్ రూ. 4 కంటే తక్కువ ధరకే లభ్యమవుతుంది. అయినప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులను విచక్షణారహితంగా నిర్మిస్తోంది! 


విద్యుదుత్పాదన ప్రాజెక్టులకు బదులుగా గంగానదీ తీరప్రాంతాలలో సాఫ్ట్‌వేర్ పార్కులు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, కంప్యూటర్ సెంటర్‌ల ఏర్పాటుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పూనుకోవాలి. తద్వారా గంగా జలాల మహిమాన్విత మానసిక, ఆధ్యాత్మికశక్తిని ఉపయోగించుకోవడం, సంపూర్ణంగా వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. విద్యుదుత్పాదన ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయడం హిమాలయాలలోని పర్యావరణంపై పడుతున్న భారాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. ఉత్తరాఖండ్ యువజనులకు నర్సులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, ప్రోగ్రామర్లుగా ఉద్యోగాలు లభించి జీవితోన్నతిని సాధించగలుగుతారు. ప్రస్తుతం వారు తక్కువ వేతనాలు వచ్చే ఉద్యోగాలతో సంతృప్తి పడవలసివస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణం జరిగే పది సంవత్సరాల పాటు మాత్రమే వారికి ఆ ఉద్యోగ వసతి ఉంటుంది. సేవల రంగాన్ని ప్రోత్సహించడం కంటే జల విద్యుదుత్పాదన ప్రాజెక్టుల నిర్మాణానికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం సబబుగా లేదని చెప్పక తప్పదు. 


ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడానికి కారణమేమిటి? విద్యుదుత్పాదన ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీశాఖల అనుమతులు తప్పనిసరి; భూ సేకరణ విషయం గురించి చెప్పనవసరం లేదు. ఈ కార్యకలాపాలలో ప్రభుత్వాధికారులకు కీలకపాత్ర ఉంటుంది. సేవలరంగాన్ని అభివృద్ధిపరచడంలో ప్రభుత్వ ఉపేక్షకు ప్రధాన కారణం సాప్ట్‌వేర్ కంపెనీల అధిపతులు విద్యుదుత్పాదన ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల వలే అధికారవర్గాలకు తలొగ్గరు. ఇది అధికారులకు, వారి రాజకీయ యజమానులకు సుతరామూ ఇష్టం లేదు. ప్రపంచ, పర్యావరణ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని నదులకు హాని చేస్తూ ప్రాకృతిక ఉత్పాతాలకు కారణమవుతున్న జల విద్యుదుత్పాదన ప్రాజెక్టుల నిర్మాణానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం తక్షణమే స్వస్తి చెప్పాలి.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...