Abn logo
Nov 26 2021 @ 02:28AM

ఆ రుణం దారుణం!

అప్పుల్లోనే కాదు.. చెల్లింపులోనూ తప్పులే

జెన్‌కో అప్పు మారిటైమ్‌ బోర్డుతో చెల్లింపు

సంబంధంలేని సంస్థ నెత్తిన రుణ భారం

పీకల మీదకు రాగానే సర్కారు దొడ్డిదారి

ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలకు జెన్‌కో బకాయిలు

డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని హెచ్చరిక

అప్పటికప్పుడు ఎస్‌బీఐతో చర్చలు

ఇప్పటికే పరిమితులు దాటి జెన్‌కో అప్పు

దీంతో.. తెరపైకి మారిటైమ్‌ బోర్డు

ఆ సంస్థ పేరుతోనే 1500 కోట్ల రుణం

అక్కడి నుంచి కేంద్ర సంస్థలకు చెల్లింపు

ఇంతకీ ఎస్‌బీఐ రుణం ఎందుకిచ్చినట్టు?

బ్యాంకింగ్‌ వర్గాల్లో తీవ్ర చర్చ

ఏపీ అప్పుల చరిత్రలో కొత్త మిస్టరీ


అవసరం తీరాలి... అంతే! అందుకోసం ఎన్ని తప్పులైనా చేస్తారు. నిబంధనలకు పాతరేస్తారు. ఇదీ... జగన్‌ సర్కారు ‘ఆర్థిక విన్యాసాల’ తీరు! అప్పులు చేయడంలోనే కాదు... పీకలమీదకు వచ్చాక పాత అప్పు తీర్చడంలోనూ ‘కొత్తదనం’ ప్రదర్శిస్తున్నారు. కేంద్ర విద్యుత్‌ సంస్థలకు రూ.1500 కోట్ల బాకీని చెల్లించడంలో రాష్ట్రం చూపించిన ‘క్రియేటివిటీ’ చూసి ఆర్థిక నిపుణులే ముక్కున వేలేసుకుంటున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అప్పు... అవసరాల కోసం అప్పు! ఆ అప్పు తీర్చడం కోసం మరో అప్పు! రోజురోజుకూ ఇలా రుణపాశంలో కూరుకుపోతున్న జగన్‌ ప్రభుత్వం తాజాగా మరో సరికొత్త ఆర్థిక విన్యాసం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన  గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ)కు పడిన అప్పు తీర్చేందుకు పెద్ద తప్పు చేసింది. ఇటీవల ఢిల్లీ, ముంబై నుంచి ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ సీఎండీలు, ఇతర అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. ‘మా బాకీలు కడతారా? లేక ఏపీ జెన్‌కోను డిఫాల్టర్‌గా ప్రకటించాలా?’ అని అధికారులు హెచ్చరించారు. బకాయిల వసూలు కోసం సర్కారు పీకమీద కత్తిపెట్టారు. మొత్తానికి... రూ.4,000 కోట్ల అప్పులో రూ.1500 కోట్లు తక్షణం చెల్లించి, మిగిలినవి తర్వాత చెల్లించేలా ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీలతో ప్రభుత్వానికి డీల్‌ కుదిరింది. దీంతో ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ కారాతో రాష్ట్ర ఆర్థిక సలహాదారు, ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ రజనీశ్‌  హుటాహుటిన సంప్రదింపులు జరిపారు. రూ.1500 కోట్ల అప్పు ఇచ్చేందుకు ఒప్పించుకున్నారు. ఆ తర్వాత జరిగిందే... అసలు ట్విస్ట్‌!


తెరపైకి మారిటైమ్‌ బోర్డ్‌

ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీలకు బకాయిపడింది జెన్‌కో! జెన్‌కో పేరుతో వేల కోట్ల రుణాలు తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంది. తెచ్చింది జెన్‌కో, వాడుకుంది ప్రభుత్వం! అప్పును వారిలోనే ఎవరో ఒకరు చెల్లించాలి. కానీ... అప్పుల కథ మలుపు తిరిగింది. ఎప్పటికప్పుడు అప్పులతో బండి లాక్కొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.1500 కోట్లు సర్దుబాటు చేసే అవకాశమే లేదు. ఆర్‌బీఐ తప్ప మరే బ్యాంకూ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వకూడదు. కాబట్టి, ఎస్‌బీఐ నేరుగా రూ.1500 కోట్లను జెన్‌కోకు అప్పుగా ఇస్తుందని... ఆ మొత్తాన్ని జెన్‌కోయే కేంద్ర విద్యుత్‌ సంస్థలకు చెల్లిస్తుందని అంతా భావించారు. కానీ... అది కూడా కుదరలేదు. ఎందుకంటే, కొత్తగా అప్పులు తెచ్చుకునే సామర్థ్యం జెన్‌కోకు లేదు. తనఖా పెట్టడానికి ఆస్తులేమీ మిగల్లేదు. ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే సరిపోతుంది కానీ... ఆ పరిమితి ఎప్పుడో ముగిసిపోయింది. దీంతో ప్రభుత్వం అతి తెలివి ప్రదర్శించింది. ఈ అప్పులతో, తిప్పలతో ఏమాత్రం సంబంధంలేని ఏపీ మారిటైమ్‌ బోర్డు కార్పొరేషన్‌ను తెరపైకి తెచ్చింది. ఎస్‌బీఐ నుంచి రూ.1500కోట్లు ఈ కార్పొరేషన్‌ ఖాతాకు పడగా... అదే మొత్తాన్ని ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీకి బదిలీ చేసినట్లు తెలిసింది. అంటే... జెన్‌కో అప్పును మారిటైమ్‌ బోర్డు తీర్చిందన్న మాట!


అంతు చిక్కని లెక్క

తీరప్రాంతాల అభివృద్ధి కోసం మారిటైమ్‌బోర్డు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ చేసే అభివృద్ధి ఏమిటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే... రాష్ట్రంలో పోర్టులను ప్రైవేటుపరం చేశారు. తాజాగా గంగవరం కూడా చేతులు మారిపోయింది. మారిటైమ్‌ బోర్డు కార్పొరేషన్‌ చేపడుతున్న కార్యకలాపాలు కూడా లేవు. అయినా సరే... రూ.1500 కోట్లు రుణం తీసుకోవడం గమనార్హం. సామాన్యులకు గృహ, విద్యా, వాహన రుణాలు ఇవ్వాలంటే బ్యాంకు అధికారులు సవాలక్ష ప్రశ్నలు సంధిస్తారు. ఎక్కడ ఏ చిన్న తేడా ఉన్నా... రుణం ఇవ్వరు!  అలాంటిది... మారిటైమ్‌ బోర్డుకు అప్పటికప్పుడు రూ.1500 కోట్లు ఎలా అప్పుగా ఇచ్చారు? ఏం చూసి ఇచ్చారు? ఏ అవసరానికి ఇచ్చారు? ఎలా తిరిగి వసూలు చేసుకుంటారు? ఈ ప్రశ్నలకు ఎవరికీ సమాధానం తెలియదు. దీంతో రుణం ఒక దారుణంగా, మిస్టరీగా మిగిలిపోయింది. ఎస్‌బీఐ వ్యవహార శైలి మొత్తం బ్యాంకింగ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.