ఆరంభం అద్భుతం, ప్రయాణమే జటిలం

ABN , First Publish Date - 2021-08-12T09:58:29+05:30 IST

పోల్చకూడదు కానీ, పోల్చవలసి వస్తున్నది. తనకు లభించిన అవకాశాన్నీ, తన ద్వారా తెలంగాణకు లభించిన ప్రజాస్వామిక అవకాశాన్నీ చేజేతులా ఈటల రాజేందర్ చేజార్చుకోవడం గురించి ఈ శీర్షిక కొన్ని వారాల కిందట...

ఆరంభం అద్భుతం, ప్రయాణమే జటిలం

పోల్చకూడదు కానీ, పోల్చవలసి వస్తున్నది. తనకు లభించిన అవకాశాన్నీ, తన ద్వారా తెలంగాణకు లభించిన ప్రజాస్వామిక అవకాశాన్నీ చేజేతులా ఈటల రాజేందర్ చేజార్చుకోవడం గురించి ఈ శీర్షిక కొన్ని వారాల కిందట అసంతృప్తిని వ్యక్తం చేసింది. పోలీసు సర్వీసు నుంచి స్వచ్ఛందంగా తప్పుకుని, ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వడివడిగా వేసిన అడుగులు మెరుగైన సంకల్పబలాన్ని, స్పష్టతను ప్రదర్శించాయి. తటపటాయింపు లేదు, ఊగిసలాట లేదు, బెంబేలు పడడం లేదు. ప్రవీణ్ కుమార్ తాను అనుకున్న మొదటి మజిలీని సునాయాసంగా మాత్రమే కాదు, సంరంభంతో చేరుకున్నారు. 


ఒకరు ప్రభుత్వం నుంచి మరొకరు ప్రభుత్వ సర్వీసు నుంచి, ఒకరు రాజకీయవాది, మంత్రి–మరొకరు బహుజనవాది, అధికారి. ఒకరు నిర్బంధం కారణంగా, మరొకరు స్వచ్ఛందంగానూ తమ తమ నెలవులు తప్పారు. తరువాత ఎట్లా వ్యవహరించారన్నంత వరకే పోలిక. -రాజేందర్ తాను ఒంటరి పోరాటం చేయలేనని అనుకున్నారు. రక్షణ లేకపోతే, నిలబడలేనని అనుకున్నారు. రాజేందర్ సొంతంగా నడక సాగించాలని ఆశించినట్టే, ప్రవీణ్ కుమార్ కూడా సొంత రాజకీయసంస్థను స్థాపిస్తారని భావించినవారు, ఆశించినవారు ఉన్నారు. ఆయన ఒక జాతీయ బహుజన పార్టీలో చేరడంపై మిత్ర, అమిత్ర చర్చ సాగుతూనే ఉన్నది. ప్రవీణ్ కుమార్ ఎంపిక సరైనదా కాదా అన్న ప్రశ్న ఉండవచ్చును కానీ, దాని వెనుక బలహీనతో, అభద్రతో ఉన్నదని చెప్పలేము. 


ఇప్పుడు కూడా రాజేందర్ తెలంగాణ ముఖ్యమంత్రితో తలపడుతున్నారు, సొంతబరిలోనే నెగ్గకుండా ఎట్లా ఆయనను అణచిపెట్టాలా అని కేసిఆర్ అనేక ‘పథకాలు’ పన్నుతున్నారు. ఈటల సొంతంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఉంటే, ఉప ఎన్నికలలో గెలిచినా ఓడినా, ఒక విలువ స్థాపితమయ్యేది. కానీ, ఆయన ఒక పెద్ద జాతీయపార్టీ భద్రమైన ఆశ్రయం నుంచి చేస్తున్న పోరాటం, ఫలించినా లేకపోయినా అందులో కొత్తగా వ్యక్తమయ్యే విలువ ఏదీ లేదు. గెలుపు పార్టీకి వెడుతుంది. ఓటమి ఈటల ఖాతాలో వెడుతుంది. అయినా, హుజూరాబాద్ విషయంలో కేసిఆర్ ఎందుకంత హడావుడి చేస్తున్నారంటే, పార్టీలో మరెవరూ తలలు ఎగరేయకుండా. ఎంతటి నాయకుడికైనా అధినాయకుడి ముందు స్థానబలమేమీ పనిచేయదని చెప్పడానికి. 


