వరి రైతు వెన్ను విరిచిన కేంద్రం

ABN , First Publish Date - 2021-06-15T09:51:41+05:30 IST

వరిపంట చూడడానికి అందంగా ఉంటుంది. మనందరి ప్రధాన ఆహారంగా కడుపు నింపుతుంది. కానీ వరి పంట చుట్టూ ఉన్న సమస్యలను మనం అర్థం చేసుకోవాలి....

వరి రైతు వెన్ను విరిచిన కేంద్రం

వరిపంట చూడడానికి అందంగా ఉంటుంది. మనందరి ప్రధాన ఆహారంగా కడుపు నింపుతుంది. కానీ వరి పంట చుట్టూ ఉన్న సమస్యలను మనం అర్థం చేసుకోవాలి. 2020–21లో వరి రైతులు అనుభవించిన కష్టాలను చూసిన తరువాతయినా ఈ సమీక్ష అవసరం. వ్యవసాయ ధరల నిర్ణాయక సంఘం (సిఏసిపి) తాజాగా వెలువరించిన నివేదికలో వరి పంట సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) జాతీయ సగటు క్వింటాలుకు 1839 రూపాయలని ప్రకటించారు. వరిపంట సాగు ఖర్చు (ఏ2) రూ.1078గా, కుటుంబ సభ్యుల శ్రమ విలువ క్వింటాలుకు రూ.241గా, నిర్ణయించి, ఆ రెండూ కలిపి (ఏ 2+ ఎఫ్‌ఎల్) రూ.1319గా నిర్ణయించారు. దీనికి మరో రూ.641 లాభం కలిపి ఏ–గ్రేడ్ వరి ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1960గా నిర్ణయించారు. సాధారణ వరి ధాన్యానికి రూ.1940గా నిర్ణయించారు. వాస్తవానికి అన్ని పంటలకు ఏ2 + ఎఫ్‌ఎల్ పై 50 శాతం కలుపుతున్నామని కేంద్రం చెప్పుకుంటున్నప్పటికీ, వరి ధాన్యానికి అంత కూడా కలపలేదు. మరో రూ.18 తక్కువే కలిపారు. 

వరి సేద్యానికి తెలంగాణలో సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) క్వింటాలుకు రూ.2738 అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ సి‌ఏ‌సి‌పి కోసం నివేదిక పంపింది. ఆ నివేదిక ప్రకారం తెలంగాణలో సమగ్ర ఉత్పత్తి ఖర్చు రూ.1698.50. ఏ2: క్వింటాలుకు రూ.987, ఏ2+ ఎఫ్‌ఎల్: క్వింటాలుకు రూ.1178 అని ఆ నివేదిక  పేర్కొంది. అంటే జాతీయ సగటు కంటే, సిఏసిపి తెలంగాణలో చాలా తక్కువ ఖర్చు చూపిస్తున్నదని అర్థం. 

సి‌ఏ‌సి‌పి సంస్థ తెలంగాణలో ఎకరానికి 2049.20 కిలోల సగటు ధాన్యం దిగుబడి వస్తుందని ప్రకటించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా ఎకరానికి 2040 కిలోలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజాగా అంచనా వేస్తున్న సగటు దిగుబడులకు ఇది చాలా తక్కువ. 

