బంతి ప్రభుత్వ కోర్టులోనే ఉంది!

ABN , First Publish Date - 2022-02-04T06:11:26+05:30 IST

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణ (పి.ఆర్‌.సి.) పైన అటు ప్రభుత్వానికీ ఇటు ఉద్యోగుల పి.ఆర్‌.సి. సాధన సమితికీ మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడింది...

బంతి ప్రభుత్వ కోర్టులోనే ఉంది!

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణ (పి.ఆర్‌.సి.) పైన అటు ప్రభుత్వానికీ ఇటు ఉద్యోగుల పి.ఆర్‌.సి. సాధన సమితికీ మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడింది. సమ్మె తేది ఫిబ్రవరి 6 అర్ధరాత్రి అని పి.ఆర్‌.సి. సాధన సమితి ఎప్పుడో ప్రకటించి, ప్రభుత్వానికి నోటీసు కూడా ఇచ్చింది. ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నట్లుగా, ఉద్యోగులు జీవితాంతం సమ్మె చేయలేరు. సమ్మె ప్రారంభమైన తరువాత కూడా, సమస్య చర్చల ద్వారా పరిష్కారం కావాల్సిందే. సమ్మెకు ముందస్తుగా కాక, తదనంతరం జరిగే చర్చల ద్వారానే ప్రస్తుత వివాదానికి పరిష్కారం లభించే పరిస్థితిని నివారించడం సాధ్యం కాదా! సమ్మె అనివార్యమేనా?


అసలు, ఉభయ పక్షాల మధ్య పీటముడికి కారకులెవ్వరు? అన్నది కీలకమైన ప్రశ్న. వాస్తవానికి, సంప్రదింపులు కూడా పోరాటంలో భాగమే. ఆ విధంగా చూస్తే, సంప్రదింపులకు రండీ, అంటూ ఉద్యోగులని ప్రభుత్వం పదే పదే పిలవటం కూడా, ఉద్యోగుల మీద ప్రభుత్వం చేసే పోరాటంలో అంతర్భాగమే. చర్చలకు రాకుండా మొండిగా వ్యవహరిస్తూ, సమ్మెకే ఉబలాటపడుతూ, ప్రజా జీవితానికి ఆటంకాలు కల్పించే అపరిపక్వ పెడధోరణిని ఉద్యోగుల సాధనా సమితి అనుసరిస్తున్నదని ప్రజలకు చెప్పే ఎత్తుగడ ప్రభుత్వానిది. లోతుగా పరిశీలిస్తే, ఉద్యోగుల సమితి ప్రభుత్వం చెబుతున్నట్లుగా, చర్చల్ని నిరాకరించడం లేదు. చర్చలకు, మూడు అంశాలతో కూడిన షరతు మాత్రమే పెట్టింది. 


మొదటిది: పి.ఆర్‌.సి. విషయమై ప్రభుత్వం ఏకపక్షంగా, ఉద్యోగుల అనుమతితో నిమిత్తం లేకుండా, ప్రస్తుతం ఉన్న జీతాలను, ఇంటి అద్దె అలవెన్స్‌లనూ తదితరాలను తగ్గించే విధంగా, నష్టకరంగా ఉన్న 3 జీ.వో.లను రద్దు చేయాలి, లేదా అమలు జరపకుండా అబయన్స్‌లో పెట్టాలి. రెండోది: జీ.వో.ల ప్రకారం కొత్త జీతాలు కాకుండా, అంతకుముందు డిసెంబరు నెలలో చెల్లించిన పాత జీతాలనే జనవరి నెలకు కూడా చెల్లించాలి. మూడోది: అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదిక ప్రతిని తమకు అందించాలి. ...ఈ మూడు అంశాలను ప్రభుత్వం ఆమోదిస్తే చర్చలకు అంగీకరిస్తామని సాధనా సమితి స్పష్టం చేసింది.


మొదట, ఈ మూడు అంశాలలోని ఉచితానుచితాలను పరిశీలించాలి. ఏకపక్షంగా విడుదల చేసిన జీ.వో.లను అమలు జరపటాన్ని ఆమోదించి, కిందటి డిసెంబరు నెలకన్నా జనవరి నెలలో తక్కువ జీతాలు తీసుకొని చర్చల్లో పాల్గొనటం అంటే, తగ్గించిన జీతాలను ఆమోదించి తీసుకొంటూ, ఒక బలహీనమైన స్థితిలో ఎదుటిపక్షంతో మాట్లాడవలసి ఉంటుంది. ప్రభుత్వానిది పైచేయి అవుతుంది. యజమాన్యం ఎల్లవేళలా తన పనిమనుషులను అలాంటి నిస్సహాయ స్థితిలోనే అట్టిపెట్టి ఉంచాలని కోరుకొంటుంది. అది పనివాళ్లకు చాలా దయనీయమైన పరిస్థితి. గత్యంతరంలేని పరిస్థితుల్లో, రెండు అసమానపక్షాల మధ్య చర్చల ప్రహసనం జరిగిన సందర్భాలు లేకపోలేదు. కానీ, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాంటి దుస్థితిలో లేరు. అసలు చర్చలు జరిపిన తరువాత జీ.వో.లను విడుదల చేయాలా లేక, జీ.వోలను విడుదల చేసిన తరువాత చర్చలు జరపాలా? ఆట ఆడక ముందు నిబంధనలు రూపొందించాలా లేక, ఆట ఆడిన తరువాత నిబంధనలు తయారుచేస్తారా? ఇది వేతనాలకే గాక, హక్కులకీ, ఆత్మ గౌరవానికీ కూడా సంబంధించిన విషయం. ఎందుకంటే, వేతనాల సవరణ నిమిత్తమై ఏర్పాటైన అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదికని– ఆ కమిషన్ ఎవరి నిమిత్తం ఏర్పడిందో, ఎవరి కోసం సిఫారసులు చేసిందో– ఆ ఉద్యోగులకు ఇవ్వటానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది.


