నిషేధం మాటున వ్యధ

ABN , First Publish Date - 2021-10-20T09:12:57+05:30 IST

నిషిద్ధ భూముల వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. క్షేత్రస్థాయిలో చట్టాలు, నిబంధనలు, కనీసం మార్గదర్శకాలను కూడా పాటించకుండా భూములను ఇష్టానుసారంగా నిషేధ భూముల జాబితాలో చేరుస్తున్నారన్న ఆరోపణలకు బలం

నిషేధం మాటున వ్యధ

  • 22-ఏ వివాదాలతో రైతులకు కష్టాలు
  • రాజకీయ వైరానికి పావుగా నిషేధ జాబితా
  • కోర్టులో పెద్దఎత్తున కేసులు దాఖలు
  • ఈ పరిస్థితిపై రెవెన్యూ శాఖ అసంతృప్తి
  • ఏం జరుగుతోందంటూ కలెక్టర్లకు లేఖ
  • జాబితా సమీక్షించి నివేదించాలని ఆదేశం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నిషిద్ధ భూముల వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. క్షేత్రస్థాయిలో చట్టాలు, నిబంధనలు, కనీసం మార్గదర్శకాలను కూడా పాటించకుండా భూములను ఇష్టానుసారంగా నిషేధ భూముల జాబితాలో చేరుస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ప్రభుత్వ నివేదికలు వెలుగుచూస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జోక్యం చేసుకొని 22-ఏ కేసుల్లో వివాదాలెందుకు వస్తున్నాయని ఆరాతీసేదాకా వ్యవహారం ముదిరిపోయింది. జిల్లాస్థాయిలో నిషేధ భూముల జాబితా తయారీ, తిరిగి సవరణ, నోటిఫై, డీ నోటిఫైలు పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని బాధితులు, రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్యాయంగా తమ భూములను నిషేధ జాబితాలో చేర్చారంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు 670 కేసులు దాఖలయినట్లు రెవెన్యూవర్గాలే చెబుతున్నాయి. కట్టుదాటి, నియంత్రణ కోల్పోయి, అడ్డగోలుగా, ఇష్టానుసారంగా రెవెన్యూ అధికారులు కొన్ని భూములను ఏ స్థాయిలో నిషేధ భూముల జాబితాలో చేర్చేస్తున్నారనేందుకు ఇంతకుమించిన నిదర్శనం అక్కర్లేదు. నిషేధ భూముల జాబితా నిర్వహణలోని లోపాలు, ఇతర అంశాల వల్లే హైకోర్టులో భారీగా కేసులు పడుతున్నాయని ఇటీవల జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు రాసిన లేఖలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఆందోళన వ్యక్తంచేశారు. నిషేధిత జాబితా 22-ఏను అమలుచేస్తున్న విధానమే లోపభూయిష్టంగా ఉందని ఆ లేఖలో ఆయన ఏకరువు పెట్టారు. ఇప్పుడున్న రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని 22-ఏ, అందులో క్లాజులను అధ్యయనం చేసి పక్కాగా జాబితాలు సమీక్షించి సవరించాలని, వాటిని వీలైనంత త్వరగా సర్కారుకు నివేదించాలని ఆదేశించారు. 


అవసరమైన చోట నిషేధమేది?

విశాఖలోని ఓపెద్ద భూమి విషయంలో 22-ఏను ప్రయోగించి రాత్రికిరాత్రే నిషేధిత భూముల జాబితాలో దానిని చేర్చడం సంచలనం సృష్టించింది. ఈ పరిణామాల నేపథ్యంలో విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. సీఎం ఆదేశాలతో అధికారులు దీనిపై దృష్టిపెట్టారు. కోర్టుల్లో భారీగా కేసులు దాఖలయ్యే  పరిస్థితి ఎందుకొస్తోంది...క్షేత్రస్థాయిలో నిషేధ జాబితా తయారీ ఎలా ఉందనే దానిపై ఉన్నతస్థాయి అధికారులు సమీక్ష జరిపారు. 22-ఏ అమలులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ తక్షణమే పరిష్కారాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. ‘‘అనేక కేసుల్లో అసలైన సర్వే నంబర్‌ను, దాని పరిధిలోని సర్వే సబ్‌డివిజన్‌ నంబర్లు, భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా నిషేధ భూముల జాబితాను నోటిఫై చేస్తున్నారు. ఏ భూమిని ఏ సెక్షన్‌ కింద నిషేధిస్తున్నారో కూడా స్పష్టత లేదు. దీని వల్ల ఆయా సర్వే నంబర్లలోని మొత్తం భూములు, ప్రైవేటు, పట్టా భూములు రిజిస్ట్రేషన్‌  చేసుకోలేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వాస్తవానికి అనేక కేసుల్లో నిషేధం అవసరం ఉన్న భూములను ఆ జాబితాలోకి తీసుకురావడం లేదు. అవసరం ఉన్న చోట తగిన మార్పులు చేయడంలేదు.


ప్రజా అవసరాలకోసం ప్రభుత్వం సేకరించిన భూములు, భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు కేటాయించిన భూములు, సీలింగ్‌ భూములు, పోరంబోకు, బీఎస్‌ 15(4) భూముల విషయంలో ఇది జరుగుతోంది. ప్రస్తుతం భూమి రికార్డుల స్వచ్ఛీకరణ జరుగుతున్నందున ఈ అంశంపై దృష్టిపెట్టండి. ఏ భూమి నిషేధ జాబితాలోకి వస్తుంది? ఏది రాదో స్పష్టత తీసుకురండి. జాబితాలను సమీక్షించుకోవాలి.  మండలం, జిల్లా వారీగా నిషేధ జాబితాను సమీక్షించుకోవాలి. వాటిని తాజాపరచి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలి’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-20T09:12:57+05:30 IST