స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరలను కేంద్రం ప్రకటించిందా? అలా ప్రకటిస్తే క్వింటాలుకు రూ.2547 కనీస మద్దతు ధరగా ప్రకటించి ఉండాల్సింది. కానీ క్వింటాలుకు రూ.1960 మాత్రమే ప్రకటించింది. దాని వల్ల ప్రతి క్వింటాలు పై రైతుకు రూ.587 నష్టం వాటిల్లుతోంది. అంటే ఎకరానికి సగటున 20 క్వింటాళ్ళ లెక్కన చూసినా ఎకరానికి రైతుకు రూ.11,740 నష్టం వస్తుంది. ఈ లెక్క ప్రకారం,  (2.5 ఎకరాలున్న) సన్నకారు రైతులు రూ.29,350 నష్ట పోతున్నారు. 5 ఎకరాలున్న చిన్నకారు రైతులు రూ.58,700 నష్టపోతున్నారు. రాష్ట్రంలో రెండు సీజన్లలో రైతులు ఒక కోటి ఎకరాలలో వరి సాగు చేస్తే, స్వామినాథన్ కమిషన్ ప్రకారం మద్దతు ధరలు అందక నష్టపోయే మొత్తం సంవత్సరానికి 11,740 కోట్ల రూపాయలు. 

తెలంగాణ రాష్ట్రంలో వరి క్వింటాలుకు సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) రూ.2738గా ఉందనీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధర క్వింటాలుకు 4107 రూపాయలుగా నిర్ణయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం దానిని బుట్టదాఖలా చేసి తాను అనుకున్న పద్ధతిలోనే కనీస మద్దతు ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖ రాసి చేతులు దులుపుకుని మౌనంగా ఉంటున్నది. రాష్ట్ర సమగ్ర ఉత్పత్తి ఖర్చులను మద్దతు ధరలతో పోల్చినప్పుడు ప్రతి క్వింటాలుపై వరి రైతుకు 778 రూపాయలు నష్టం వస్తుంది. అంటే ఎకరానికి 20 క్వింటాళ్ళ లెక్కన చూసినా మొత్తం నష్టం రూ.15,560. సన్నకారు రైతులు రూ.38,900. చిన్నకారు రైతు రూ.77,800 నికరంగా నష్ట పోతున్నారు. ఈ నష్టాన్ని పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తున్నది.? ఎకరానికి 5000 రైతుబంధు సహాయం అందించినా రాష్ట్ర ప్రభుత్వ అంచనా నష్టంలో (15,560–5000)10,560 నష్టం ఇంకా మిగిలే ఉంటుంది. చివరికి సి‌ఏ‌సి‌పి అంచనా ప్రకారం నష్టం (11,740–5000) 6740 రూపాయలు ఇంకా మిగిలే ఉంటుంది. పైగా రైతుబంధు సహాయం తప్పకుండా సాగు చేస్తున్న రైతుకే అందుతుందన్న గ్యారంటీ లేదు. అది ఆ భూమి యజమానికి చెందుతుంది తప్ప ఆ భూమిలో సాగు చేసే కౌలురైతుకు అందదు. అప్పుడు కౌలు రైతులు కౌలు భారాన్ని పూర్తిగా మోయడమే కాక, ధరల నిర్ణయంలో మోసాల వల్ల ఇంకా ఎక్కువ నష్టపోతున్నారు. 

సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2)లో వరి సేద్యానికి సంబంధించి స్వంత భూమికి కౌలు విలువ ఎకరానికి రూ.11,881, స్థిర పెట్టుబడి పై వడ్డీ రూ.1641, పనిముట్లు, భవనాల విలువ తరుగు రూ.17,740, పంటల బీమా పథకం ప్రీమియం 600 రూపాయలు లాంటివి మద్దతు ధరల నిర్ణయం సమయంలో అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. 