ఉద్యోగ సంఘాలు ఆది నుంచీ అశుతోష్ మిశ్రా నివేదిక ప్రతిని తమకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూనే ఉన్నాయి. కమిషన్‌ నివేదికని ఉద్యోగ సంఘాలకు అందించకుండా, అసలు బహిర్గతమే చేయకుండా దాచి పెట్టడం రాష్ట్ర ప్రభుత్వ కుట్ర. కమిషన్‌ నివేదికతో నిమిత్తం లేకుండానే చర్చలు జరిపి, జీ.వో.లు విడుదల చేయటం అనే కొత్త సంప్రదాయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ప్రస్తుతానికే కాకుండా, భవిష్యత్తులో కూడా పే రివిజన్‌ కమిషన్‌తో అసలు పనే లేకుండా పూర్తిగా ఎత్తివేసే కుట్ర ఇందులో దాగి ఉన్నది. అసలు చర్చలకు ప్రాతిపదిక ఏమిటి? ప్రభుత్వమే ఏర్పరచిన కమిషన్‌ నివేదికే కదా! ఆ నివేదికలో పొందుపరచిన అంశాలే కదా! అందులోని అంశాలను ఇరుపక్షాల్లో ఎవరైనా పూర్తిగా ఆమోదించవచ్చును, వ్యతిరేకించవచ్చును, లేదా కొన్ని భాగాలు సవరించవచ్చును. కానీ, అసలు కమిషన్‌ నివేదికనే బహిర్గతపరచను అనే ఈ ప్రభుత్వ వైఖరిని తప్పకుండా ఓడించి తీరవలసిందే. ఎందుకంటే, అది దశాబ్దాల పోరాటం ద్వారా సాధించుకొన్న హక్కు.


ఉద్యోగ విరమణ వయస్సుని 62ఏళ్లకి పెంచినందుకు నాయకులు ఉబ్బితబ్బిబ్బైనట్లుగా ప్రజలకు అర్థమైంది. ముఖ్యమంత్రిని అభినందించేదాకా వ్యవహారం వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మూడు జీ.వో.లను ఏకపక్షంగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (ఎ.పి.టి.ఎఫ్‌) వంటి కొన్ని సంస్థలూ, అలాగే ఉద్యోగవర్గంలోని ఆలోచనాపరులు మూడు జీ.వో.ల్లోని నష్టకరమైన కథా కమామిషులను బహిర్గతం చేశారు. ఈ వాస్తవాన్ని గమనించిన సాధారణ ఉద్యోగులు కూడా సంఘ నాయకత్వాలతో నిమిత్తం లేకుండానే, జీ.వో.ల మీద నిరసనోద్యమాలు ప్రారంభించారు. దాంతో తేరుకొన్న సంఘాల నాయకత్వం తిరిగి ఉద్యమబాట పట్టింది. సంఘాలన్నీ ఐక్యమై ఒకే గొడుగు కింద ‘పి.ఆర్‌.సి. సాధనా సమితి’ ఏర్పాటైంది. తద్వారా ఉద్యోగులందరినీ ఐక్యం చేయగలిగారు. ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖలు, ఆర్‌.టి.సి. వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఆందోళనలకే గాక, సమ్మెకు కూడా సిద్ధపడ్డారు. ఉద్యోగుల్లో చాలా గొప్ప ఐక్యత వచ్చింది. ఇది ఉద్యోగుల తొలి విజయంగా భావించవచ్చు.


ఏదేమైనా, సమ్మె అనివార్యమయితే, అందుకు బేషరతుగా సంప్రదింపులకు రావాలన్న ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. ఉద్యోగులు పెట్టిన షరతులకు అర్థం సంప్రదింపులకు అడ్డంగా ఉన్న ఆటంకాలను తొలగించమనే. చర్చలకు ఆటంకాలను కల్పించిన ప్రభుత్వానిదే వాటిని తొలగించే బాధ్యత కూడా అవుతుంది. సమ్మె జరిగితే యావత్తు ప్రజా జీవనం స్తంభించిపోతుంది. అలాంటి పరిస్థితికి కారణం ఉద్యోగులే అని ప్రజలకు నచ్చచెప్పవచ్చులెమ్మన్న ప్రభుత్వ ధీమా ఒక భ్రమగానే మిగిలిపోతుంది. ప్రభుత్వమే నిందాపాత్రమౌతుంది. ఈ ప్రభుత్వం ‘‘ఉద్యోగుల స్నేహితుడు’’ అనే మాటల్లోని బూటకత్వం బహిర్గతమౌతోంది. ఇప్పటికే దాదాపు 14లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులను అనివార్యంగా ఐక్యం చేసి, వారి నిరసనను మూటకట్టుకొన్నది. ‘‘ఇది చాలదు, మాకు ఇంకా కావాలి’’ అనుకుంటే, తన ఉద్యోగ వ్యతిరేక, అహంకారపూరిత ధోరణిని కొనసాగించుకోవచ్చును. కానీ, ఉద్యోగులకు మాత్రం ప్రస్తుత వైఖరికి భిన్నంగా వ్యవహరించే అన్ని ద్వారాలను ప్రభుత్వమే మూసి వేసింది. ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులోనే ఉన్నది. 

వై.కె.

సెంటర్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌


Updated Date - 2022-02-04T06:11:26+05:30 IST