శవాలకూ హక్కులుంటాయి!

ABN , First Publish Date - 2020-07-15T05:42:56+05:30 IST

కరోనా వలన చనిపోయిన వారి ‘అంత్యక్రియల’కు స్మశానాలలో ‘చోటు’ ఇవ్వకపోవడం విచారించ వలసిన విషయం. ‘వైరస్ ఏయే రూపాలలో మనుషులకు సోకుతుందో?’ అనే ఆందోళన...

శవాలకూ హక్కులుంటాయి!

కరోనా వలన చనిపోయిన వారి ‘అంత్యక్రియల’కు స్మశానాలలో ‘చోటు’ ఇవ్వకపోవడం విచారించ వలసిన విషయం. ‘వైరస్ ఏయే రూపాలలో మనుషులకు సోకుతుందో?’ అనే ఆందోళన అందరి లోనూ వుంది. దాంట్లో భాగంగానే అందరూ ఇలా చేస్తున్నారు. ఆ జాగ్రత్త అవసరమే కావొచ్చు. ‘దూరాన్ని పాటించడం’ అనే దాని కోసం ఇప్పుడు దాదాపుగా అన్ని దారులనూ మూసి వేసాం. కానీ అలా మూసి వెయ్యడానికి వీలుకాని మనిషి చేరే ‘ఆఖరి దారి’నీ ఇప్పుడు అన్ని చోట్లా మూసి వేస్తున్నారు. ‘కాటి కాపరుల’ లాగా కొన్ని శ్మశానాల దగ్గర కొంతమంది ‘కరోనా కాపరులు’ తయారయ్యారు. వంతుల వారీగా కాపలాలు కాస్తున్నారు. శవాలు రాగానే అడ్డుకుంటున్నారు. గుంతలు తొవ్వడానికి వొచ్చిన జేసిబీ మిషన్లనీ, ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించి వెనక్కు పంపించి వేస్తున్నారు. వారితో ఘర్షణకు దిగుతున్నారు. కరోనా మనకు రాదనే గ్యారంటీ ఏమీ లేదు. ఇవ్వాళ వేరే వాళ్లకు ఇవ్వని చోటు రేపు ‘అక్కడ’ మనకి ఎలా దక్కుతుంది? సాధారణ పౌరుల విషయం పక్కన పెడితే; కరోనాకి వైద్యం చేసిన ఒక డాక్టరుకో, కాపలా కాస్తున్న పోలీసుకో, సేవలందిస్తున్న వైద్య సిబ్బందికో, మునిసిపాలిటీ వారికో, రెవిన్యూ వారికో కేవలం ఈ పనులు చేసినందువల్లనే వైరస్ సోకి చనిపోతే వారి శవాలనూ అడ్డుకోవడం న్యాయమా? జీవించి ఉన్నప్పుడు వారి సేవలను అందుకొని, చనిపోయాక అలా చేస్తే; అది 'మానవ న్యాయం' కిందకు వొస్తుందా? అది వారిని అవమానించడం కాదా? మనుషులు బ్రతికి వున్నప్పుడు ఎలాంటి ‘మానవ హక్కులు’ వుంటాయో, చనిపోయాక కూడా వారికి కొన్ని 'మరణ హక్కులు' ఉంటాయి. వాటిని గౌరవించాలి. 


ఇవ్వాళ అవతల వారి మరణ హక్కుల్ని నిరాకరించే మనకు కూడా రేపు అలాంటి నిరాకరణే ఎదురవుతుందని గుర్తించాలి. ‘కరోనా హతుల స్మశాన నిరాకరణ’ అనేది హక్కుల ఉల్లంఘనే కాదు; చట్ట వ్యతిరేకం కూడా. ‘అంటువ్యాధుల ప్రత్యేక నివారణా చట్టం’ తమ చేతుల్లో ఉన్నంత మాత్రం చేత, దాని ద్వారా ప్రభుత్వాలు సమాజానికి తప్పుడు సంకేతాలను పంపడం సరికాదు. కరోనా పీడితుల శవాలను వారి సంబంధీకులకు ఇవ్వడమూ, కర్మ కాండలకు అనుమతి ఇవ్వడమూ అనేవి సాధ్యం కాకపోయినా కనీసం 'చివరి చూపుల' వరకూ దూరంగానైనా అనుమతించి, వారిని కూడా శ్మశానం వరకూ రానివ్వవలసింది. ఆ ప్రక్రియకు అయిన వాళ్ళను దూరం చేసి, దాన్ని ‘దూరాన్ని పాటించడం’ గా ప్రభుత్వాలు ఎప్పుడైతే మనకు నేర్పాయో; ఆ దూరం ‘స్మశాన దూరానికి’ కూడా దారి తీసింది. ‘దూరాన్ని పాటించడం’ అంటే సరిపోయే దానికి ‘సామాజిక దూరం’ అనడమే మొదటి తప్పు. సమాజంలోని అసమ పరిస్థితుల్ని చెప్పే సందర్భానికి సరిపోయే మాటను తీసుకొచ్చి, కరోనా విషయం లో వాడడమేమిటి? ఒక పక్క సిగరెట్లు అమ్ముతూ; అవి తాగడం ‘ప్రాణానికి హానికరం’ లాంటి ప్రకటనలాగానే ‘రోగితో పోరాటం’ అనే వాతావరణాన్ని సృష్టించి, ‘మనం పోరాడవలసింది రోగంతోనే గానీ రోగితో కాదు’ అనడం కూడా అలాంటిదే. కరోనా ఒక్కసారిగా పోయేది కాదు. పాజిటివ్ కేసులు పెరుగుతూనే వున్నాయి. దానికి తోడు మరణాలు కూడా పెరుగుతూనే వున్నాయి. శవాలు తుమ్మవు, దగ్గవు, తుప్పర్లు పడేలా మాట్లాడవు. పూర్తిగా సానిటైజ్ చేసి, ప్యాక్‌ చేసి ఉంటాయి. శవాలను స్మశానాలలోనే పూడ్చాలి, లేదా కాల్చాలి. దానికి వేరే దారి లేదు. దీని గురించి రాజకీయ నాయకులు, అధికారులు ఆయా ప్రాంత ప్రజలకు కౌన్సిలింగ్ చేసి ఒప్పించాలి. ప్రజలూ సహకరించాలి. ఇది మానవత్వం సమస్య. మానవ సంబంధాల సమస్య. 

నన్నూరి వేణుగోపాల్, ఒంగోలు

Updated Date - 2020-07-15T05:42:56+05:30 IST