పొలం నుంచి పంట సేకరణ కేంద్రం లేదా మార్కెట్ యార్డుకు రవాణా ఖర్చులను సైతం కలపడం లేదు. ధాన్యం ఆరబోయడానికి, క్లీనింగ్ యంత్రం క్లీన్ చేయడానికి అయ్యే ఖర్చులను కూడా కలపడం లేదు. ఇవన్నీ రైతులు ప్రతి సంవత్సరం అదనంగా ఖర్చు పెడుతూ ఉన్నవే. ధాన్యం నింపే సంచి ఖరీదు, హమాలీల ఖర్చు, ధాన్యం రోడ్లపై ఆరబోసిన సమయంలో కాపలా కూలీల ఖర్చు కూడా ఉత్పత్తి ఖర్చులలో కలపడం లేదు. పొలంలో బోర్లు వేయడానికి, డ్రిప్ లేదా స్ప్రింక్లర్ బిగించడానికి, నీటి కోసం పైప్‌లైన్లు దూరం నుంచి వేసుకురావడానికి, ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి రైతులు లక్షల రూపాయలు అప్పు చేస్తుంటారు. కానీ మద్దతు ధరల సమయంలో ఇవేవీ పరిగణనలోకి తీసుకోవడంలేదు. వీటన్నిటికీ కలిపి స్థిర పెట్టుబడిపై వడ్డీ పేరున రూ.1641 వేస్తారు కానీ వాటిని మద్దతు ధర నిర్ణయ సూత్రంలో(ఏ2) కలపరు. సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2 ప్రకారం) మద్దతు ధరలను ప్రకటిస్తే తప్ప, ఈ సమస్య పరిష్కారం కాదు. 

సి‌ఏ‌సి‌పి సంస్థ మద్దతు ధర ప్రకటించడానికి తీసుకునే జాతీయ సగటు ఖర్చులు కూడా చాలా తక్కువ ఉంటున్నాయి. వీటి కంటే తెలంగాణలో ఖర్చులు తప్పకుండా ఎక్కువ అవుతున్నాయి. ఉదాహరణకు సి‌ఏ‌సి‌పి సంస్థ వరి విత్తన ఖర్చు ఎకరానికి 930 రూపాయలు, రసాయన ఎరువుల ఖర్చు 3199, పశువుల ఎరువు ఖర్చు 172, పురుగు, కలుపు విషాల ఖర్చు 1544, సాగునీటి చార్జీల ఖర్చు 427, యంత్రాల కిరాయి ఖర్చు 4231, స్వంత యంత్రాల ఖర్చు 253, దుక్కిటెడ్ల కిరాయి ఖర్చు 112, స్వంత దుక్కిటెడ్ల ఖర్చు 254, కూలీల ఖర్చు 8344, చిల్లర ఖర్చులు 53 రూపాయలుగా అంచనా వేసింది. పైగా స్వంత కుటుంబ సభ్యుల శ్రమకు (ఎంత మంది పని చేసినా) ఎకరానికి, 6 నెలల పంట కాలానికి కేవలం 4179 రూపాయలుగా నిర్ణయించారు. కౌలుభూమికి కౌలు చెల్లింపు కింద ఎకరానికి ఒక సీజన్‌కు కేవలం రూ.2590 లెక్కగట్టారు. నీటి పారుదల సౌకర్యం కలిగిన భూమి ఇంత తక్కువకు కౌలుకు ఎలా దొరుకుతుందో సి‌ఏ‌సి‌పికి మాత్రమే తెలియాలి. 

పై వివరాలన్నీ పరిశీలిస్తే వరి ధాన్యం పండించే రైతుకు ఎక్కడ నష్టం జరుగుతోందో స్పష్టంగా అర్థమవుతుంది. రాజ్యాంగం 7వ షెడ్యూల్ ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, మార్కెట్లు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నది. కనీస మద్దతు ధరల నిర్ణయంలో కేంద్రం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి. కేంద్రంపై పోరాడే ధైర్యం లేదనుకుంటే, తానుగా రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించి రాష్ట్ర రైతులందరికీ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరలు అందించే చర్యలు చేపట్టాలి. ఏమీ చేయకుండా, కేవలం 5000 రూపాయలు భూముల యజమానులకు ‘రైతుబంధు’ కింద ఇచ్చేసి చేతులు దులుపుకుంటే ధాన్యం పండించే రైతులకు జరిగే నష్టానికి అంతు అనేది ఉండదు. 

కన్నెగంటి రవి

శేరుపల్లి రాజేష్

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2021-06-15T09:51:41+05:30 IST