ప్రాంతీయ పార్టీలపై ఆ పాచికలు పారవు

ABN , First Publish Date - 2022-07-29T05:58:39+05:30 IST

దేశంలో ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేయాలనే రాజకీయ లక్ష్యంతో భారతీయ జనతాపార్టీ సామ దాన దండోపాయాలను ఆచరణలో పెడుతున్నది...

ప్రాంతీయ పార్టీలపై ఆ పాచికలు పారవు

దేశంలో ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేయాలనే రాజకీయ లక్ష్యంతో భారతీయ జనతాపార్టీ సామ దాన దండోపాయాలను ఆచరణలో పెడుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థను ద్విసభ్య రాజకీయ పార్టీల కేంద్రంగా పునర్‌ నిర్వచించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అన్నీ కలిసివస్తే రాబోయే రోజుల్లో అధ్యక్ష తరహా పాలన అమలులోకి తేవాలనే ఆలోచనలు కూడా నరేంద్ర మోదీ, అమిత్‌షాలలో బలంగా ఉన్నాయనే అభిప్రాయం కూడా ఉన్నది. ఇదే ధోరణిలో గతంలో ‘‘ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా’’ అనే మానసిక స్థితి వైపుకు జాతిని నడిపించాలని ప్రయత్నించిన కాంగ్రెస్‌ దేశాన్ని ఇక్కట్లపాలు చేసి, చివరికి తానే చిక్కుల్లో పడింది. వాస్తవానికి డెబ్బై ఐదేండ్ల కీలక మలుపుకు చేరుకున్న భారతదేశం, ఆ అనుభవాల దన్నుతో నిన్నటి నొప్పులు మళ్ళీ తిరగబెట్టకుండా జాగ్రత్త పడాల్సిన సందర్భమిది. ఏ సమాజానికైనా పురోగామి ప్రయాణానికి చరిత్ర వెలుగు దివిటీలా ఉపయోగపడుతుంది. కాకపోతే నడిపించే వారికి దానిలోకి తొంగిచూసే విశాలత్వం ఉండాలి. స్వాతంత్య్రానంతరం మొదటి దశ జాతీయ నాయకులు వైవిధ్యాల భారతం విసిరే సవాళ్ళను చారిత్రక దృక్పథంతో చూడగలిగారు. తర్వాతి తరం నేతలే లోతైన చూపుకు దూరంగా జరిగారు.


జాతీయ స్థాయి నాయకత్వం భారతదేశం నేల నలుచెరుగులా కాలం ఎత్తిపట్టిన నినాదాలను సరియైన దృష్టి కోణంతో అర్థం చేసుకొని పరిష్కార మార్గాలను త్వరితంగా అందించి ఉంటే, ప్రజలు ప్రత్యామ్నాయ వేదికల వెంట అడుగులు వేసేవారే కాదు. ప్రాంతీయంగా పుట్టుకొచ్చే ఆకాంక్షలపట్ల జాతీయ పార్టీలు మూగ, చెవిటి, గుడ్డివారిగా ప్రవర్తించడం వల్లనే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రాంతీయ అస్తిత్వాలపట్ల జాతీయ పార్టీల లెక్కలేనితనమే నూతన రాజకీయ శక్తుల ఆవిర్భావానికి నాంది పలికింది. 


కాంగ్రెస్‌, జనతా, బీజేపీ, సీపీఐ, సీపీఎం లాంటి రాజకీయ పార్టీలు జాతీయ రాజకీయాల్లో భాగస్వామ్యాన్ని పొందగలిగాయి. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపమైన సమైఖ్య స్ఫూర్తిని ప్రదర్శించడంలో, సామాజిక న్యాయాన్ని, సమగ్రతను ఆచరించటంలో దిద్దుకోజాలని తప్పటడుగులు వేశాయి. అందువల్లనే ప్రజా రాశులు ఎత్తిపట్టిన పిడికిళ్ళుగా ప్రాంతీయ పార్టీలు భారతదేశంలో వెలుగు వెలిగాయి.


స్వాతంత్య్రానంతరం ఆనాటి జాతీయ రాజకీయ వ్యవస్థ ఆత్మగౌరవ పోరాటాలపట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యమే తమిళనాడు రాష్ట్రంలో ‘ద్రవిడ మున్నెట్ర ఖజగం’ వికాసానికి దారి చూపింది. అదే కోవలోనే ‘అస్సాం అస్సామీయుల కోసమే’ నినాదంతో ‘అస్సాం గణపరిషత్‌’, సుఖ సిక్కిం లక్ష్యంతో ‘సిక్కిం డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌’, తెలుగువారి ఆత్మగౌరవ ఎజెండాతో ‘తెలుగు దేశం’ పార్టీలు దేశ రాజకీయ వ్యవస్థలో చెరిగిపోని ముద్రవేశాయి. చారిత్రక నేపథ్యం కలిగిన తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల జాతీయ పార్టీలు అనుసరించిన అన్యాయమైన విధానాలే ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబడేందుకు దోహదపడ్డాయి. అలాగే ‘శిరోమణి అకాళిదళ్‌’, ‘జార్ఖండ్‌ ముక్తిమోర్చా’, ‘కాశ్మీర్‌ పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌’ల ఆవిర్భావానికి కూడా జాతీయ పార్టీలు ఆయా ప్రాంతాల ప్రజల డిమాండ్లను అవగాహన చేసుకోలేకపోవడమే కారణం. సాంప్రదాయ కులాలు, గుప్పెడు కుటుంబాల మీదనే ఆధారపడిన జాతీయ రాజకీయ పార్టీలు, కాలం కల్పించిన చైతన్యంతో, కదలిక వచ్చిన సామాజిక వర్గాలను తమలో ఇముడ్చుకోలేకపోవటం వల్లనే ‘ఆర్‌జెడి’, ‘సమాజ్‌వాదీ’, ‘బిఎస్పీ’ లాంటి పార్టీలు పుట్టాయి.


