గోవధపై నిషేధాన్ని ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2021-07-25T07:33:44+05:30 IST

‘‘గోవధ నిషేధ చ ట్టం పాతది. దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వానికి, ఉద్యోగులకు సాధ్యం కాదు. సంపూర్ణంగా అమలు చేయాలంటే ప్రతి గ్రామంలో కబేళాల వద్ద పోలీసు బందోబస్తు పెట్టాల్సి ఉంటుంది

గోవధపై నిషేధాన్ని ఎత్తివేయాలి

మునులు గోవులను వధించేవారని చదివాను

బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌, భజరంగ్‌దళ్‌ వారు ఓట్ల కోసం మతోన్మాదులుగా మారుతున్నారు

వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి


ఎమ్మిగనూరు, కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 24: ‘‘గోవధ నిషేధ చ ట్టం పాతది. దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వానికి, ఉద్యోగులకు సాధ్యం కాదు. సంపూర్ణంగా అమలు చేయాలంటే ప్రతి గ్రామంలో కబేళాల వద్ద పోలీసు బందోబస్తు పెట్టాల్సి ఉంటుంది. గోవధను నిషేధించే యంత్రాంగం కూడా లేదు. దీనిని రద్దు చేయాలి’’ అని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని, వైసీపీ ఎమ్మెల్యేగా చెప్పడం లేదని, ఒక లౌకికవాదిగా మాత్రమే మాట్లాడుతున్నానని అన్నారు. శనివారం ఎమ్మిగనూరులోని తన స్వగృహాంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆహారంపైనా, ఆహారం సేకరించటంపైనా నిషేధం విధించడం ప్రాథమిక హక్కులకు భంగకరమన్నారు. గోవధ నిషేధంపై ప్రపంచంలో ఎక్కడా చట్టం లేదన్నారు. అలాంటి చట్టం బీజేపీ ప్రభుత్వం, ఆర్‌ఎ్‌సఎస్‌, భజరంగ్‌దళ్‌ సంస్థలకు బక్రీద్‌ పండుగప్పుడే గుర్తుకు వస్తుందన్నారు. ఓట్ల కోసం వారంతా హిందూ మతోన్మాదులుగా మారుతున్నారని ఆరోపించారు. పరమత సహనం లేకుండా మైనార్టీలపై, హిందువుల్లో ద్వేషం పెంచుతున్నారని విమర్శించారు. బీజేపీ నాయకత్వం... పార్టీ, ఉపశాఖలు సంయమనం పాటించేలా చూడాలన్నారు. పూర్వం మునులు గోవులను వధించే వారిని తాను చదివినట్లు చెప్పారు. ముస్లీం సమాజానికి శతాబ్దాల నుంచి గోవు ఆహారంగా ఉందన్నారు. అన్ని దేశాల్లోనే ఈ ఆహారపు అలవాటు ఉందన్నారు. లౌకిక వాదులు దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. 


ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు పెట్టాలి: బీజేపీ

మైనార్టీలకు అనుకూలంగా రాజకీయాలు చేస్తూ, మెజార్టీ హిందువుల మనోభావాలను చులకన చేస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేని పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.హరీష్‌ బాబు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గోవధను ప్రోత్సహిస్తూ నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు. గోవధ నిషేధ చట్టం ఈ దేశంలో ఉండాల్సిన అవసరముందని భారత రాజ్యాంగం పేర్కొందన్న విషయాన్ని ఎమ్మెల్యే మరచిపోరాదన్నారు. హిందువుల మనోభావాలను, భారతీయ సంస్కృతిని కించపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతామన్నారు. 

Updated Date - 2021-07-25T07:33:44+05:30 IST