గురుకుల విద్యాలయాల అధికారిగా ప్రవీణ్ కుమార్ అనేక విజయాలు సాధించారు. ప్రస్ఫుటంగా కనిపించే ఫలితాలను ఆవిష్కరించారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చదువుకున్న విద్యార్థులకు ఒక నెట్‌వర్క్‌ను రూపొందించారు. వారి మధ్య సహకారాన్ని, భావ ఐక్యతను పెంపొందించారు. తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు ఆయనకు ఒక అభిమాని, అనుయాయి, కార్యకర్త ఉంటారు. దీనికి తోడు తెలంగాణలో ఇప్పటికే వ్యాపించి ఉన్న దళిత బహుజనవాద వాతావరణం కూడా ఆయనకు ఒక భూమికగా పనిచేసింది. ఇదంతా ఏ సమస్యా లేకుండా నూటికి నూరుపాళ్లూ ప్రవీణ్‌కు కలసివచ్చే బలమని చెప్పడానికి లేదు కానీ, ఆయన తొలి అడుగు వేయడానికంటె ముందే అనుచరబలం మూలధనంగా సిద్ధమై ఉందన్నది వాస్తవం. ఈ బలం, బలగం పోయిన ఏడాదీ ఉన్నది, వచ్చే ఏడాదీ ఉంటుంది. అయినా, రాజకీయాలలో ప్రవేశించే నిర్ణయం ఇప్పుడే ఆయన ఎందుకు తీసుకున్నారు, ఏ ఏ ప్రాతిపదికల మీద బహుజన సమాజ్ పార్టీని తన గమ్యంగా ఎంచుకున్నారు, తన కార్యాచరణకు సంబంధించి ఎటువంటి సంప్రదింపులు, నేపథ్య సన్నాహాలు ఆయన చేసుకున్నారు.. అన్న వివరాలు తెలియవు కానీ, సర్వీసునుంచి బయటకు వచ్చిన తరువాత అగమ్యంగా కొంతకాలం కూడా ఉండకూడదని, వెంటనే రంగంలోకి దిగడం వల్లనే ఫలితం ఉంటుందని ఆయన అనుకున్నారని అర్థమవుతోంది. తన సామాజిక అస్తిత్వాన్ని ఆధారం చేసుకుని, బిసిల ప్రతినిధిగా, రాజేందర్ కూడా బిఎస్పీలో చేరడం వంటి సాహసం చేసి ఉంటే, ఇప్పుడు ప్రవీణ్ కూడా చేరాక, ఆ పార్టీకి ఇంకా మంచి శక్తి వచ్చి ఉండేదా? ఊహాజనితమైన ప్రశ్నే కానీ, ప్రాతిపదిక లేని ప్రశ్న మాత్రం కాదు. 


నల్లగొండ సభ విజయవంతమైంది. ప్రవీణ్ కుమార్ ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. చదువులోను, రకరకాల విజయాలలోను, ప్రాతినిధ్యాలలోను దళిత బహుజనుల భాగస్వామ్యం పెంచడం గురించి మాట్లాడారు. దళిత బంధుతో సహా ప్రభుత్వ దళితాభివృద్ధి విధానాలను ప్రశ్నించారు. దళిత అంశాలను నిత్యం వార్తలలో ఉంచే ఒక ముఖ్యమంత్రితో ప్రవీణ్ కుమార్ తగిన విధంగానే సంవాదంలోకి దిగారు. ప్రత్యర్థి నైతికత మీద గురిపెట్టడం కెసిఆర్ యుద్ధ వ్యూహాలలో ఒకటి. అసైన్డ్ భూములు, దేవాలయ భూములు అన్న అస్త్రాన్ని ఈటల రాజేందర్ పై ప్రయోగించారు. తరువాత, అన్ని భూములూ వివాదం కాగలవన్న భయాన్నీ ప్రయోగించారు. ప్రవీణ్ కుమార్‌పై తెలంగాణ ఉద్యమ కాలంలో పోలీసు అధికారిగా అణచివేతను ప్రయోగించారన్న విమర్శను సంధించారు. దగ్గరుండి ఉద్యమకారులను హింసింపజేసిన వారిని బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కోసం పార్టీలో చేర్చుకున్నవారికి అటువంటి విమర్శ చేసే హక్కున్నదా అన్న ప్రతివిమర్శ కూడా సహజం. ఇక ప్రవీణ్ అడుగుల వెనుక బిజెపి జాడలున్నాయన్న విమర్శా మొదలయింది. నల్లగొండ సభలో ఆయన బిజెపినో, మతతత్వ విధానాలనో విమర్శించి ఉండవలసిందా? ఒకప్పుడు స్నేహంతో, ఇప్పుడు భయంతో బిజెపితో మెతకగా ఉంటున్న బిఎస్‌పి వైఖరి కూడా ఇటువంటి ఆరోపణలకు ఆస్కారం ఇస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో అయినా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా బిఎస్‌పి ఓట్లు ఎవరిని గెలిపించి, ఎవరిని ఓడిస్తాయి అనే చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ఆ చర్చల్లోనూ బిజెపి పేరు వినిపిస్తోంది.


