Abn logo
Nov 28 2020 @ 03:08AM

అలా జరిగితే.. పట్టాభిషేకం ఆలస్యమవుతుందా?

ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కేటీఆర్‌కు పరీక్షే.. విజయం సాధిస్తే పట్టాభిషేకానికి మార్గం సుగమం

 దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవడానికి వరుస భేటీలు

 మూడు పార్టీలకూ టర్నింగ్‌ పాయింట్‌గా నిలువనున్న ఎన్నికలు

బీజేపీ మెజారిటీ డివిజన్లు    గెలిస్తే ప్రధాన ప్రతిపక్షంగా స్థానం 

 అదే జరిగితే, కాంగ్రె్‌సకు రాష్ట్రంలో మరిన్ని గడ్డు పరిస్థితులు

హైదరాబాద్: ‘రేసులో ఏ గుర్రాన్ని దౌడు తీయించాలనేది మా పార్టీ అధినేత కేసీఆర్‌ ఇష్టం. ఏ గుర్రాన్ని ఎప్పుడు.. ఎక్కడ.. దౌడు తీయించాలనేది ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ‘గులాబీ’ సైన్యాన్ని ఒకరు నడిపిస్తే.. దుబ్బాక ఉప ఎన్నికల్లో మరొకరు సారథ్యం వహించారు. కష్టపడ్డ వారికే క్రెడిట్‌ దక్కుతుంది’ అంటూ ఇటీవల టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోయాక అక్కడ పార్టీ తరఫున అన్నీ తానై వ్యవహరించిన మంత్రి హరీశ్‌రావు అందుకు తనదే బాధ్యత అంటూ ప్రకటించారు కూడా!


ఈ నేపథ్యంలోనే, ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్‌ భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. టీఆర్‌ఎస్‌ 2014లో అధికారంలోకి వచ్చాక 2016 జనవరిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ గ్రేటర్‌ ఎన్నికల సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు. ఆ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను టీఆర్‌ఎస్‌ రికార్డుస్థాయిలో 99 చోట్ల గెలిచి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకుంది. దీంతో, సీఎం కేసీఆర్‌ వెంటనే ఆయనకు కీలకమైన పురపాలక శాఖను కట్టబెట్టారు.


ఇక, అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో గెలిచిన తర్వాత కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి వరించింది. అప్పుడే ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలమవుతానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో, కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపడతారనే ప్రచారం జరిగింది.  ఇప్పు డు జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలం అవుతానని కేసీఆర్‌ మరోసారి ప్రకటించారు. దాంతో, గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తే.. కేటీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టటం లాంఛనమేనని, సీఎంగా కేటీఆర్‌ పట్టాభిషేకానికి ఇంతకు మించిన తరుణం ఉండబోదని టీఆర్‌ఎ్‌సకి చెందిన కొందరు ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు.


‘డిసెంబరు నాటికి టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతాయి. ఈసారీ జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగిరితే రెండోసారి పార్టీని గెలిపించి న క్రెడిట్‌ ఇచ్చి కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగిస్తే.. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకారం మరో మూడేళ్ల గడువు ఉంటుంది. తనను తాను నిరూపించుకోవటానికి ఆయనకు ఈ వ్యవధి సరిపోతుంది’ అని టీఆర్‌ఎస్‌ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. అయితే, గ్రేటర్‌ ఎన్నికల్లో భిన్న ఫలితాలొస్తే  యువరాజు పట్టాభిషేకానికి మరింత సమయం పడుతుందనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.  


భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచి

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను తెలంగాణలో భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్క టీఆర్‌ఎ్‌సకు మాత్రమే కాదు.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు కూడా ఈ ఎన్నికలు టర్నింగ్‌ పాయింట్‌గా అభివర్ణిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. గ్రేటర్లో మేజిక్‌ మార్కు సాధిస్తే.. టీఆర్‌ఎ్‌సకు తిరుగుండదు. దుబ్బాకలో ఓటమిని హరీశ్‌కు ఎదురు దెబ్బగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్లో విజయం సాధిస్తే కేటీఆర్‌ ఇమేజి మరింత పెరగనుంది. పట్టాభిషేకానికి మార్గాన్ని మరింత సులభతరం చేయనుంది. ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులంతా తరలి వచ్చిన గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీని నిలువరిస్తే.. కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడానికి కేసీఆర్‌కు కూడా ఇంతకు మించిన తరుణం ఉండబోదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


