Abn logo
Aug 6 2020 @ 01:09AM

ప్రజాకళల దారిదీపం

జనం గొంతుక వంగపండు ప్రసాదరావు గళం శాశ్వతంగా మూగబోయింది. నక్సల్బరీ, శ్రీకాకుళం ఉద్యమ స్ఫూర్తితో ఎదిగిన సీనియర్ తరంలో మరొకరు అమరులయ్యారు. ఉద్యమంతో స్ఫూర్తి పొంది ఉద్యమాలకు ఎదిగి వచ్చిన మహోన్నత కళాకారుడు, మహా కవి, రచయిత వంగపండు. వంగపండు విశాఖపట్నంలో నౌకలు తయారు చేసే కేంద్ర ప్రభుత్వం సంస్థలో ఉద్యోగం చేసేవారు. ‘విప్లవాల యుగం మనది విప్లవిస్తే జయం మనది’ అని చెప్పిన సుబ్బారావు పాణిగ్రాహి స్ఫూర్తి వంగపండు జీవితాన్నే మార్చేసింది. కళా సాంస్కృతిక రంగాల ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని, మధ్యలోనే ఉద్యోగం వదిలేసారు. గద్దర్ తోపాటు జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. వేలాది కళాకారులను తీర్చి దిద్దారు. వేలాది యువజనులు స్ఫూర్తి పొంది ఉద్యమాల్లో కార్యకర్తలుగా, నాయకులుగా ఎదిగారు. యువకిశోరాలు అమరులవుతుంటే వంగపండు కన్నీరు పెట్టారు. వారి త్యాగాలను ఆయన గానం చేశారు. వంగపండు 400 పాటలు రాశారు. పలు పాటలు పన్నెండు భాషల్లోకి అనువాదమైనాయి. ‘కార్మిక విజయం’ వంటి అనేక నృత్య నాటికలు ప్రదర్శించారు. వంగపండు ఉద్యోగం వదిలేయడంతో కుటుంబం అతలాకుతలమైంది. ఆ భారమంతా కుటుంబంపై, పిల్లల జీవితాలపై పడింది. సంసారాన్ని ఈదిన విజయలక్ష్మి అక్క ధైర్యం, త్యాగం మరువలేనిది. వంగపండు పాటలు జగత్ ప్రసిద్ధం. వంగపండు పాటల ద్వారా, చెణుకులు ద్వారా, ప్రసంగాల ద్వారా మూఢ విశ్వాసాలను వివరించి, శాస్త్రీయ, హేతువాద దృష్టితో నవ్వించే వారు. దోపిడి, పీడన, అణిచివేత, ఎన్ని రూపాల్లో సాగుతున్నదో అర్థం చేయించేవారు.


1980 నుండి వంగపండు, గద్దర్ సహచరులుగా, అనేక సభలు సమావేశాల్లో కలిసి నడిచాము. రాష్ట్రంలోనే గాక ఢిల్లీ, సింద్రీ అఖిల భారత మహాసభలు, సింగరేణి సభలు, దశాబ్దాలుగా అంకిత భావంతో ఈ దేశంలో సమ సమాజం నిర్మాణం కోసం కృషి చేశారు. దోపిడి, పీడన లేని కార్మిక వర్గ సమత, మమతలు, స్వేచ్ఛా సమానత్వ రాజ్యం కోసం శాస్త్రీయ విజ్ఞానం కోసం స్వప్నించారు. కలలు సాకారం కావడానికి జీవితాన్ని అంకితం చేశారు. మేము 1990లో సాయుధ ఉద్యమం నుండి వైదొలగి సమస్త వర్ణ వర్గ కుల లింగ జాతి మత ప్రాంత భాష వివక్షకు వ్యతిరేకంగా దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక నిర్మాణం ప్రారంభించినప్పుడు నైతిక మద్దతు నిచ్చారు వంగపండు. గురజాడ కన్యాశుల్కంపై చర్చ చేసినపుడు మద్దతుగా నిలిచారు. ‘జ్ఞానమొకడి సొత్తు కాదన్నా! అది సకల జాతుల సంపదోరన్నా’ అని ఎలుగెత్తి చాటారు. బీసీగా తాను ఉద్యమం ఇంటా బయటా ఎదుర్కొన్న వివక్ష అనుభవాలను మాతో పంచుకున్నారు. వంగపండు పాటలు కొన్ని పుస్తకంగా బి నర్సింగరావు ప్రచురించారు. ‘కొండ కింది పందికొక్కు’  వంటి అనేక కథలు పత్రికలలోనే ఉండి పోయాయి. ఒక నవల కూడా రాసినట్టు గుర్తు. ఆర్ నారాయణ మూర్తి, కమలహసన్ వంటి సుప్రసిద్ధ నటులు పార్వతీపురం వెళ్ళి మరీ సినిమాలకు పాటలు రాయించుకున్నారు. ఉద్యమ నాయకత్వం, ఇతర మిత్రులు వద్దనడంతో సినిమాలకు రాయడం ఆగిపోయింది. వంగపండు ప్రభుత్వ పురస్కారాలను వద్దనేవారు. వంగపండు లేని లోటు తీర్చ లేనిది. మహా కవిగా, మహా కళాకారుడుగా, ఉద్యమకారుడుగా నమ్మిన ఆశయాలకోసం జీవితాన్ని అంకితం చేసిన వంగపండు సాహిత్య సాంస్కతిక రంగాలలో చిరంజీవి. వందలాది పాటలతో, వేలాది కళా ప్రదర్శనలతో కొన్ని తరాలకు స్ఫూర్తి నిచ్చారు.


ఉత్తరాంధ్ర గద్దర్గా ప్రసిద్ధి చెందారు. వంగపండు చరిత్ర ఉద్యమాలతో ముడిపడి ఉంది. ఆయన చరిత్ర ఉద్యమ చరిత్రలో భాగం. వంగపండు సాహిత్య సాంస్కృతిక ఆకాశంలో వేగు చుక్క. ఒక మహోన్నత మానవుడు. ప్రజాసాహిత్యం, ప్రజాకళల్లో వంగపండు కలకాలం వెలుగు దీపంగా దారి దీపంగా నిలిచి ఉంటాడు. వంగపండు ప్రసాదరావు పేరిట విశాఖ, అమరావతి, కర్నూలు, తిరుపతి కేంద్రాలలో ఆడిటోరియాలు కట్టి, కళాకారులకు ఆయన పేరిట స్కాలర్ షిప్‌లు, పెన్షన్లు ఇవ్వాలి. కళాకారులకు ప్రత్యేక ఉద్యోగ కల్పన ద్వారా ఆయన స్ఫూర్తిని సమాజానికి అందించాలి. వంగపండు పేరిట విశ్వ విద్యాలయాల్లో ప్రజా కళలు, జానపద కళల అధ్యయన పీఠాలు నెలకొల్పడం ఆయనకు అర్పించగలిగే ఘన నివాళి.

బి.ఎస్‌. రాములు

Advertisement
Advertisement
Advertisement