ప్రేమ.. పరమాత్ముని చేరే దగ్గరి దారి

ABN , First Publish Date - 2020-08-26T10:04:52+05:30 IST

..అన్నాడు కర్మ యోగి కబీరు దాసు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ‘ప్రేమ - ప్రేమ’ అంటారేగానీ నిజంగా ప్రేమ అంటే ఏమిటో ఎవరికీ సరిగ్గా తెలవదు. ఏ దారిలో పయనిస్తే మనం దైవాన్ని చేరగలుగుతామో అదే నిజమైన ప్రేమ అని దీని

ప్రేమ.. పరమాత్ముని చేరే దగ్గరి దారి

  • ప్రేమ్‌-ప్రేమ్‌ సబ్‌ కోయీ కహై, ప్రేమ్‌ న జానై కోయ్‌
  • జా మారగ్‌ హరి జీ మిలై, ప్రేమ్‌ కహాయే సోయ్‌

..అన్నాడు కర్మ యోగి కబీరు దాసు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ‘ప్రేమ - ప్రేమ’ అంటారేగానీ నిజంగా ప్రేమ అంటే ఏమిటో ఎవరికీ సరిగ్గా తెలవదు. ఏ దారిలో పయనిస్తే మనం దైవాన్ని చేరగలుగుతామో అదే నిజమైన ప్రేమ అని దీని అర్థం. ‘‘మానవత్వం కలిగి ఉండడమే పరమాత్మున్ని చేరే దగ్గరి దారి’’ అన్నదే కబీరు పద్యం సందేశం. సర్వోన్నతమైన ప్రేమ చాలా శక్తివంతమైనది. ఇది మానవత్వానికి సాకారరూపం. నిస్వార్థంతో కూడిన ప్రేమ నేడు ప్రపంచానికి చాలా అవసరం అని స్వామి వివేకానంద చెప్పేవారు. కర్ణాటక శివ భక్తురాలైన అక్కమహాదేవి.. ‘‘జీవారాధకుడే నిజమైన శివారాధకుడు. జీవులను ద్వేషిస్తూ దేవుణ్ని ప్రేమిస్తాననడం అజ్ఞానమే’’ అని చెప్పేవారు. ఇలా ఎవరు చెప్పినా ఒకటే మాట... తోటివారి పట్ల ఆదర భావంతో, మానవత్వంతో మెలగాలని!


ఒకరోజు ఓ భక్తుడి ఇంటికి ఆకలితో ఉన్న వృద్ధుడు వచ్చి భిక్షం అడుగుతాడు. అప్పుడు ఆ భక్తుడు ఆ యాచకుణ్ని తన ఇంట్లోకి తీసికెళ్లి ఆదరంగా కూర్చోబెట్టి పళ్లెంలో ఆహారం వడ్డించి ‘‘తృప్తిగా భోంచేయండి. సాక్షాత్తు భగవంతుడే మిమ్మల్ని నా ఇంటికి పంపించాడు’’ అన్నాడు. దానికి ఆ వృద్ధుడు.. ‘‘అయ్యా మీరు నాకు ఆహారం పెట్టి ఆకలి తీరుస్తున్నారు. మధ్యలో భగవంతుణ్ని ఎందుకు తలుస్తున్నారు. నిజంగా ఆయనే ఉంటే నేను ఇలా ఆకలి కడుపుతో ఇల్లిల్లూ ఎందుకు తిరగవలసి వస్తుంది’’ అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు. అప్పుడా భక్తుడు కోపంతో.. ‘‘నీలాంటి నాస్తికుడికి నా ఇంట్లో భోంచేసే అర్హత లేదు’’ అంటూ అన్నం తింటున్న వృద్ధుణ్ని బలవంతంగా లేపి బయటకు నెట్టేశాడు. ఆ రాత్రి భక్తుని కలలోకి భగవంతుడు వచ్చి.. ‘‘ఆకలితో వచ్చి నువ్వు పెట్టిన అన్నం తింటున్న ఆ వృద్ధుణ్ని బలవంతంగా లేపి బయటకు పంపించి అవమానించావు. అన్నార్తుడి ఆకలి తీర్చకుండా మహాపాపం చేశావు. ఎన్నో రోజుల్నుండి ఆ యాచకుడు నన్ను దూషిస్తూ అవమానపరుస్తున్నా పోషిస్తున్నాను. నువ్వు మాత్రం ఆ వృద్ధుణ్ని నా కోసం ఒక్క పూట భరించలేకపోయావు’’ అన్నాడు. దీంతో ఆ భక్తుడికి కనువిప్పు కలిగింది.


ప్రేమతత్వమే మానవత్వం అని సత్యసాయిబాబా ఎప్పుడూ బోధించేవారు. ‘‘మనిషిలో మానవత్వం మొలకెత్తాలంటే మొట్టమొదట అతడిలో ‘ప్రేమ’ మొగ్గ తొడగాలి. ఆ ప్రేమే సత్యానికి, ధర్మానికి, అహింసకు పట్టుగొమ్మగా నిలుస్తుంది. మానవుడే మాధవుడనే విశ్వాసం ఏర్పడినప్పుడు అందరిలోను భగవంతుడి రూపమే కనబడుతుంది. ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడనేది సత్యం’’ అని చెప్పేవారు. ‘‘ప్రేమ’’ భావనపై అనేక పరిశోధనలు చేసిన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా.. అది మనిషి మనుగడకు అమృతం వంటిదని, మానసిక రుగ్మతలను మాన్పే శక్తి ప్రేమకు ఉందని తేల్చారు. ప్రేమ అంటే వయసులో కలిగే వికారమే కాదు. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల పట్ల, గురువు పట్ల ఉండే గౌరవ భావం కూడా ప్రేమే. 


పరికిపండ్ల సారంగపాణి, 9849630290

Updated Date - 2020-08-26T10:04:52+05:30 IST