అలా కాకుండా, టీఆర్‌ఎ్‌సకు సంఖ్య తగ్గి.. బీజేపీకి పెరిగితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తప్పవు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ తన స్థానాన్ని పదిలం చేసుకోనుంది. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆ పార్టీ మరింత దూసుకుపోనుంది. అటు కాంగ్రెస్‌ నుంచే కాదు.. ఇటు టీఆర్‌ఎస్‌ నుంచి కూడా ఆ పార్టీలోకి వలసలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ, గ్రేటర్‌పై కాషాయ జెండా ఎగరేస్తే మాత్రం తెలంగాణలో ఆ పార్టీకి తిరుగుండదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అదే సమయంలో, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదని తెలిపాయి. అందుకే, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను మూడు పార్టీలకూ టర్నింగ్‌ పాయింట్‌గా అభివర్ణిస్తున్నారు. అంతేనా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు అత్తెసరు మెజారిటీ రావడం లేదా ఎక్స్‌ అఫీషియో ఓట్లతో మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాల్సి పరిస్థితి వస్తే ప్రభుత్వ వ్యతిరేకత మరోసారి తెరపైకి రానుంది. 


కుల సంఘాలతో కేటీఆర్‌ వరుస భేటీలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పీఠం నిలబెట్టుకోవడానికి టీఆర్‌ఎస్‌ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ‘అందరి’నీ దగ్గర చేసుకొని ముందుకు సాగేందుకు వ్యూహాలు పన్నుతోంది. వేర్వేరు కారణాల వల్ల యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, ప్రైవేట్‌ టీచర్లు, అధ్యాపకులు, రియల్టర్లు తదితరులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారనే ప్రచా రం జరుగుతోంది.


ఈ నేపథ్యంలో కేటీఆర్‌, ఇతర మం త్రులు..వివిధ కుల సంఘాలు, మత సంస్థలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, కళాశాలలు-పాఠశాలల అసోసియేషన్లు, రియల్‌ ఎస్టేట్‌ రంగం, భవన నిర్మాణరంగ కార్మికులు, స్థానికంగా నివసిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారి అసోషియేషన్లు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగసంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు.శుక్రవారం కూడా మున్నూరు కాపులు, ఆర్య వైశ్యుల అభినందన సభల్లో పాల్గొన్నారు.


ఇక,గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న 3 ఎమ్మెల్సీ పదవులను మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, రజక సామాజికవర్గానికి చెందిన బస్వరాజు సారయ్య, వైశ్య సామాజిక వర్గానికి చెందిన బొగ్గారపు దయానంద్‌కు కట్టబెట్టడం కూడా ఎన్నికల కోణంలోనే చూడాల్సి ఉంటుందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. మరో 4 ఎమ్మెల్సీ పదవులను పద్మశాలి, కురుమ, విశ్వబ్రహ్మణ, నాయీబ్రహ్మణ సామాజిక వర్గాలకు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆయా వర్గాల్లోని అసంతృప్తిని చల్లార్చడమే ఈ ప్రకటన వెనక ఉద్దేశమని అంటున్నారు. 


మేనిఫెస్టోలోనూ..

దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరింత దూకుడు పెంచడంతో టీఆర్‌ఎస్‌ నేతలు జాగ్రత్తగా వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ విడుదల చేశారు. 2016లో మేనిఫెస్టోను పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు విడుదల చేశారు. 

మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మేనిఫెస్టో విడుదల బాధ్యతను స్వయంగా సీఎం కేసీఆరే తీసుకున్నారు. తానే మీడియా ముందుకు వచ్చి ఎన్నికల ప్రణాళికను వివరిస్తే ప్రజల్లోకి బాగా వెళ్తుందని, అది పార్టీకి మేలు చేస్తుందనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  


Advertisement
Advertisement
Advertisement