విద్యార్థి ఉద్యమకారులతో కఠినంగా వ్యవహరించారని మాత్రమే కాదు, కరీంనగర్ జిల్లా పోలీసు అధికారిగా ఉండగా, నక్సలైట్ల అణచివేత చర్యలలో పాలుపంచుకున్నాడని కూడా ప్రవీణ్‌ పేరు తరచు ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. విప్లవ శ్రేణులు, అభిమానులు మాత్రమే కాక, దళితవాదులలో కూడా కొందరు అటువంటి అంశాల ఆధారంగా ప్రవీణ్ కుమార్‌ను విమర్శిస్తూ ఉంటారు. గురుకుల పాఠశాలల అధికారిగా ప్రవీణ్ కుమార్ తెచ్చుకున్న మంచి పేరులో ఆ ప్రస్తావనలు వెనుకపట్టు పట్టాయి. కానీ, యూనిఫాం వదిలి బహిరంగ రాజకీయాలలోకి వచ్చిన తరువాత, గతంలోని అనేక అంశాలు ప్రత్యర్థులకు అవకాశాలు అవుతాయి. తప్పదు ప్రజాజీవితంలోకి వచ్చాక విమర్శలను ఎదుర్కొనవలసిందే. సమర్థించుకోవడమో, తప్పులు జరిగి ఉంటే, విమర్శించుకోవడమో, అంతకు మించిన ఒప్పులు చేయడమో మాత్రమే మార్గం. 


