విలువైన 5 విషయాలు

ABN , First Publish Date - 2020-09-11T05:30:00+05:30 IST

మానవుడికి విలువైన విషయాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటి గురించి మహా ప్రవక్త ముహమ్మద్‌ ఒక సందర్భంలో ప్రస్తావించారు...

విలువైన 5 విషయాలు

మానవుడికి విలువైన విషయాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటి గురించి మహా ప్రవక్త ముహమ్మద్‌ ఒక సందర్భంలో ప్రస్తావించారు. 

ఆయనను ఒక వ్యక్తి కలిసి ‘‘జీవితంలో మేలైన అంశాలు ఏమిటి? వేటిని మేలైనవిగా గుర్తించాలి?’’ అని అడిగాడు. 


మహా ప్రవక్త ఏవి మేలైనవో, వాటిని ఎప్పుడు గుర్తించాలో వివరిస్తూ ‘‘అయిదు అంశాలను మరో అయిదు అంశాల కన్నా మేలైనవని తెలుసుకో. వృద్ధాప్యం రావడానికి ముందే యవ్వనాన్ని గుర్తించు. వ్యాధి రాకముందే ఆరోగ్యాన్నీ, లేమి దాపురించక ముందే కలిమినీ, పనులు మీద పడి నిన్ను ఆక్రమించుకోవడానికి పూర్వమే తీరికనూ, మృత్యువు రావడానికి ముందే జీవితాన్నీ గుర్తించు’’ అని ఉపదేశించారు (హదీస్‌ గ్రంథం: మిష్కాత్‌)

ఇహలోక సౌఖ్యాలకే ప్రాధాన్యం ఇస్తూ, పరలోకం గురించి ఆలోచన చేయని వారిని మహా ప్రవక్త ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండేవారు. ఒక రోజు ఆయన నమాజ్‌ చేయడానికి మసీదులోకి ప్రవేశించారు. పవిత్రంగా, ప్రశాంతంగా ఉండవలసిన ఆ ప్రదేశంలో కొందరు విరగబడి నవ్వుతూ ఉండడం ఆయన కంట పడింది. 

వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మీ కోరికలను హరించే దాన్ని అధికంగా స్మరిస్తూ ఉన్నట్టయితే అది మిమ్మల్ని ఇలా నవ్వనిచ్చేది కాదు. అదే మృత్యువు. మృత్యువును ఎక్కువగా స్మరించండి. అది మీ సమస్త వాంఛలనూ చంపేస్తుంది’’ అని అన్నారు.

సత్కర్మలు ఆచరిస్తూ, సన్మార్గంలో జీవించే వ్యక్తిని మృత్యువు సైతం గౌరవిస్తుందనీ, సమాధి సాదరంగా ఆహ్వానిస్తుందనీ మహా ప్రవక్త చెప్పేవారు. ‘‘విశ్వాసిని ఖననం చేసినప్పుడు సమాధి అతనికి స్వాగతం పలుకుతుంది. అతనికోసం అది విశాలమవుతుంది. దాని నుంచి స్వర్గం వైపు ఒక ద్వారం తెరుచుకుంటుంది. దురాచారుడూ, దుర్మార్గుడూ అయిన అవిశ్వాసిని పూడ్చినప్పుడు అతన్ని సమాధి ఈసడించుకుంటుంది. అతని పక్కటెముకలు ఒక దానిలో ఒకటి చొచ్చుకుపోయేటంత ఇరుకైపోతుంది. అతని మీద డెబ్భై విషసర్పాలు వచ్చి పడతాయి. అంతిమమైన తీర్పు వచ్చే రోజు వరకూ ఇది కొనసాగుతూనే ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు. (హదీస్‌ గ్రంథం: తిర్మిజి)

కాబట్టి జీవితంలో విలువైన విషయాలు ఏవో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సద్వర్తనతో మెలిగి అల్లాహ్‌కు ప్రీతిపాత్రులు కావాలి. 

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2020-09-11T05:30:00+05:30 IST