Abn logo
Jul 23 2021 @ 00:00AM

ఆది యోగి అనుగ్రహించిన రోజు

ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారికి ఏడాదిలో అత్యంత ముఖ్యమైన రోజు గురు పౌర్ణమి. ప్రాథమికంగా, మనలో ఉన్న విషయాలను గ్రహించే శక్తిని ప్రాతిపదికగా తీసుకొని చూస్తే... సూర్యుడి చుట్టూ ఉన్న భూమి కక్ష్యలోని కొన్ని స్థానాలకు విశేషమైన స్వభావాలు ఉంటాయి. సంవత్సరంలోని ఆ ప్రత్యేక దినాల్లో ఎందరో సాధువులు, సన్యాసులు ముక్తిని పొందారు. గురు పౌర్ణమి రోజున చంద్రుడికీ, ఇతర గ్రహాలకూ మధ్య ఒక సాన్నిహిత్యం ఉంటుంది. అది విషయాలను మరింత ఎక్కువగా గ్రహించడానికి దోహదం చేస్తుంది. 


యోగ సంప్రదాయంలో శివుడుని దేవునిగా ఆరాధించడానికి బదులు  ఆది యోగిగా... అంటే మొదటి యోగిగా... ఆది గురువుగా, యోగ శాస్త్రాలకు మూలమైనవాడిగా పరిగణిస్తారు. పదిహేను వేల ఏళ్ళ కిందట గురు పౌర్ణమినాడు ఆ ఆది యోగి దృష్టి తన తొలి శిష్యులైన సప్త ఋషుల మీద ప్రసరించింది. ఆయన ఒక తాపసి. తన చుట్టూ జరుగుతున్నది ఏమాత్రం పట్టించుకోని యోగి. అలాంటిది తన అనుభూతిని వేరొకరితో పంచుకోవాలన్న ఆలోచన ఆయనలో కలిగింది. అప్పటి వరకూ తమను ఆయన గుర్తించకపోయినా... 84 ఏళ్ళుగా ఆ సప్త ఋషులు సరళమైన ప్రాథమిక సాధన చేస్తూనే ఉన్నారు. 


సూర్యుడు ఉత్తర ముఖం నుంచి దక్షిణానికి మారుతున్న సమయంలో... దక్షిణాయనంలో... ఆ ఏడుగురినీ చూసిన ఆది యోగి వారు తేజోవంతులుగా ఉండడం గమనించారు. సూర్యుడు దక్షిణాయనం ప్రారంభించాక వచ్చే మొదటి పౌర్ణమి రోజున వారికి బోధ చేయాలనీ, వారికి గురువుగా మార్గనిర్దేశం చేయాలనీ నిర్ణయించారు. ఆ రోజే గురు పౌర్ణమి. అప్పటి వరకూ ప్రపంచం తనను స్పృశించడానికి కూడా వీలు లేని స్థితి నుంచీ కారుణ్యంతో మెత్తబడి లోకానికి అందుబాటులోకి వచ్చి, గురువుగా మారారు. మానవులది నిర్బంధమైన జీవితం కాదనీ, ప్రకృతి విధించిన నియమాలకు వారు బందీలు కావలసిన అవసరం లేదనీ ప్రకటించారు. వారు కృషి చేయడానికి సిద్ధపడితే అనంతమైన దివ్య అస్తిత్వంలోని ప్రతి ద్వారం తెరుచుకుంటుందనీ తెలియజెప్పారు.


మన సంప్రదాయంలో అత్యున్నతమైన ఒకే ఒక లక్ష్యం ముక్తి. మన జీవితంలో చేసే ప్రతిదీ ముక్తి కోసమే. ప్రకృతి నియమాలతో సహా మరే నిర్బంధానికీ మానవుడు అంగీకరించలేడు. ఎందుకంటే ప్రతిదాని నుంచీ ముక్తి కావాలనే కాంక్ష అతనిలో అంతర్లీనంగా ఉంటుంది. నిర్బంధ స్థితిని అధిగమించి, ముక్తిని ఎలా సాధించాలో చెబుతూ, దానికి ఒక మార్గాన్ని తొలిసారిగా ఈ రోజున ఆది యోగి అందించారు. అందుకు ఆయనకు ప్రణామాలు. అయితే సప్త ఋషుల ఘనత అంతకు మించినది. ఎందరో యోగులకూ, గురువులకూ అద్భుతమైన భక్తులు ఉన్నారు. వారిపై ఆ గురువులు తమ అనుగ్రహాన్ని కురిపించారు. కానీ ఏ గురువైనా, యోగి అయినా అటువంటి ఏడుగురు అనుయాయులను... తమ జ్ఞానాన్ని పంచుకోగలిగే వారిని సంపాదించుకోలేకపోయారు. ఎందుకంటే గ్రహించగలిగే సామర్థ్యం ఉన్నవారు వారికి దొరకలేదు. 


ఆషాఢ మాసం అనుగ్రహంతో నిండిన నెల. మానవులు తమ ప్రస్తుత అస్తిత్వం నుంచి మరో స్థాయికి ఎదగగలిగే సామర్థ్యాన్ని కలిగించే మాసం ఇది. అటువంటి మాసంలో అత్యుత్తమమైన రోజైన గురు పౌర్ణమి నాడు సాధనను మరింత బలోపేతం చేసుకోవాలి.

 సద్గురు జగ్గీ వాసుదేవ్‌