ప్రసంగాలలోను, ఇంటర్వ్యూలలోను ప్రవీణ్ కుమార్ అభిప్రాయాలను గమనిస్తే, ఆయన దళిత రాజకీయాలను సీరియస్‌గా చేపట్టబోతున్నట్టు అర్థమవుతుంది. గతంలో ఇటువంటి రాజకీయ ప్రయత్నాలు చేసిన ఎవిఎస్ రెడ్డి, జయప్రకాశ్ నారాయణ, జెడి లక్ష్మీనారాయణలకు ఒక రాజకీయ సిద్ధాంత ఆలంబన లేకపోవడం ఒక పరిమితి అయిందేమో తెలియదు. దళిత సాధికారత అన్న భావనకు ప్రాచుర్యం ఇచ్చి, దానికి సంస్థాగత రూపం ఇచ్చి, భారత రాజకీయాలలో కొత్త తోవను ఆవిష్కరించిన మాన్యవర్ కాన్షీరామ్ స్థాపించినదే అయిప్పటికీ, బహుజన సమాజ్ పార్టీ ఆయన మార్గాన్ని నూటికి నూరుపాళ్లు ముందుకు తీసుకుపోయిందని చెప్పలేము. బహుజనం మహాశక్తిగా ఎదిగే క్రమాన్ని రంగంలో ఉన్న అధిపత్య శక్తుల పార్టీలు సులువుగా అనుమతిస్తాయని అనుకుంటే అది అమాయకత్వమే. బడుగు, బలహీన వర్గాలను, దళితులను, మైనారిటీలను రకరకాల ప్రాతిపదికలమీద చీల్చి ఎన్నికల సమీకరణాలతో క్రీడలాడే అపరచాణక్యులు రంగం మీద ఉన్నారు. అలాగే, నిష్ఠ త్యాగం వంటి పునాదుల మీద ఎదిగిన కమ్యూనిస్టు పార్టీల ఆచరణలోనే ప్రలోభాలు, స్వార్థాలు, బలహీనతలు చొరబడినప్పుడు, బహుజన రాజకీయవాదులు అధికార రాజకీయాల లాలసలో సైద్ధాంతిక కట్టుబాటుతో ఉంటారని ఆశించడం కూడా పొరపాటు. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న రోజులలో బిఎస్‌పి చేసినవి, సాధించినవి తక్కువేమీ కాదు. కొన్ని రంగాలలో ఆ పార్టీ తన ముద్రను గాఢంగా వేయగలిగింది. కానీ అదే సమయంలో, ఎన్నికల ప్రాధాన్యాలు, ఆర్థిక అవసరాలు, వ్యక్తిత్వ లోపాలు రకరకాల అవలక్షణాలకు కూడా దారితీశాయి. ఇక దక్షిణాదిలో ఆ పార్టీ పెద్దగా కాలూనకపోవడానికి కారణంగా, ఇక్కడి సమాజంలో పరిపక్వత లేకపోవడమేనన్న వ్యాఖ్యలు వింటుంటాము. కానీ, దళిత బహుజనుల చైతన్యం, విద్యాది స్థితిగతులు దక్షిణ భారతంలోనే అధికం. సాధికారతా రాజకీయాలకు గట్టి దన్ను ఇక్కడి నుంచే వచ్చే అవకాశం ఉన్నది. నూతన సమాజాన్ని నిర్మించడానికి జీవితాంతం శ్రమించినవారు బిఎస్‌పి వేదికల మీద నుంచి కూడా తమ ప్రయత్నాలు చేశారు. ఎవరి లోపమో కానీ, అభిమానులకు మాత్రం ఆశాభంగమే ఎదురయింది. ప్రవీణ్ కుమార్ ఈ నేపథ్యాన్నంతా లోతుగా అధ్యయనం చేసే ఉంటారు. బిఎస్‌పి వంటి బలమైన శక్తి ఉన్నప్పటికీ, దానికి వెలుపల యుపితో సహా దేశంలో అనేక చోట్ల బలమైన స్వతంత్ర దళిత నాయకత్వ స్వరాలు వినిపిస్తున్నాయి. వారి ఆచరణను కూడా ప్రవీణ్ కుమార్ గమనించవలసి ఉన్నది. 


సాధికారతా రాజకీయాల విషయంలో ఎంతో అస్పష్టత అలుముకుని ఉన్నది. ఉద్యమం ద్వారానే ఓట్లను సమీకరించుకోవాలని కన్షీరామ్ చెప్పారు. సాధికారతను లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ, పార్టీ కేవలం ఎన్నికల పార్టీగా ఉండకూడదు. అది ఉద్యమపార్టీగా ఉండాలి. కేవలం రాజకీయాధికారం నిజమైన సాధికారతను ఇవ్వదు. సామాజిక ప్రజాస్వామ్యం లేనిది రాజకీయ ప్రజాస్వామ్యం వృథా అని బాబా సాహెబ్ అంబేడ్కర్ అన్నమాటను పూర్తిఅర్థంలో అవగతం చేసుకోవాలి. పది లక్షల చొప్పున డబ్బు కుమ్మరించినా, పదిస్థానాలను గెలుచుకున్నా, పొత్తులు పెట్టుకుని అధికారాలు సాధించినా వాస్తవమైన సంపూర్ణ సాధికారత సిద్ధించదు. సామాజిక మార్పు కోసం నిరంతరం ఉద్యమిస్తూ, రాజకీయాధికారం ద్వారా మార్పును వేగవంతం చేస్తూ, ఆర్థిక హంగు ద్వారా అభివృద్ధిని పొందాలి. సామాజిక, ఆర్థిక పెట్టుబడులు అందరికీ అందుబాటులోకి వచ్చిన రోజు సమానావకాశాల స్వప్నం నిజమవుతుంది. అప్పటి దాకా తడబడినా సరే అడుగులు ముందుకు పడవలసిందే. 


కె. శ్రీనివాస్

Updated Date - 2021-08-12T09:58:29+05:30 IST