Abn logo
Feb 25 2020 @ 02:04AM

ప్రాచీన ఆధునిక సాహిత్యాలకు వారధి మా నాన్న

స్వామి వివేకానంద చెప్పినట్టు ‘వర్క్‌ ఈజ్‌ వర్షిప్‌’ అనే దానికి నిలువెత్తు సాక్ష్యం మా నాన్న. పనిని దైవంలా భావించారు కాబట్టే ఇంత శిష్య సంపదని పొందగలిగారు. ఆరోగ్యం బాగాలేదని తెలిసినా, కంప్లీట్‌ రెస్ట్‌ తీసుకోమని చెప్పినా వినలేదు. కోచింగ్‌ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సాహితీ వ్యాసంగం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసిన రోజు కూడా రాస్తూనే ఉన్నారు. ‘‘శ్రీశ్రీ, శ్రీనాథుడు గురించి మీ నాన్నగారి తర్వాతే ఎవరైనా’’ అంటుంటే, ‘‘ఆయన చెప్తారనే తెలుగు ఆప్షన్‌ తీసుకున్నామన్న’’ మాట ఎవరినోటనైనా వింటూంటే మా నాన్న ధన్యజీవి కదా అని అనిపించేది.


తెలుగు సాహితీ ప్రపంచంలో, పోటీ పరీక్షల బోధనలో, విమర్శనా రంగంలో.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి వచ్చిన పనిని విజయవంతంగా ముగించుకొని ఇంకా ఏదో చేయాలనే తపనే తపస్సుగా భావించిన మా నాన్నగారు ద్వా.నా.శాస్ర్తి గత సంవత్సరం ఫిబ్రవరి 25న తన ఇష్టదైవం శివ సాన్నిధ్యాన్ని చెందారు. దాన్ని మేము జీర్ణించుకోలేకపోయినా నిజం అదే కదా! దైవం నిర్ణయించిన కార్యక్రమాన్ని కష్టం అనుకోకుండా యజ్ఞంలా నిర్వహించి తన ప్రస్థానాన్ని ఆనందంగా ముగించారు. 


అమ్మని అర్థం చేసుకున్నంతగా నాన్నను అర్థం చేసుకోము కదా! నేనూ అంతే.. అమ్మచాటు బిడ్డనే. నాన్నంటే భయం. సాయంత్రం 6, 7, దాటిందంటే ఇంట్లో ఉండాలి. ఉదయాన్నే లేవాలి. టైము పర్‌ఫెక్ట్‌గా పాటించాలి. అన్ని కూరలు తినాలి. అయితే, ఈ క్రమశిక్షణ జీవితంలో ఒక సమున్నత స్థానంలో ఉంచిదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.


నాన్న జీవితం తెరచిన పుస్తకమే. ప్రతిపేజీ అందరికి తెలిసిందే. ఆయన జీవిత చరిత్రలో ఉన్నది ఉన్నట్టుగా పరిచయం చేసినదే. ఆయనకి భేషజాలు లేవు. ఇగో అసలు లేదు. మా అమ్మకు అనారోగ్యం ఉన్నప్పుడు ఇంటిపని నాన్నే చేసేవారు. నాన్నే అమ్మ అయిన క్షణాలెన్నో. మా చెల్లికి టైఫాయిడ్‌ వస్తే రాత్రి పగలు హాస్పిటల్‌లో ఉండి కంటికిరెప్పలా చూసుకున్నారు. అందుకే నాన్నే అమ్మ కూడా. 


ఆయన ఎం.ఫిల్‌ కోసం గుంటూరుకు మకాం మార్చాం. మారేపల్లి రామచంద్రశాస్త్రి కవితా రచనలు అన్నీ ఉల్లిపొర కాగితాల్లా.. చిరిగిపోయి, అక్షరాలు చీమ తలకాయంత సైజులో ఉన్నాయి. భూతద్దం పట్టుకొని వాటిని తీసుకొని, సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. నిజంగా ఎం.ఫిల్‌ కోసం అంత కష్టపడాలా? అదే మా నాన్న ప్రత్యేకత. ప్రతీ పని ఒక యజ్ఞంలా చేసేవారు. స్వామి వివేకానంద చెప్పినట్టు ‘వర్క్‌ ఈజ్‌ వర్షిప్‌’ అనే వాక్యానికి నిలువెత్తు సాక్ష్యం మా నాన్న. పనిని దైవంలా భావించారు కాబట్టే ఇంత శిష్య సంపదని పొందగలిగారు. 


ఆరోగ్యం బాగాలేదని తెలిసినా, కంప్లీట్‌ రెస్ట్‌ తీసుకోమని చెప్పినా వినలేదు. కోచింగ్‌ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సాహితీ వ్యాసంగం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసిన రోజు కూడా రాస్తూనే ఉన్నారు. ‘‘శ్రీశ్రీ, శ్రీనాథుడు గురించి మీ నాన్నగారి తర్వాతే ఎవరైనా’’ అంటుంటే, ‘‘ఆయన చెప్తారనే తెలుగు ఆప్షన్‌ తీసుకున్నామన్న’’ మాట ఎవరినోటనైనా వింటూంటే మా నాన్న ధన్యజీవి కదా అని అనిపించేది. 


చివరగా మా నాన్న జీవితాన్ని క్లుప్తంగా మూడు మాటలలో చెప్తాను.


ఆయన ఎంచుకున్న రంగంలో ఉన్నతస్థానం అధిరోహించానుకున్నారు. ఆయనకున్న లోపాల్ని, కష్టాల్ని వెనక్కి నెట్టి ఆయన శక్తినంతా పాజిటివ్‌ వైపే ఫోకస్‌ చేశారు. షార్ట్‌కట్‌లో విజయం సాధించాని ఎప్పుడూ అనుకోలేదు. ప్రతీక్షణం కష్టపడ్డారు. ఎప్పుడూ రిలాక్స్‌ అవ్వలేదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా పుస్తకాలతో, పుస్తకాల మధ్యే ఆయన శ్వాస, ధ్యాస. పేరు రాగానే బురద జల్లడం, కింద పడాలని తోసేయడం చూస్తాం. కాని మా నాన్న ఆ పేరుని, గౌరవాన్ని చివర వరకు నిలబెట్టుకున్నారు. అందరికీ, అన్ని ప్రాంతాలవారికీ, అన్ని వయసు వారికీ ‘అందరివాడు’ మా నాన్న అంటే అతిశయోక్తి కాదు. ప్రాచీన సాహిత్యానికి, ఆధునిక సాహిత్యానికి ఒక వారధిలా నిలిచిన మా నాన్న తెలుగు ఉన్నంతవరకు సాహితీవినీలాకాశంలో ధృవతార. ఒక కవి అన్నట్లు మేఘంలా గర్జిస్తూ కరకుగా కనబడతాడు నాన్న. తొలకరి జల్లులాంటి ప్రేమను మదిలో దాచుకుంటాడు నాన్న.


సముద్రమంత గాంభీర్యం, ఆకాశమంత ప్రేమ ‘మా జీవితాలకి పూలబాట పరిచి ఆయన కష్టాల పల్లకిపై మమ్మల్ని మోసిన మా నాన్నకి’ సాష్టాంగ ప్రణామం. 

– ద్వాదశి శశికాంత్‌,

ద్వా.నా.శాస్త్రి కుమారుడు

(నేడు ద్వా.నా.శాస్ర్తి వర్ధంతి)

Advertisement
Advertisement
Advertisement