మెమోలో అలా.. డిస్కమ్‌లు ఇలా!

ABN , First Publish Date - 2022-07-02T08:41:57+05:30 IST

మెమోలో అలా.. డిస్కమ్‌లు ఇలా!

మెమోలో అలా.. డిస్కమ్‌లు ఇలా!

ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌పై గందరగోళం

ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ మెమోలో ‘కటింగ్‌’లకు ఆదేశం

ఇదే విషయంపై గత నెలలో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం 

ఉచితం నుంచి కట్‌ చేయలేదని డిస్కమ్‌ల వివరణ 

వాస్తవం చెప్పాలని రాజకీయ పక్షాల డిమాండ్‌

 

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌ పథకంపై గందరగోళం నెలకొంది. ఎస్సీ, ఎస్టీలకు ఒక కనెక్షన్‌కు మాత్రమే ఉచిత విద్యుత్‌ పథకం వర్తింపజేయాలని, అంతకంటే ఎక్కువ ఉంటే ఉచితం నుంచి మినహాయించాలని ఏపీసీపీడీఎ్‌సల్‌ సీఎండీ ఆదేశించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కాలనీల బయట నివసించే ఎస్సీ, ఎస్టీలకు కూడా ‘ఉచితం’ కట్‌ చేయాలని సూచించారు. దీనిపై ఈ ఏడాది మార్చి 29న అంతర్గత మెమో జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌ పథకానికి డిస్కమ్‌లు తూట్లు పొడుస్తున్నాయంటూ జూన్‌ 20వ ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఉచితం ఉఫ్‌’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏపీసీపీడీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ పద్మాజనార్దన్‌రెడ్డి స్పందించారు. ఈ కథనంలో పేర్కొన్న అంకెలు తప్పని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కనెక్షన్‌లను ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా రెండో కనెక్షన్‌కు ఉచిత విద్యుత్‌ అమలు కాకుండా నియంత్రించడం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీ కాలనీలు, గిరిజన తండాలకు బయట నివసిస్తున్నవారికి ఉచిత విద్యుత్‌ పథకం నుంచి కనెక్షన్‌ తొలగించలేదని, అమలులో ఉందని వెల్లడించారు. అయితే, మార్చి 29వ తేదీన ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పేరిట జారీ చేసిన 852/2022 అంతర్గత మెమోలో ఏముందంటే.. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి ఒకే ఆధార్‌ నంబరుతో రెండు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు ఉండేందుకు వీల్లేదంటూ ఏఏఓలు, ఏఈలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఒకటి కంటే ఎక్కువగా లబ్ధిపొందుతున్న వారి కనెక్షన్లను ఉచిత జాబితా నుంచి తొలగించాలని మెమోలో పేర్కొన్నారు. ఆధార్‌ అనుసంధానం ద్వారా 1,29,584 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రెండు విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నట్లుగా గుర్తించామని, మార్చి 31లోగా వాటిని ఉచిత విద్యుత్‌ పథకం జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాల బయట నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీలను కూడా గుర్తించి, ఉచిత లబ్ధిదారుల జాబితా నుంచి వారి విద్యుత్‌ కనెక్షన్లు తొలగించాలని అంతర్గత మెమోలో స్పష్టంగా ఆదేశాలిచ్చారు. అందుకనుగుణంగా ఎస్సీ-1, ఎస్సీ-2, ఎస్టీ-1, ఎస్టీ- 2 జాబితాలను సవరించాలని పేర్కొన్నారు. ఇవే విషయాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించగా.. ఏపీసీపీడీసీఎల్‌ ఎండీ అవాస్తవాలని కొట్టిపారేశారు. మెమోలోని అంశాలు వాస్తవమా? లేక ఏపీసీపీడీసీఎల్‌ ఎండీ ఇచ్చిన వివరణ నిజమా? అన్నది తేల్చి చెప్పాలని రాజకీయపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  అంతర్గత మెమో తప్పయితే, దానిపై స్పష్టత ఇవ్వాలని సూచించాయి. 

Updated Date - 2022-07-02T08:41:57+05:30 IST