అలాగే కాంగ్రెస్‌ పార్టీ విధానలను నిరసిస్తూ ‘మా, మతి, మనుష్‌’ నినాదంతో పశ్చిమ బెంగాల్‌ ప్రజల తీర్పు కోరిన తృణమూల్ కాంగ్రెస్‌ చారిత్రక విజయాలను నమోదు చేసింది. భారతదేశ ఉన్నత పదువులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి లాంటి కీలక పదవుల్లో స్వదేశీయులే ఉండి తీరాలనే సూత్రంతో ఆవిర్భవించిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగింది. వైవిధ్యాల భారతదేశంలో విభిన్న కారణాలతో పురుడుపోసుకున్న ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలకు చారిత్రక నాయకత్వాన్ని అందించాయి. 


దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయంగా రగులుకున్న డిమాండ్ల సాధన పోరాటాలను ప్రజాస్వామిక రాజకీయాల కేంద్రంగా కొనసాగేలా ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహించగలిగాయి. ఏడున్నర దశాబ్దాల భారత ప్రజాస్వామ్య శాంతియుత ప్రయాణానికి ప్రాంతీయ పార్టీలు ఆ మేరకు దోహదపడ్డాయి. భారీ పరిమాణం, వైవిధ్యభరితమైన జనాభా కలిగిన దేశాన్ని ఐక్యంగా ఉంచడానికే రాజ్యాంగ నిర్మాతలు సమాఖ్య విధానాన్ని కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు గీటు రాయిగా నిర్దేశించారు. అయితే జాతీయ పార్టీల నాయకత్వం వారి పార్టీలకున్న విస్తారాన్ని చూసుకొని అహంకార ధోరణితో సమాఖ్య స్ఫూర్తిని కాలరాసే ప్రయత్నాలు చేశారు. ఈ అప్రజాస్వామిక వైఖరే రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల అవసరాన్ని సుస్థిరం చేస్తున్నది.


అమరత్వాలు అందించిన శోక సానుభూతిపైన ఆధారపడి కాంగ్రెస్‌, మతవిద్వేషాల పైన ఆధారపడి బీజేపీ అధికారాన్ని మార్చుకున్నాయి. కానీ జనాన్ని గెలిపించే ఎజెండాతో నెగ్గలేదు. ఒకవేళ దేశ అవసరాలను, ప్రాంతాలవారీగా ప్రజల డిమాండ్లను ఎప్పటికప్పుడు పార్లమెంట్‌ లోపల, వెలుపల నిలదీస్తున్న ప్రాంతీయ పార్టీలే గనుక ఆవిర్భవించకపోయుంటే భారతదేశ ప్రజాస్వామ్యం బతికి ఉండేదా అనే అనుమానం రాక మానదు.


కానీ నేడు మన బహుముఖీన దేశ రాజకీయ వ్యవస్థను, ద్విముఖీన, వీలైతే ఏకముఖీన రాజ్యవ్యవస్థగా మలిచే ప్రయత్నం జరుగుతున్నది. ప్రాంతీయ పార్టీలను మింగేసి, బుద్ధిజీవులను తొక్కేసి స్వతంత్ర సంస్థల ఊపిరి తీసేసి ప్రజాస్వామ్యాన్ని కాషాయ స్వామ్యంగా తీర్చిదిద్దేందుకు నరేంద్రమోదీ, అమిత్‌షాలు పన్నుతున్న వ్యూహాలు ప్రమాదకరంగా దాపురించాయి. అయితే ఈ భారత సమాజానికి ఒక సుగుణమున్నది. ‘అతిసర్వత్ర వర్జయేత్‌’ అనే ప్రాచీన నానుడిని పదే పదే నిజం చేయడం దేశ ప్రజలకున్న గొప్ప అలవాటు. తెలంగాణ కవి చెరబండ రాజు అన్నట్లు ‘గడియారం పెట్టుకున్న ప్రతివాడూ.. పరిగెడుతున్న కాలాన్ని పట్టుకోలేడు’. అధికారాన్ని ఆయుధంగా మలుచుకొని దేశాన్ని గుప్పెట్లో బంధించడం సాధ్యపడదనే సత్యాన్ని కాలం ఏనాడో రుజువు చేసింది. 


సుదీర్ఘకాలంగా జాతీయ రాజకీయాలను వంతుల వారీ క్రీడగా మార్చేసిన కాంగ్రెస్‌, బీజేపీలను వదిలించుకొని దేశం నూతన తొవ్వను వెతుక్కోవాల్సిన చారిత్రక సందర్భం వచ్చింది. భూమి పుత్రుల ఆకాంక్షల నుంచి పుట్టిన ప్రాంతీయ పార్టీలను పాతరేయాలని మోదీ వందిమాగధులు వేస్తున్న పాచికలే వికటించి కొత్త పొద్దును వాగ్దానం చేస్తాయి.

డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌

రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ సభ్యులు

Updated Date - 2022-07-29T05:58:39+05:30 IST